ఆంధ్రప్రదేశ్‌

‘దేశం’లో గోదా‘వర్రీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలయిన ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు ఆ పార్టీకి కుల సంకటంగా పరిణమించాయి. కాపు రిజర్వేషన్లపై కాపు వర్గం, దానిని వ్యతిరేకిస్తున్న బీసీల కుల సమీకరణతో క్యాబినెట్ కూర్పు క్లిష్టంగా మారుతోంది. కాపులను ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న బీసీలను ప్రసన్నం చేసుకోవలసిన అనివార్య పరిస్థితి పార్టీకి ఏర్పడింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీల్లోని శెట్టి బలిజ వర్గాలు రెండూ గత ఎన్నికల్లో విచిత్రంగా తెదేపాకు జైకొట్టాయి. పార్టీ స్థాపించిన నాటి నుంచి శెట్టిబలిజలు తెదేపాకు సంప్రదాయ మద్దతుదారుగా ఉంటే, కాపులు మాత్రం పరిస్థితులకు అనుకూలంగా ఆయా పార్టీల పక్షాన నిలిచారు. అయితే, తమకు ఆది నుంచి దన్నుగా ఉన్నప్పటికీ శెట్టిబలిజలకు ఇప్పటివరకూ తెదేపా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఒక్కటే ఇప్పటివరకూ శెట్టిబలిజలకు మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లు ఇచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని దశాబ్దాల నుంచి కాపు-శెట్టి బలిజల శత్రుత్వం ఉప్పు-నిప్పులా కొనసాగుతోంది.
అయితే, కాపుల ఐక్యత దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్-తెదేపా మొదటి నుంచి ఆ వర్గాన్ని అందలమెకిస్తున్నాయి. వారికే మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. శెట్టిబలిజలు ఆది నుంచి తెదేపాతో అనుబంధం ఉన్నందున 2004 వరకూ కాంగ్రెస్ వారిని పట్టించుకోలేదు. కానీ, వైఎస్ వచ్చిన తర్వాత వారికి మంత్రి పదవులతోపాటు, రెండు జిల్లాల్లోనూ జడ్పీ చైర్మన్ పదవులిచ్చింది. దాంతో నష్టనివారణకు దిగిన బాబు, ఆ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యానికి ఎమ్మెల్సీ, గత ఎన్నికల్లో పితాని సత్యనారాయణ, అనంతలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది.
ఇప్పుడు బాబు కాపులను బీసీల్లో చేర్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను శెట్టిబలిజలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చి విజయవాడ బీసీ కమిషన్ ఆఫీసు ముట్టించడంతో, బాబు ఆ వర్గ నేతలను పిలిచి నచ్చచెప్పాల్సి వచ్చింది. నిజానికి ఉభయ గోదావరి జిల్లాలో నియోజకవర్గానికి 25-30 వేల సంఖ్యలో శెట్టిబలిజలున్నారు. పశ్చిమలో ఉండిలో 10-12 వేలు ఉండగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వారి సంఖ్య 30 వేలకు తగ్గదు. విజయవాడ నగరంలోనూ వీరి సంఖ్య ఎక్కువే.
కాపులకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ గత కొద్దినెలల క్రితం అమలాపురం డివిజన్‌లో బీసీలు శెట్టిబలిజ నేత కుడిపూడి సూర్యనారాయణ ఆధ్వర్యాన రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అన్ని బీసీ కులాలను సమన్వయం చేసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మళ్లీ తాజాగా శెట్టిబలిజలు ఉద్యమబాట పట్టడంతో దేశం నాయకత్వం తన వ్యూహం మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ ఆమరణ నిరాహారదీక్ష ఫలితంగా ఆయన కాపు యువతలో తెదేపాపై మానసిక వ్యతిరేకత పుట్టించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ముద్రగడ సభలు, ఉద్యమాలకు క్యాబినెట్‌లో ఉన్న కాపు, బలిజ ప్రముఖులే వాహనాలతో జనాలను తరలించారు. పవన్ సభకు తానూ జనాలను పంపానని మంత్రి మాణిక్యాలరావు తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం కాపులకు తెదేపా ఎంత చేసినా, వారి మనసులో ముద్రగడ, వైకాపా కాపు నేతలు వేసిన వ్యతిరేక బీజాలు పోయేలా కనిపించడం లేదు. ఇటు చూస్తే కాపులను చూసి తమను విస్మరిస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న శెట్టిబలిజలు కూడా దూరమవుతే రాజకీయంగా రెండువిధాలా దెబ్బతింటామన్న ఆందోళన నాయకత్వంలో మొదలయింది. ఫలితంగా రానున్న క్యాబినెట్‌లో కులాల కూర్పుతో కసరత్తు చేస్తోంది. కాపుల వైఖరి తెలిసినందున, ముందుజాగ్రత్తగా వారికంటే ఎక్కువ జనాభా ఉన్న శెట్టిబలిజలను ప్రసన్నం చేసుకోవటం ఒక్కటే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశంకు కనిపిస్తోంది.