రాష్ట్రీయం

జలవిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, గుంటూరు, సెప్టెంబర్ 22: బుధవారం రాత్రినుంచి కురిసిన భారీ వర్షాలకు కోస్తాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు జిల్లాలో ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లాలో రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది. కాటన్ బ్యారేజీ వద్ద గురువారం 10.7 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 2,63,740 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద 72 గేట్లను తెరిచి 70 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేశారు. వర్షాల మూలంగా ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌తో పాటు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, జిల్లా యంత్రాంగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర సాయం కోసం మచిలీపట్నంలో కంట్రోల్ రూంను (్ఫన్ 08672-252572) ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1077ను ఏర్పాటు చేశారు.
భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలోని వందలాది కాలనీలు నీటమునిగాయి. నాదెండ్ల మండలంలోని అవిశాయపాలెం వద్ద గంగన్నపాలెం ఎత్తిపోతల పథకం వద్ద కాపలా ఉన్న చేపూరి సుబ్బులు, కొండలు, వనజ అనేవారు వరదనీటిలో కొట్టుకుపోగా, వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తాటిచెట్టు ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. ఆరుగంటలపాటు తాటిచెట్టుపైనే గడిపిన వెంకటేశ్వర్లును ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మధ్యాహ్నం మూడున్నరగంటల సమయంలో కాపాడాయి. సత్తెనపల్లిలోని బోయకాలనీలోకి వరద వచ్చింది. కాలనీలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఈ వరదలో కొట్టుకుపోయాడు. ఇలా ఉండగా క్రోసూరు వద్ద విప్పర్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఊటుకూరు వద్ద ఒక ఆర్టీసి బస్సు వాగులో గురువారం మధ్యాహ్నం చిక్కుకుపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులు బస్సు పైభాగానికి చేరుకుని హాహాకారాలు చేశారు. వారిని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సాయంత్రం నాలుగు గంటలకు కాపాడింది. చిలకలూరిపేట-గణపవరం మార్గంలో ఐదో జాతీయ రహదారి వద్ద గల చెస్ట్ ఆసుపత్రి భవనంలోకి నీళ్లు చేరాయి. దీంతో సహాయక చర్యలకోసం వెళ్లిన ఆరుగురు భవనం పైకప్పుమీదకు చేరుకుని సాయం కోసం ఎదురు చూశారు. పోలీసులు, స్థానికులు అతి కష్టంమీద వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. చిలకలూరిపేట- నరసరావుపేట, సత్తెనపల్లి- మాచర్ల మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్- గుంటూరు మార్గంలో దాచేపల్లివద్ద నాగులేటి వాగు పొంగిపొర్లడంతో రెండువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే సత్తెనపల్లి-మేడికొండూరు మధ్య పేతూరు వాగు పొంగిపొర్లడంతో పల్నాడు వైపు వెళ్లే వాహనాలు వాగుకు రెండువైపులా నిలిచిపోయాయి. నెమలిపురి, బ్రాహ్మణపల్లి, దాచేపల్లి గ్రామాలను నాగులేటి వాగువరద చుట్టుముట్టింది. ఈ వాగులో ఒక లారీ కొట్టుకుపోయింది. ఫిరంగిపురం నాగన్నకుంట కాలనీలోకి నీరు చేరడంతో అనేక ఇళ్లు నీటమునిగాయి. ప్రత్తిపాడు-వంగిపురం మధ్య చప్టాపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పల్నాడు ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
చిలకలూరిపేట మార్గంలో నెమలిపురి వాగునీరు రైలుపట్టాలపైకి చేరడంతో అనుపాలెంవద్ద పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను ఆటోలు, ట్రాక్టర్లలో పిడుగురాళ్లకు తరలించారు. సికింద్రాబాద్-గుంటూరు, మాచర్ల- గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలను ఉదయం ఏడుగంటల నుండి రద్దు చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా గుంటూరు రీజియన్‌లోని 510 ఆర్టీసి బస్సులను నడపలేదు. వీటిని డిపోల నుండి బయటకు తీయలేదు. గుంటూరు జిల్లా నుండి రాయలసీమకు, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన బస్సులను సైతం నిలిపివేశారు. దీని వల్ల ఆర్టీసి కోటి రూపాయల ఆదాయం కోల్పోయింది.
కృష్ణా జిల్లాలో...
భారీ వర్షం కృష్ణాజిల్లాను అతలాకుతలం చేసింది. పెడనమండలంలో 15 సెంటీమీటర్లు, మచిలిపట్నంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరిన 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. మచిలీపట్నంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన పెయింటర్స్ కాలనీ, నవీన్‌మిట్టల్ కాలనీ, ఆదర్శనగర్, వైఎస్‌ఆర్ కాలనీ, హౌజింగ్‌బోర్డు, దేవుడుతోట, ఆర్టీసి కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పర్చూరు- గుంటూరు మధ్య సాకివాగు పొంగిపొర్లుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అర్దవీడు మండలంలోని బొల్లాపల్లి-వీరభద్రాపురం వద్ద వాగు పొంగిపొర్లుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గిద్దలూరు మండలంలోని అకవీడు-చోళ్లవీడు మధ్య గుండ్లకమ్మవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గిద్దలూరులోని బ్రహ్మేశ్వర రిజర్వాయర్ మట్టికట్ల తెగిపోవడంతో నీరంతావృథాగా పోతోంది. పర్చూరు నియోజకవర్గంలో పత్తి, మిర్చి పంటలు నీటిలో మునిగిపోయాయి.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నంద్యాలలో చామకాల్వకు వరద ఉద్ధృతి పెరగడంతో సమీప కాలనీల్లోకి నీరు చేరింది. మద్దిలేటి వాగు పొంగిపొర్లుతుండటంతో బండిఆత్మకూరు మండలంలోని రామాపురం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. పాములపాడు గ్రామంలో ఐదు ఇళ్లు కూలిపోయాయి. భవనాశినది,గుండ్లకమ్మవాగు, సుద్దవాగు, నిప్పులవాగు, నల్లవాగు పొంగిపొర్లుతున్నాయి. దాంతో శ్రీశైలానికి ప్రథమ ద్వారమైన ప్రథమ నందీశ్వరాలయం గురువారం నీటిలో మునిగింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో..
ఉభయగోదావరి జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. రాజానగరం మండలంలోని కన్నయ్య చెరువు పొంగిపొర్లుతుండటంతో 16 వ జాతీయ రహదారిపైకి వరద చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక గ్రామాల ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొత్తూరు కాలువ పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

చిత్రాలు..గుంటూరు జిల్లా మాచర్లలో రోడ్డు పైనుండి ప్రవహిస్తున్న వాగు
తూ.గో. జిల్లా రాజానగరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపైకి చేరిన వరద నీరు