ఆంధ్రప్రదేశ్‌

రాజధాని ప్రాంత పేదలందరికీ ఇళ్ల స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: భూ సమీకరణ కింద గతంలో రాజధాని అమరావతి ప్రాంతంలో సేకరించిన భూమిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్థలాలను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద 54,307 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 1251.5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. రాజధాని ఇక్కడే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 70 రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాజధాని అమరావతిని నిర్మించేందుకు వీలుగా దాదాపు 33 వేల ఎకరాలను 29 గ్రామాల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో భూసమీకరణ చేయడం తెలిసిందే. అయితే రాష్ట్రంలో వైకాపా అధికార పగ్గాలు చేపట్టాక మూడు రాజధానుల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానికే పరిమితం చేసేందుకు నిర్ణయించింది. అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే అంశం కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో నివేశన స్థలాలు తగినంత మేర అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు నిర్ణయించారు. విజయవాడ నగర పాలక సంస్థ సహా గుంటూరు జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. భూ సమీకరణ చేసిన భూమిలో 5 శాతం భూమిని పేదలకు గృహ నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఏపీసీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఇప్పటికే 87.02 ఎకరాలను పేదల గృహ నిర్మాణానికి కేటాయించామని గుర్తు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తి మేరకు రాజధాని ప్రాంతంలో భూమి కేటాయించేందుకు వీలుగా తదుపరి ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీసీఆర్‌డీఏ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి మండలంలో 11,300 మంది లబ్ధిదారులకు నవులూరు, కృష్ణాయపాలెంలో, పెదకాకాని మండలానికి చెందిన 1308 మందికి కృష్ణాయపాలెంలో, మంగళగిరి మండలానికి చెందిన 10247 మందికి నిడమానూరులో, దుగ్గిరాల మండలానికి చెందిన 2500 మందికి కృష్ణాయపాలెంలో కేటాయించనున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 28,952 మంది లబ్ధిదారులకు ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమానూరు, మందడంలో కేటాయించనున్నారు. నవులూరులో 215 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 192 ఎకరాలు, నిడమానూరులో 582 ఎకరాలు, ఐనవోలులో 53 ఎకరాలు, కురగల్లులో 38 ఎకరాలు, మందడంలో 169 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించింది. లబ్ధిదారుడు ఒక్కక్కరికి సెంటు స్థలాన్ని కేటాయిస్తారు. లే అవుట్ తయారీ బాధ్యత సీఆర్‌డీఏకు అప్పగించింది. అవసరమైన నిధులను రెవెన్యూ విభాగం సమకూరుస్తుంది. ఈ కార్యక్రమం సక్రమంగా అమలు చేసేందుకు వీలుగా సీఆర్‌డీఏ కమిషనర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.