ఆంధ్రప్రదేశ్‌

కొత్త సచివాలయంలో నేటి నుంచి విధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ కొత్త సచివాలయంలో సోమవారం నుంచి విధులు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 7 నెలల 26 రోజుల్లో ఐదు బ్లాకుల నిర్మాణం పూర్తయింది. ఇందులో సిఎం, సిఎస్‌ల కోసం నిర్దేశించిన ఒకటో బ్లాక్‌లో అంతర్గతంగా డిజైన్లలో మార్పులు జరిగాయి. దీంతో సిఎం కార్యాలయానికి మరికొంత వ్యవధి పడుతుందని అధికారులు చెప్తున్నారు. మిగిలిన నాలుగు బ్లాక్‌లలో 20 ప్రభుత్వ విభాగాలకు చెందిన మూడు వేల మంది ఉద్యోగులకు ఒక్కో బ్లాక్‌కు ఐదు వేల చొప్పున సీటింగ్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 9.30 గంటలకు గుంటూరు చేరుకోనున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక శాఖతో సహా ఆరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఫైళ్లను తరలించారు. ఒక్కో బ్లాక్‌లో సీటింగ్ సదుపాయంతో పాటు డాటా నెట్ వర్క్ కనెక్టివిటీ కోసం ఈ-ఆఫీసు సదుపాయం ఏర్పాటు చేశామని సీఆర్డీయే ప్రత్యేక అధికారి మల్లికార్జున రావు తెలిపారు. ఈ ఏడాది జూన్ 29న ముందుగా సచివాలయానికి పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖ కార్యాలయాలను ఐదో బ్లాక్‌లో తరలించారు. అయితే మంత్రుల పేషీలలో వాస్తులోపం కారణంగా అంతర్గతంగా విస్తరణ పనులు నిర్వహించిన మేరకు ఎట్టకేలకు అన్ని బ్లాకులలో పనులు పూర్తయ్యాయి. ఆర్థిక, మునిసిపల్, రోడ్లు భవనాలు, ఐటి, సాధారణ పరిపాలనా విభాగం, హోం విభాగాలకు చెందిన ఫైళ్లను ముందుగా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీగోడ ముందు వైపున పూర్తయింది. భవనాల వెనుక భాగంలో నిర్మాణదశలో ఉంది. మరో మూడు రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సచివాలయంలో నేటి నుంచి విధులు ప్రారంభం కానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు ఇప్పటికే సచివాలయంలో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. గత పదిరోజులుగా అణువణువును నిశితంగా పరిశీలన జరిపిన ఎస్పీఎఫ్ దళాలు సచివాలయ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాలనా వ్యవస్థ కేంద్రీకృతం కానున్న నేపథ్యంలో ఆదివారం సచివాలయ ప్రాంగణంలో కవాతు నిర్వహించారు. ఎస్పీఎఫ్ కమాండెంట్ డాక్టర్ కెఎన్ రావు నేతృత్వంలో వంద మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇకపై సందర్శకులను అనుమతించే వీలుండదు. నిబంధనల ప్రకారం వారంలో ఒకరోజు మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశించే వారికి ఎంట్రీపాస్‌లు తప్పనిసరి. భవనాల నిర్మాణం పూర్తికావడంతో ప్రాంగణంలో రెండు పార్కులు, పార్కింగ్ వసతులకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల నుంచి సచివాలయానికి నేరుగా ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోని ఆరు ఆర్టీసి డిపోల నుంచి సర్వీసులు తిరగనున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. కొత్త సచివాలయంలో ఉద్యోగుల వసతి సదుపాయాలపై సిఎంఒ కార్యదర్శి సతీష్ చంద్ర అధికారులతో సమీక్షించారు.

పాలనకు సిద్ధమైన తాత్కాలిక సచివాలయం వద్ద
కవాతు చేస్తున్న పోలీసు బలగాలు