ఆంధ్రప్రదేశ్‌

రూ. 1101కోట్లతో ఎస్సీ యాక్షన్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1101 కోట్లతో షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, అదనంగా మరో రూ.220 కోట్లు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు చెందిన కోటి మంది జనాభా కలిగిన దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 99,464 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు 10వేల మందికి రుణాలు అందిస్తామన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి ద్వారా రాష్ట్రంలో ఎస్సీలకు 80 ఇన్నోవా వాహనాలు అందించనున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో లెదర్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి 10 వేల మంది యువతకు రూ.30 కోట్లతో చెన్నైలో శిక్షణనివ్వడానికి ఎంపిక చేస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా విశాఖ కార్పొరేషన్‌ను ఒక మోడల్‌గా ఎంపికచేసి, రూ.250 కోట్లతో శానిటేషన్ యాంత్రీకరణ చేపట్టారన్నారు. దళితుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడానికి రాష్ట్రంలో రూ.కోటి వంతున రుణం అందించే ఒక వినూత్నమైన పథకాన్ని చేపట్టామన్నారు. ఈ రుణాల్లో ఎస్సీ కార్పొరేషన్ 30 శాతం, లబ్ధిదారుల వాటాగా ఐదు శాతం, మిగిలిన మొత్తం బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుతామని వివరించారు. ఇప్పటికే రూ.12 కోట్లు రుణాలుగా మంజూరు చేసి 12 మంది పారిశ్రామికవేత్తలతో ఒక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమల శాఖలో ఉన్న ఎస్సీ నిధులను వినియోగించి రాష్ట్రంలో 250 కేబ్‌లను నడుపుతామన్నారు. విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతిలో నడిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీలకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసేందుకు బ్యాంకులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. లక్ష మంది యువతను సమీకరించి, ఎస్సీ కార్పొరేషన్ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనుందని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఖర్చుచేసి, బహుళజాతి కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆరు నెలల తర్వాత ప్లేస్‌మెంట్ కల్పించే విధానంలో 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, బిబిఎం, డిప్లొమా విద్యార్థులను ఎంపికచేసి స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ కల్పిస్తామన్నారు. ఈ ఏడాది 464 మందిని ఎంపికచేసి శిక్షణ కల్పిస్తున్నామన్నారు. గత పాలకుల సమయంలో కేవలం సబ్సిడీతోనే ఎస్సీ కార్పొరేషన్ రుణాలను సరిపెట్టుకునే విధానానికి స్వస్తిచెప్పి ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రజల వద్దకు తీసుకెళ్ళి, సాంప్రదాయ ప్రచార మాధ్యమాలను వినియోగించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత పదేళ్లలో ఇచ్చిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రం ఎదుగుతున్నట్టుగానే దళితులూ ఎదగాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. తాను కార్పొరేషన్ చైర్మన్‌గా వున్నంత కాలం బోగస్, బినామీ అనే పదాలకు స్థానం లేకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా జూపూడి చెప్పారు. కాగా వచ్చే నెలలో రాజమహేంద్రవరంలో భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించనున్నామని, దీన్ని ఎస్సీ అభ్యర్థులు అత్యధికంగా వినియోగించుకోవాలని సమావేశంలో పాల్గొన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.