ఆంధ్రప్రదేశ్‌

కాపు కోటాపై మళ్లీ కిరికిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: కాపులకు బీసీ హోదా కల్పించేందుకు ఏపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు క్షేత్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. దానికోసం ఏర్పాటుచేసిన మంజునాధ కమిషన్ పర్యటనలు అన్ని జిల్లాల్లోనూ ఘర్షణ వాతావారణం నెలకొని, రసాభాసగా ముగుస్తుండటంతో కమిషన్ తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాపులను బీసీల్లో చేర్పించేందుకు అభిప్రాయసేకరణ నిర్వహిస్తున్న మంజునాధ కమిషన్ ఎదుటే కాపు-బలిజ, బీసీలు బాహాబాహీకి దిగుతున్న వైనం చర్చనీయాంశమయింది. ఇంతవరకూ పర్యటించిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపు-బలిజ, ఇస్తే తమ హక్కులు కోల్పోతామని బీసీలు ఒకేసారి పోటాపోటీగా వినతి పత్రాలిస్తున్నారు. దానితో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులూ నెలకొంటున్నాయి. విజయవాడలోని మంజునాధ కమిషన్ కార్యాలయాన్ని బీసీలు ఇప్పటికి మూడుసార్లు పెద్దసంఖ్యలో వచ్చి ముట్టడించడంతో పోలీసులను రంగంలోకి దింపాల్సి వచ్చింది. తాజాగా సోమవారం అనంతపురంలో మంజునాధ కమిషన్ ఎదుట రెండు కులాలు బాహాబాహీకి దిగిన వైనం బట్టి సీమలో కాపు రిజర్వేషన్లపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని, దీన్ని ప్రభుత్వం గ్రహించాలని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 24న కమిషన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తుండటంతో అక్కడ కూడా తమ వాదనలు వినిపించేందుకు ఇరు వర్గాలు ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న బలిజ-కాపులకు ఎలా రిజర్వేషన్లు ఇస్తారని కమిషన్‌ను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రాయలసీమలో బలంగా ఉన్న బోయ, యాదవ, వడ్డెర, గౌడ కులాలు రిజర్వేషన్లను బహిరంగంగా వ్యతిరేకిస్తుండగా, వారికి బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు తోడవుతున్నాయి. సీమలో బలిజలు ఆర్థికంగా బలంగా ఉంటే వారికి రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్న వాదనలు కమిషన్ ముందు వినిపిస్తున్నారు. ఇటు కోస్తాలోనూ బీసీలు కాపులకు బీసీ హోదాను వ్యతిరేకిస్తు, కమిషన్ ఎదుట వాదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులను ఆది నుంచి ఢీ కొంటున్న శెట్టిబలిజ వర్గంలో, ఇదే అంశంపై ఏకీకరణ ప్రారంభం కావడం ప్రతిఘటనకు కారణంగా కనిపిస్తోంది. విజయవాడలోని కమిషన్ కార్యాలయాన్ని దశల వారీగా ముట్టడించిన బీసీల్లో శెట్టిబలిజలే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకుంటామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాపులు తమ జాబితాలోకి వస్తే ఇప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్న ఆ సామాజిక వర్గం వారు రాజకీయ రిజర్వేషన్లు కూడా కొల్లగొడతారని, అప్పుడు తాము బీసీ జాబితాలో ఉండి ఏం ప్రయోజనమని వాదిస్తున్నారు. అటు యాదవ, మత్స్య, గవర, కళింగ వర్గాలు కూడా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమ హక్కులు దెబ్బతింటాయని రోడ్డెక్కుతున్నాయి. అయితే, తమకు గతంలో ఉన్న హక్కులను పునరుద్ధరించమని డిమాండ్ చేస్తున్నామే తప్ప, ఎవరి హక్కులూ లాక్కోవడం లేదని కాపు-బలిజలు కమిషన్ ఎదుట వాదిస్తున్నారు.