ఆంధ్రప్రదేశ్‌

సహకార రంగానికి పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో సహకార రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సహకార చక్కెర కర్మాగారాలు, డెయిరీలను ఆధునీకరించటంతో పాటు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. దీంతో సహకార చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలకు మహర్దశ పట్టనుంది. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహకార రంగ పరిశ్రమలపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్న కర్మా గారాలు, పునరుద్ధరించాల్సిన వాటిపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పోటీని తట్టుకుని స్వావలంబన సాధించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహకార చక్కెర కర్మాగారాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చెరకు రైతులకు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్న రైతులకు లీటర్‌కు రూ. 4 బోసన్ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సహకార డెయిరీలను బలోపేతం చేసి, రైతులకు మరింత లబ్ధి చేకూరాలనేదే తన లక్ష్యంగా చెప్పారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో చెరకు పంట సాగు, సహకార చక్కెర కర్మాగారాల మనుగడ, మూతపడిన ఫ్యాక్టరీల గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. చక్కెర పరిశ్రమ, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రజంటేషన్ ఇచ్చారు. దేశం మొత్తంగా 330.7 లక్షల మెట్రిక్ టన్నుల పంచదార ఉత్పత్తి అవుతుంటే అత్యధికంగా 116.7 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతోందని, రెండో స్థానంలో 107.2 లక్షల మెట్రిక్ టన్నుల
ఉత్పత్తితో మహారాష్ట్ర ఉండగా ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 5.02 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని తెలిపారు. రాష్ట్రంలో 10.23 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉందన్నారు. రికవరీలో కూడా ఏపీ 9.3 శాతంతో 11వ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 చక్కెర కర్మాగారాలు ఉంటగా అందులో 18 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. 2006-07 నాటికి రాష్ట్రంలో 102.3 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తికి గాను 100.91 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ జరిగేదని, 2018-19 నాటికి 58.04 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిందన్నారు. సహకార రంగంలో 10 కర్మాగారాలకు గాను 6 మూతపడ్డాయని సీఎం దృష్టికి తెచ్చారు. విజయనగరం జిల్లా భీమసింగిలో ఉన్న విజయరామ గజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ సహకార కర్మాగారాలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి, గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా శ్రీ వేంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. రైతుల బకాయిలు, ఫ్యాక్టరీల వారీగా రుణాలు వాటి మనుగడపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. పేరుకుపోయిన పంచదార నిల్వలతో కలుపుకుని ఇప్పటి వరకు 10 సహకార ఫ్యాక్టరీలపై రూ. 891.13 కోట్ల భారం ఉందని అధికారులు నివేదించారు. రైతుల బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌ను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు సహకార ఫ్యాక్టరీలను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వచ్చే మూడేళ్లలో ఫ్యాక్టరీలన్నింటినీ ఆధునిక పరిశ్రమలుగా మార్చాలని నిర్దేశించారు. మొలాసిస్ వంటి ఉప ఉత్పత్తుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. కడప జిల్లా చెన్నూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట వద్దగల గాజుల మాండ్యం ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని ప్రజలు, రైతుల వద్ద నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు పస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై నివేదిక అందించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చెరకు ఉత్పత్తి తగ్గుతున్నందున అదనపు విలువ జోడించి పరిమిత స్థాయిలో నిర్వహణ ఉండేలా ఉత్పత్తి చేసే అంశాలను పరిశీలించాలని సూచించారు. ఉద్యోగుల బకాయిలపై కూడా దృష్టి సారించాలన్నారు. సాగు తగ్గకుండా దిగుబడులు గణనీయంగా ఉండేలా వ్యవసాయశాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తమిళనాడులో అధిక దిగుబడులకు అనుసరిస్తున్న విధానాలను ఆధ్యయనం చేయాలన్నారు. సహకార డెయిరీల స్థితిగతులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ డెయిరీలకు పాలందించే రైతులకు ప్రతి లీటర్‌కు రూ. 4 బోనస్ చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం పంచుకునే విషయాన్ని ఆలోచించాలన్నారు. సహకార రంగంలో ప్రస్తుతం డెయిరీలు, బల్క్ మిల్క్, కూలింగ్ సెంటర్ల స్థితిగతులను అధికారులు వివరించారు. వీటిని బలోపేతం చేసేందుకు నిర్మాణాత్మక ఆలోచనలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం సహకార డెయిరీల సామర్థ్యాన్ని పెంచటంతో పాటు మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా కొత్త వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. చేయూత ద్వారా మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని, వచ్చే నాలుగేళ్లలో పెద్దఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని, డెయిరీల ద్వారా ఆదాయాలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. డెయిరీల బలోపేతం, మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచటమనే మూడు కోణాల్లో కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ప్రకటించారు.

*చిత్రం...సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి