ఆంధ్రప్రదేశ్‌

ఉత్తి ‘కోత’లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 8: పేరుకేమో విద్యుత్ సరఫరాలో నెంబర్ వన్. మనది మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం. ఆ మేరకు చేసుకునే ప్రచారానికి కొదవలేదు. వాల్‌పోస్టర్లు, టీవీ ప్రచారాలకు తక్కువ లేదు. ప్రచారానికి పెట్టింది పేరైన ఈ శాఖ సచివాలయయానికి మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఉన్నతాధికారులు కొలువుదీరే సచివాలయంలో మాత్రం నిరంతర కోతలే. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ముచ్చటగా మూడుసార్లు రోజులో వరసగా డజన్లసార్లు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిన వైనం విద్యుద్ శాఖ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ అటు సీఆర్‌డిఏకూ సారథిగా జమిలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో విద్యుత్ నిర్వహణ, ఇతర అనుమతులన్నీ సీఆర్‌డీఏ ఆధ్వర్యానే కొనసాగుతున్నాయి. అక్కడ ఏ చిన్న నిర్మాణం చేయాలన్నా, అదనపు ఏర్పాట్లు చేయాలన్నా సీఆర్‌డిఏ అనుమతి అవసరం. గత కొద్దిరోజుల నుంచి సచివాలయంలో నిరంతరం విద్యుత్ కోతలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఏకంగా 20 సార్లు అంతరాయం ఏర్పడగా, అంతకు ముందు రెండుసార్లు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ అవస్థ కొన్ని గంటల పాటు కొనసాగుతుండటంతో ఉద్యోగులు, అధికారుల ఇబ్బందులు వర్ణనాతీతం. నిరంతర అంతరాయం వల్ల కంప్యూటర్ల వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోగా, మిగిలిన సమాచార వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. వెయ్యి కోట్లతో నిర్మించిన భవనానికి ముందుగానే జనరేటర్, 33 కెవి సబ్‌స్టేషన్ వంటి నిర్మాణాలను ఏర్పాటుచేసుకోవలసి ఉండగా, దానిని విస్మరించడం వల్లే ఈ సమస్యలు ఏర్పడ్డాయంటున్నారు. హైదరాబాద్ సచివాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన నిమిషాల్లోనే పునరుద్ధరణ జరిగేది. కానీ నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని వెలగపూడిలో నిర్మించిన సచివాలయంలో మాత్రం నిరంతర విద్యుత్ కోతలు ఉద్యోగులు, అధికారులను చికాకు పెట్టిస్తున్నాయి. సబ్‌స్టేషన్, జనరేటర్లు ఏర్పాటుచేయకపోవడంతో సీఆర్‌డీఏ, విద్యుత్ శాఖ విఫలమయ్యాయన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. తరచూ గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో అధికారులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాంబర్లు, లోపల కార్యాలయాల్లోని అద్దాలను పూర్తిగా మూసివేయడంతో గాలి రాక నానా పాట్లు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. తమను సచివాలయానికి పిలవకముందే జనరేటర్లు, ఇనె్వర్టర్లు ఏర్పాటుచేయాల్సి ఉండగా విద్యుత్ శాఖ అందులో విఫలమయిందని విమర్శిస్తున్నారు. దీనిపై తాము తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వెలగపూడిలో ప్రతి నిర్మాణానికి, ప్రతి ఏర్పాటుకూ సీఆర్‌డిఏ అనుమతి కావలసి ఉందని, తాము చెప్పినా వినేవారు లేరని ఉన్నతాధికారులు తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. సబ్‌స్టేషన్లపై దృష్టి సారించకపోతే ఈ విద్యుత్ కోతలతో తాము పనిచేయడం కష్టమంటున్నారు. తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో కంప్యూటర్లలో ప్రోగ్రాములు పోతున్నాయని, డేటా కూడా ఉండటం లేదని, సర్వర్లు కూడా నిదానిస్తున్నాయని తామెదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ఏకరవు పెడుతున్నారు.