ఆంధ్రప్రదేశ్‌

మహానంది ఆలయంలోకి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 17: నల్లమల అడవిలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయం లోపలికి వర్షం నీరు చేరింది. సోమ, మంగళవారాల్లో కురిసిన అతిభారీ వర్షాలకు ఆలయంలోకి పెద్దమొత్తంలో నీరు చేరింది. ఆలయం లోపల ఉన్న పుష్కరిణి నిండి వెలుపలకు నీరు శరవేగంగా ప్రవహిస్తుండటంతో లోపలికి వెళ్లి పూజలు చేసేందుకు పూజారులు ఇబ్బందులు పడ్డారు. నీటికి ఎదురు నడవలేనంత వేగంగా ప్రవాహం ఉండటంతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుని ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు నిర్వహించాల్సిన నిత్యపూజలు చేపట్టారు. ఆలయం వెలుపల రెండు పుష్కరిణులు ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టలేనంతగా నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మహానంది గ్రామంలోని అన్ని వీధుల్లోనూ మూడు, నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ భయానక పరిస్థితిని సృష్టించాయి. 30 ఏళ్ల తరువాత మరోమారు ఇంత పెద్దమొత్తంలో వర్షపు నీరు వచ్చి చేరింది. మహానంది పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా 1988లో ఒకసారి భారీ ఎత్తున వర్షపు నీరు ఆలయం లోపలికి వచ్చినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు లేకపోవడంతో నల్లమల అడవిలో కురిసిన వర్షపు నీరు దిగువన ఆలయంలోకి వచ్చి చేరింది. నాడు కురిసిన భారీ వర్షం కారణంగా అడవిలో మట్టికరిగి కొండ రాళ్లు దొర్లుకుంటూ ఆలయ పరిసర ప్రాంతాల వరకు వచ్చినట్లు గుర్తుచేసుకుంటున్నారు. సుమారు ముప్పై సంవత్సరాల తరువాత మహానందిలో ఇంత భారీ వర్షం కురవడం, ఆలయంలోకి నీరు చేరడం, గ్రామంలోని అన్ని వీధుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గ్రామానికి రావడానికి అధికారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల, గాజులపల్లె మార్గాల్లో వాగులు, వంకలు భారీ ఎత్తున ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
*చిత్రం...వర్షం నీటితో మునిగిన మహానంది ఆలయ అంతర పుష్కరిణి