ఆంధ్రప్రదేశ్‌

భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 2: దసరా శరన్నవరాత్ర మహోత్సవాల్లో రెండోరోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ ఆదివారం శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తకోటికి దర్శనమిచ్చింది. ఆదివారం సెలవుదినం కావటంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. తెల్లవారుఝాము మూడు గంటల నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్గింది. సమీప పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మ దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు దీరారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి ఎంతో గొప్పది, ముఖ్యమైంది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగల్గుతారు. ఈ సందర్భంగా మహామండపంలోని ఆరవ అంతస్తులో రెండు విడతలుగా జరిగిన కుంకుమ పూజలో 224 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. కుమారి పూజా, సుహాసినీ పూజలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.సూర్యకుమారి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు బాలికలు తొమ్మిదిమంది ముత్తయిదువులకు దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను ఆమె బహూకరించారు.
మల్లిఖార్జునపేటలోని శృంగేరి పీఠంలో ఏర్పాటుచేసిన అన్నప్రసాదం కార్యక్రమంలో 5వేల మందికి స్వీటు, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ వడ్డన చేసారు. దర్శనం కోరుకునే భక్తులు మధ్యాహ్నం వేళల్లో అమ్మ దర్శనానికి రావటం శ్రేయస్కరమని సూర్యకుమారి సూచించారు. ఆర్టీసీ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ నుంచి రెండు ఉచిత బస్సులను భక్తుల సౌకర్యం కోసం కెనాల్ రోడ్డులోని క్యూలైన్లు ప్రారంభమయ్యే వినాయకుని గుడి వరకు నడుపుతున్నారు. మూలానక్షత్రం రోజున ఆరు ఉచిత బస్సులను నడపనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం సీతమ్మవారి పాదాల నుంచి రెండు ప్రత్యేక ఉచిత బస్సులను కొండపైకి ఏర్పాటు చేస్తున్నారు. తొలిరోజునే 2500 మంది ఆ బస్సుల్లో కొండపైకి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా వుండగా వైద్య ఆరోగ్యశాఖ ఇంద్రకీలాద్రి పరిసరాల్లోని 15 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. మహామండపం దిగువున ఆరు పడకల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది. మూడోరోజైన సోమవారం దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

చిత్రం.. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు కుంకుమ పూజ చేసి నీరాజనాలు పలుకుతున్న అర్చకులు