ఆంధ్రప్రదేశ్‌

మాస్టర్ ప్లాన్‌కు నోచుకోని రహదార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అటు గుంటూరు, ఇటు విజయవాడ వైపు వచ్చే రహదార్లలో కొన్ని మాస్టర్ ప్లాన్‌లో చోటుకు నోచుకోలేదు. కొత్త రోడ్ల మాట అటుంచి ఉన్న రహదార్ల విస్తరణ జరిపితే సచివాలయ ఉద్యోగులకు సౌలభ్యంగా ఉంటుంది. పాలనా యంత్రాంగం ఇక్కడ కొలువు తీరిన తరువాత ప్రాధాన్యతలు గుర్తుకు వస్తున్నాయి. విజయవాడ నుంచి వెలగపూడికి 20 కిలోమీటర్లు కాగా గుంటూరు నుంచి తుళ్లూరు, మంగళగిరి మీదుగా 35 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన హెచ్‌ఒడి కార్యాలయాలు, సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో నివాసాలను అద్దెకు తీసుకున్నారు. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరగడంతో కింది స్థాయి ఉద్యోగులు శివారు ప్రాంతాల్లో ఇళ్లు తీసుకున్నారు. గుంటూరు- అమరావతి రోడ్డులో తాడికొండ నుంచి వెలగపూడికి 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఉద్యోగులకు కొత్త కావడంతో అదే రహదారిలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ- గుంటూరు మార్గంలో మంగళగిరి నుంచి వెలగపూడికి 35 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తున్నారు. అయితే రాజధాని ప్రాంతంలోనే అంతర్గతంగా గ్రామాల మధ్య ఉన్న రోడ్ల విస్తరణ జరిపితే గుంటూరు నుంచి 25 నుంచి 30 కిలోమీటర్ల లోపు రాజధానికి చేరుకునే వీలున్నప్పటికీ ఆ దిశగా మాస్టర్ ప్లాన్‌లో డిజైన్లు రూపొందించలేదనేది స్పష్టమవుతోంది. సింగపూర్ సంస్థలు అందించిన ప్లాన్‌లో అంతర్గతంగా ఉండవల్లి నుంచి 16వ నెంబరు జాతీయ రహదారి అనుసంధానంతో రాజధానికి ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటు కానుంది. నాలుగులైన్ల ఈ రహదారి అవసరం ఉన్నప్పటికీ హైవేలో రద్దీ తప్పదని చెప్తున్నారు. కాగా ఉండవల్లిలోనే ముఖ్యమంత్రి నివాసానికి సమీపం నుంచి వెలగపూడికి మరో రహదారి నిర్మాణంలో ఉంది. సిఎం నివాసం నుంచి 7 నిముషాల్లో వెలగపూడి సచివాలయానికి చేరుకునేలా ఈ రోడ్డు రూపుదిద్దుకుంటోంది. రాజధాని ప్రతిపాదిత 25 గ్రామాల్లో 9 కానె్సప్ట్ నగరాలు ఏర్పాటు కానున్నాయి. రాజధాని పరిధిలోనే గతంలో లా సిటీకి ప్రతిపాదించిన శాఖమూరు, ఐనవోలు గ్రామాల మీదుగా గుంటూరు నుంచి వెలగపూడికి 30 కిలోమీటర్ల దూరంలో రాకపోకలు కొనసాగించేందుకు వీలైన రోడ్డు సౌకర్యం ఉంది. ఈ రోడ్డు విస్తరణ జరిపితే గుంటూరు నుంచి గోరంట్ల, లాం, తాడికొండ, పెదపరిమి, శాఖమూరు, ఐనవోలు మీదుగా వెలగపూడి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే మార్గంలో గోరంట్ల వద్ద మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం, లాంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉన్నాయి. ఇన్నర్ రింగురోడ్డు కూడా ఇదే రహదారిని కలుస్తుంది. రింగురోడ్డులో సైతం ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం, అటవీశాఖ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇక్కడి నుంచి వెలగపూడికి రహదారి విస్తరణ జరిగితే రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుంది. కాగా గుంటూరు- విజయవాడ మార్గంలో రెయిన్‌ట్రీ పార్కు సమీపంలోగల కంతేరు నుంచి రాజధానికి వెళ్లే మరో రోడ్డు విస్తరణ జరిగితే కేవలం 25 కిలోమీటర్ల దూరంతో రాకపోకలు కొనసాగించవచ్చు. కంతేరు నుంచి నిడమర్రు, ఐనవోలు మీదుగా వెలగపూడికి చేరుకునే ఈ రోడ్డును కూడా మాస్టర్‌ప్లాన్‌లో గుర్తించలేదు. ఈ రోడ్డు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంటుంది.