ఆంధ్రప్రదేశ్‌

ఆ‘పాత’ మధురం.. ఆ భవనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అది మధురమైన జ్ఞాపకాలకు,ఘటనలకు మరపురాని వేదిక. రెండు మహా ఉద్యమాలను చవిచూసింది. ఎందరెందరో మహామహులను తెలుగు రాష్ట్రాలకు అందించింది. వెన్నుపోటు చరిత్రను చూసింది అక్కడే. ప్రజాస్వామ్యాన్ని కాపాడి చరిత్రను తిరగరాసిందీ అక్కడే. మడపతిప్పని యోధులను తయారుచేసింది అక్కడే. రాజకీయ చాణక్యుల ఆలోచనలకు పదును మొదలయిందీ అక్కడే. డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, యువకులను ప్రజాసేవకు పురమాయించిన అతిపెద్ద ప్రజాస్వామ్య వేదిక భవనమది. ఎందరో పాత్రికేయుల అనుభవాలకు పాఠశాలగా మారిన వేదిక అది. అలాంటి వేదికతో దశాబ్దాల నుంచి పెనవేసుకునిపోయిన అనుబంధం ఇక తీరింది. అలాంటి తీపి, చేదు జ్ఞాపకాలను ఇక్కడే వదిలేసి, గతానుబంధాన్ని నెమరవేసుకుని తమకు రాజకీయ వెలుగునిచ్చిన హైదరాబాద్ పాత శాసనసభకు వీడ్కోలు పలికిన వైనమిది. హైదరాబాద్ లోని పాత శాసనసభకు, ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం వీడిపోయింది. శనివారం నాటి వర్షాకాల సమావేశాల ముగింపుతో, 1956 నుంచి కొనసాగిన అనుబంధానికి తెరపడింది. ఇక డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాలు నవ్యాంధ్రలో కొత్తగా నిర్మించిన వెలగపూడిలోనే! ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అడుగుపెట్టింది ఈ పాత శాసనసభలోనే.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకూడా తొలిసారి ఇదే భవనంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్‌గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును అందించింది కూడా ఇదే పాత అసెంబ్లీ భవనమే. నాటి నుంచి కొనసాగుతున్న ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పి.సాంబశివరావు, జ్యోతుల నెహ్రు, పతివాడ నారాయణస్వామి, గౌతు శ్యాంసుందర్ శివాజీ, కళా వెంకట్రావుతోపాటు గాలి, ప్రతిభాభారతి వంటి మండలి ప్రముఖులు తొలుత అడుగుపెట్టింది ఈ అసెంబ్లీలోనే. 1985 ఆగస్టు 3 నుంచి ఉమ్మడిగా ఉన్న అసెంబ్లీ రాష్ట్ర విభజన తర్వాత 2014లో రెండుగా విడిపోయి, పాత అసెంబ్లీని ఏపికి కేటాయించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనంలో 1952 నుంచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కార్యకలాపాలు జరిగాయి. పివి నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, దామోదర సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, చెన్నారెడ్డి, ఎన్టీరామారావు, నాదెండ్ల భాస్కరరావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, ఆచార్య ఎన్‌జి రంగా, బెజవాడ గోపాలరెడ్డి, గౌతులచ్చన్న, రావి నారాయణరెడ్డి, ధర్మభిక్షం, నర్రా రాఘవరెడ్డి, బోడెపూడి వెంకటేశ్వరరావు, భాట్టం శ్రీరామ్మూర్తి, తెనే్నటి విశ్వనాధం, బాగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఓంకార్, పూసపాటి ఆనందగజపతిరాజు, నల్లారి అమర్‌నాధ్‌రెడ్డి, కడప కోటిరెడ్డి, ముద్రగడ పద్మనాభం,కాసు కృష్ణారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, పి.జనార్దన్‌రెడ్డి, జానారెడ్డి, సరోజినీ పుల్లారెడ్డి, కె.వి. రంగారెడ్డి, సలాఉద్దీన్ ఓవైసీ, ఎ నరేంద్ర, వి.హన్మంతరావు, దాడి వీరభద్రరావు వంటి మరిచిపోలేని ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలను అందించిన ఈ అసెంబ్లీ భవనంలో ఇకపై ఎలాంటి కార్యకలాపాలు జరగవన్న ఆలోచన పాత-కొత్త తరం జీర్ణించుకోలేకపోతోంది.
1984 ఆగస్టు సంక్షోభానికి ఇదే పాత అసెంబ్లీ సజీవ సాక్షిగా నిలిచింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంతో మళ్లీ ఎన్టీఆర్ గద్దెనెక్కి అడుగుపెట్టిందీ ఇక్కడే. ఈ పాత అసెంబ్లీ భవనం వెన్నుపోటుదారు రూపంలో నాదెండ్ల భాస్కరరావును, చరిత్రకారుడిగా ఎన్టీఆర్‌ను ఆవిష్కరింపచేసింది. జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాలకూ సాక్షిగా నిలిచింది. ఇన్ని తీపి-చేదు అనుభవాలు, అనుంబంధాన్ని వదులుకుని.. ఏపి కొత్త అసెంబ్లీ భవనం వెలగపూడికి తరలనుంది. ఆ సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సన్నిహితులతో ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇక ఇదే ఇక్కడి చివరి అసెంబ్లీ అని తెలుసుకున్న కొత్త ఎమ్మెల్యేలు, పాత భవనంతో అనుబంధం ఉన్న పాత ఎమ్మెల్యేలు, సిబ్బంది పాత భవనంలోని అసెంబ్లీ హాల్‌లోనే చంద్రబాబుతో కలసి ఫొటోలు దిగారు. బాబు కూడా వారిని ఉత్సాహపరిచారు. ఆ సందర్భంగా బాబు ఓసారి అసెంబ్లీ భవనాన్ని కలియతిరిగారు.