ఆంధ్రప్రదేశ్‌

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 15: రాబోయే మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బిజెపి సిద్ధంగా ఉందని, అయితే సీట్ల సర్దుబాటు, పొత్తుల విషయాలు టిడిపి, బిజెపి అధిష్ఠానాలు చూసుకుంటాయని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే మూడు స్థానాల్లో ఇద్దరేసి చొప్పున పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్టు వెల్లడించారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి కపిలేశ్వర్, విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు స్థానానికి చల్లపల్లి నర్శింహారెడ్డి, కె సత్యనారాయణ, ఉత్తరాంధ్ర స్థానానికి పివి నారాయణ, పి తిరుపతి రావులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించామన్నారు. రాష్ట్రంలో మోదీ నేతృత్వంలో బిజెపి బలం పుంజుకుంటోందన్నారు. ఒకప్పుడు 1.75 లక్షల సభ్యులు గల రాష్ట్రంలో ఇప్పుడు బిజెపి బలం 35 లక్షల మంది సభ్యులకు పెరిగిందన్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు మరో ప్రధాన కార్యదర్శి జె శ్యాం కిషోర్ తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విభజన నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎపిని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలతో పాటు ఎపి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూ.2.25 లక్షల కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. విభజిత ఎపి సత్వర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ దోహదపడుతుందన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందేందుకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు కట్టుబడి ఉన్నారన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, అయితే ఒడిశాతో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల ప్రకటనలో ఆలస్యం జరుగుతోందన్నారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర బిజెపి ఇన్‌ఛార్జ్ సిద్దార్ధనాథ్ సింగ్ మాట్లాడుతూ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు.

మంత్రగాడనే నెపంతో బాణాలతో దాడి
విఆర్ పురం, అక్టోబర్ 15: మంత్రగాడు అనే నెపంతో ఓ వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటన శనివారం తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని గుర్రంపేట గ్రామంలోని మొట్టుం దుర్గయ్య అనే గిరిజనుడిని మంత్రగాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పంది మాంసంని పంచుకుందాం రమ్మని చెప్పి సమీపంలోని అడవికి తీసుకువెళ్లారు. అడవికి వెళ్లిన దుర్గయ్యపై ఆ వ్యక్తులు బాణాలతో దాడి చేశారు. దీంతో దుర్గయ్యకు నడి వీపులోను, ఎడమ వైపు తుంటి పక్కన బాణాలు దిగాయి. వెంటనే దుర్గయ్య వారి నుంచి తప్పించుకొని పారిపోయి ఆ బాణాలతో గ్రామానికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన 108 వాహనం ద్వారా రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు తుంటి పక్కన ఉన్న బాణాన్ని తొలగించి ప్రథమ చికిత్స నిర్వహించారు.

రైతులకు పరిహారం
అందేవరకు పోరాటం
పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
మేడికొండూరు, అక్టోబర్ 15: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేలా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా నిలిచి పోరాటం సాగిస్తామని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం మేడికొండూరు మండలంలోని సిరిపురం నుండి వెలవర్తిపాడు వరకు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 35 వేల రూపాయలు, కౌలు రైతులైతే 50 వేల రూపాయల వరకు నష్టపోయినట్లు బాధితులు రఘువీరా దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన సభలో రఘువీరా మాట్లాడుతూ విత్తన కంపెనీలతో లాలూచీపడి ప్రభుత్వం రైతులకు నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే నకిలీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా, నేటికీ వారి కుటుంబాలను పరామర్శించక పోవడం దారుణమన్నారు.

రొట్టెల పండగకు పోటెత్తిన భక్తజనం

ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, అక్టోబర్ 15: నెల్లూరులోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండగకు హాజరవుతున్న భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నాల్గవరోజైన శనివారం దర్గా ఆవరణలో ఇసుకేస్తే రాలని పరిస్థితి కనిపించింది. సుమారు లక్షా యాభైవేల మంది వరకు భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. గత ఏడాది తమ కోర్కెల రొట్టెలందుకున్న భక్తులు, ఈ ఏడాది ఆ రొట్టెలను వేరే వారికి అందించి తమకవసరమైన రొట్టెలను పట్టుకునేందుకు బారులు తీరారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుక కోసం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు శనివారం దర్గాకు విచ్చేశారు. విద్య, ఉద్యోగ, వివాహ రొట్టెలకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. పలువురు భక్తులు ఈ రొట్టెల గురించే వాకబు చేశారు. దర్గాలోని బారా షహీద్‌ల సమాధులను దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలతో నెల్లూరు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం పండగకు ఆఖరు రోజు కావడంతో ఇతర ప్రాంతాల వారితో పాటు జిల్లాకు చెందిన భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డిలు ఇద్దరూ హాజరు కావడం ఈ వేడుకకు మరింత ప్రాచుర్యాన్ని తీసుకువచ్చింది. కాగా ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొని రొట్టెలు అందుకునే నెల్లూరు రొట్టెల పండగ ఆదివారంతో ముగియనుంది. ముగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, దర్గా కమిటీ సభ్యులు ఏర్పాట్లలో ఉన్నారు. ఆఖరి రోజు హాజరయ్యే భక్తులందరికి అన్నదానం చేసేందుకు కొన్ని స్వచ్చంధ సంస్థలు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి.

నెల్లూరు సర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోడానికి వచ్చిన భక్తుల రద్దీ