ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో దాదాపు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటును వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కాంక్రీటును వినియోగించిన ప్రాజెక్టులు లేవు. పోలవరం ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దాదాపు 40 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు సమకూరుస్తుండగా, నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో నాగార్జున సాగర్ డ్యామ్‌ను 124 మీటర్ల ఎత్తులో 24 క్రస్టుగేట్లతో నిర్మించారు. 1955లో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. ఆ కాలంలో ఇందుకు అవసరమైన సిమెంట్ తగినంతగా అందుబాటులో లేకపోవడంతో నిర్మాణంలో ఎక్కువ భాగం రాళ్లను వినియోగించారు. ప్రాజెక్టుకు అవసరమైన సిమెంట్ ఉత్పత్తి కోసం గుంటూరు జిల్లా మాచర్లలో సిమెంట్ ఫ్యాక్టరీ, ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. అయితే అప్పటి పరిస్థితితో పోలిస్తే సిమెంట్, స్టీల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగానే సిమెంట్, స్టీల్, సరకు రవాణా అంశాలపై దృష్టి సారించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మట్టి తవ్వకాల పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం సమీక్షిస్తున్నారు. రోజుకు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. మట్టి తవ్వకాల పనులు జోరందుకోవడంతో కాంక్రీటు పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 19న పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను ప్రారంభించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపాదిత డ్యామ్ ప్రాంతంలో ఇప్పటికే నేలను చదును చేసే పనులు జరుగుతున్నాయి. 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు అవసరం అవుతుండటంతో సిమెంట్, స్టీల్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. డ్యామ్ సైట్ వద్దకు 250 రూపాయలకే సిమెంట్ బస్తాను సరఫరా చేసేందుకు సిమెంట్ కంపెనీలు ముందుకు రావడం తెలిసిందే. 48 క్రస్టుగేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు వీలుగా రెండు రహదారులు నిర్మిస్తున్నారు. గోపాలపురం నుంచి పోలవరం వరకూ పోలవరం కుడి కాలువను ఆనుకుని డబుల్ లేన్ రహదారి, పెద్దాపురం నుంచి ఇటికలకొండ వరకూ రహదారి విస్తరణ పనులను దాదాపు 520 కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. సిమెంట్, స్టీల్ తరలింతో పాటు కాంక్రీటింగ్‌కు అత్యాధునిక యంత్రాలను కూడా డ్యామ్ సైట్‌కు తరలించేందుకు వీలుగా రహదారులను నిర్మిస్తున్నారు. రోజుకు 15 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పోరింగ్ యంత్రాలను వినియోగించనున్నారు.ఇందుకు అవసరమై బ్యాట్‌ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఇంత పెద్దమొత్తంలో కాంక్రీట్ వినియోగించే ప్రాజెక్టు భవిష్యత్తులో దాదాపు ఉండబోదని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతం (ఫైల్ ఫొటో)