ఆంధ్రప్రదేశ్‌

నకిలీ విత్తన తయారీ కంపెనీలపై పిడి యాక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 19: నకిలీ విత్తన తయారీ కంపెనీలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. నకిలీ విత్తనం తయారీ నుంచి రైతుకు చేరేవరకు మధ్యలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వదిలేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ఇందులో భాగంగా నకిలీ మిర్చి విత్తనాలను తయారు చేసి రైతులను నట్టేట ముంచిన జీవా విత్తన కంపెనీ ఎండిని అరెస్ట్ చేయించింది. మరో విత్తన కంపెనీ బ్రహ్మపుత్ర ఎండిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా ఆయన కదలికలపై నిఘా పెట్టింది. పలువురు డిస్ట్రిబ్యూటర్లు, లైసెన్సులను శాశ్వతంగా రద్దుచేసింది. నకిలీ విత్తన తయారీదారులతో పాటు బయో ఉత్పత్తుల్లో రసాయనాలు కలిపి రైతులకు అంటగడుతున్న వారిపై కూడా ఉక్కుపాదం మోపనుంది. ఆయా అంశాలపై వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నకిలీ విత్తన తయారీదారులు, విక్రేతలపై పిడి యాక్ట్‌ను ప్రయోగించనున్నట్లు చెప్పారు. నకిలీ విత్తనాలకు సంబంధించి ఆరుగురు జీవా డిస్ట్రిబ్యూటర్లు, బ్రహ్మపుత్రకు చెందిన 9 మంది డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 35 మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశామని, వీరి లైసెన్సులు కూడా రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. విత్తన తయారీ కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసే సమయంలో కంపెనీకి సంబంధించి విధి విధానాలు సక్రమంగా ఉన్నాయా, లేదా పరిశీలించకుండా మంజూరుచేసిన వ్యవసాయశాఖ అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సీడ్ బిల్లు డ్రాఫ్ట్‌ను రూపొందించామని, త్వరలోనే క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 1966 సీడ్ చట్టమే అమలవుతుందని చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకుని తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. బయోప్రోడక్ట్స్‌లో రసాయనాలు కలిపి విక్రయిస్తున్న 42 కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలపై ఛీటింగ్ కేసులు నమోదుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 2015 నుంచి ఇప్పటివరకు వివిధ కంపెనీలకు సంబంధించి 481 శ్యాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా 109 శ్యాంపిల్స్‌లో రసాయనాలు కలిపినట్లు తేటతెల్లమైందన్నారు. రెండు రాష్ట్రాల్లో 433 విత్తన తయారీ కంపెనీలు ఉన్నాయని, ఆయా కంపెనీలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధి విధానాలను పాటిస్తున్నాయా, లేవా అనే అంశంపై 3 ప్రత్యేక బృందాలను నియమించామని, వారం పది రోజుల్లో నివేదిక అందనుందని తెలిపారు.