ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల జీవితాల్లో సప్తపదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25: అర్చకులు, దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పర్యవేక్షణలోని ఆలయాల్లో పనిచేసే వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్న దేవాలయాల్లో పనిచేస్తూ, నెలకు రూ.12,500 అంతకంటే తక్కువ వేతనం లభించు అర్చకులు, మరియు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అర్చక మరియు ఇతర ఉద్యోగులు సంక్షేమ నిధి బాసటగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
గత ఏడాది ఉన్న పథకాలను మరింత పటిష్ఠంగా 2016-17 సంవత్సరానికి గాను ఆర్థిక సహాయాన్ని మరింతగా పెంచింది. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలోని ట్రస్ట్ వివిధ చర్యలు చేపడుతోంది. అర్చకులు మరియు ఆలయ సిబ్బందికి చేయాల్సిన సాయం ఆన్‌లైన్ ద్వారా చేస్తోంది. మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా అర్హులకు నేరుగా వారి అకౌంట్లలో పథకాలకు వర్తించే సొమ్మును అందజేస్తోంది. అర్చకుడు, ఉద్యోగులు తమ పిల్లలకు చేసే ఉపనయనానికి గ్రాంటుగా రూ.25,000 అందిస్తోంది. అర్చకుడు, ఉద్యోగి పిల్లలు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలో డిగ్రీ స్థాయి వృత్తి విద్యా కోర్సులను అభ్యసిస్తుంటే వారికి గరిష్టంగా రూ.35వేల గ్రాంటు ఇవ్వటం జరుగుతుంది. అర్చకులు లేదా ఉద్యోగులకు తమ పిల్లలకు లేదా సహోదరికి వివాహం చేయు సందర్భంలో 2శాతం వార్షిక వడ్డీకి లక్ష రూపాయల వరకు రుణ సహాయం అందిస్తున్నారు. సొంత గృహం లేని అర్చకులు మరియు సిబ్బందికి అర్చక మరియు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి 4శాతం వడ్డీపై రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొత్తంలో 50శాతం గ్రాంటుగానూ, 50 శాతం రుణంగాను మంజూరు చేస్తుంది. అర్చక సిబ్బందికి ప్రస్తుతం ఉన్న గృహానికి మరమ్మతులు చేయడానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అర్చకుడు, దేవాలయ ఉద్యోగి, కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఆసుపత్రి నందు చికిత్స పొందిన సందర్భంలో చేసిన వైద్య ఖర్చులకు గాను గరిష్టంగా రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నారు.
ఆసుపత్రి పాలైన సందర్భంలో వైద్యం చేయడానికి అర్చక సంక్షేమ నిధి ముందస్తు హామీ పత్రాన్ని వైద్యం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఆయా దేవాలయాల్లో పదేళ్లపాటు పనిచేసిన వారికి ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొంది, ఆ తర్వాత ఎలాంటి పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. సుదీర్ఘకాలంపాటు పనిచేసిన దేవాదాయ శాఖ సంస్థలో పనిచేసే సిబ్బంది, అర్చకులకు వారి పదవీ విరమణ తర్వాత వారి కుటుంబ జీవనం సాఫీగా సాగడానికి రూ.4లక్షల వరకు గ్రాట్యుటీ రూపేణ ఆర్థిక సాయం అందిస్తోంది. 50 శాతం మొత్తాన్ని 10 ఏళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, మిగిలిన 50శాతం మొత్తాన్ని పదవీ విరమణ చేసిన వెంటనే ఇస్తున్నారు. అర్చకులుగానీ, సిబ్బంది గానీ ప్రమాదవశాత్తు మరణిస్తే లక్ష రూపాయలు, దహన సంస్కారాలకు రూ.5వేల రూపాయలు అందిస్తారు. అర్చకుడు దేవాలయ సిబ్బంది సహజ మరణం సంభవిస్తే రూ.50వేలు, దహన సంస్కారాలకు రూ.5వేలు గరిష్టంగా రూ.4లక్షల గ్రాట్యుటీ అందిస్తోంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఎలాంటి వివక్షకు గురికారాదన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ వారికి తగిన విధంగా పలు పథకాలను అమలు చేస్తోంది. అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు వారికి భరోసా కల్పిస్తోంది. అన్ని కష్టాల్లో బాసటగా నిలుస్తామంటూ ధీమా ఇస్తోంది. దీనివల్ల వేలాది మంది లబ్ధి పొందుతున్నారు.