ఆంధ్రప్రదేశ్‌

మూతపడే దిశగా ప్రభుత్వ ముద్రణాలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రంగా మారిన విజయవాడ నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం రోజురోజుకూ మూతపడే దిశగా పయనిస్తోంది. 1982లో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కోస్తా ఆంధ్ర ప్రాంత అవసరాల కోసం నగరంలో ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు తన స్వహస్తాలతో దీన్ని ప్రారంభించారు. నగరం నడిబొడ్డున దాదాపు నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 200 మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ ముద్రణాలయం ఆలనాపాలనా కొరవడి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. రాష్ట్ర విభజన అనంతరం కూడా నేటివరకు విజయవాడలో ఒక ముద్రణాలయం ఉందనే విషయాన్ని పాలకులు గుర్తించినట్లు కనిపించడం లేదు. ఫలితంగా ప్రతినెలా జీతభత్యాల కింద కనీసం రూ.70 లక్షలకు పైగా ఖర్చవుతుంటే రెండు లక్షలకు మించి రాబడి లభించటమే కష్టవౌతోంది. అదికూడా కోస్తా జిల్లాల కలెక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంది. ప్రస్తుతం కలెక్టర్లు జారీచేసే గెజిట్ల ముద్రణకే ఈ ప్రాంతీయ ముద్రణాలయం పరిమితమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనునిత్యం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలంటూ పిలుపునిస్తుంటే ఈ ముద్రణాలయంలో కాలంచెల్లిన బ్లాక్ అండ్ వైట్ ముద్రణకు పనికొచ్చే మెషిన్ మాత్రమే వుంది. దీనికితోడు 1996లో నాడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు హయాంలోనే సూపర్ న్యూమరీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఫలితంగా పదవీ విరమణ చేసిన వారితో ఆ క్షణానే ఆ పోస్టు రద్దవుతుంది. తిరిగి నియామకం అంటూ లేకపోవటంతో తొలుత 200 మందితో కళకళలాడుతూ వుండిన ఈ ముద్రణాలయం ప్రస్తుతం 95 మందితో, అదికూడా వారి చేతికి పనిలేక కళావిహీనంగా సాక్షాత్కరిస్తోంది. నిన్నమొన్నటి వరకు స్టేషనరీ, ప్రింటింగ్ శాఖకు ప్రత్యేకంగా ఉన్నతాధికారి అంటూ లేరు. ఈ శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం, మరికొన్ని శాఖలన్నింటికీ కలిపి ఒక ఐపిఎస్ అధికారి సారథ్యం వహిస్తూ రావడం వల్ల కూడా దీనికి తగినంత ప్రాధాన్యత లేకుండాపోయింది. నండూరి సాంబశివరావు హయాంలో పరిస్థితి కొంతమేర ఆశాజనకంగా కనిపించింది. ఒకటికి రెండుసార్లు ఆయన స్వయంగా ముద్రణాలయాన్ని సందర్శించి కొంతమేర అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అయితే అంతలోనే ఆయన ఆర్టీసీ ఎండిగా బదిలీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం త్రిపాఠీ ముద్రణాలయం, స్టేషనరీ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇకనైనా మంచిరోజులు వస్తాయేమోనని ఇక్కడి సిబ్బంది ఎదురుచూస్తున్నారు. శాసనసభ స్పీకర్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో వున్న దాదాపు రూ.50 లక్షలు పైగా విలువైన ఆఫ్‌సెట్ మెషిన్‌కు ఎలాంటి పనిలేక ఖాళీగా వుంది. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు సిబ్బంది డెప్యుటేషన్‌పై ఇక్కడ నుంచి వెళ్లి వస్తుండేవారు. అయితే అక్కడ స్థిరపడిన కొందరు అధికారులు, సిబ్బంది మరో మూడు నాలుగేళ్లకు పదవీ విరమణ చేయనుండటంతో అప్పటివరకు ఆ మెషిన్‌ను తరలించకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారనే విమర్శలున్నాయి. వాస్తవానికి తక్షణం ఆ మెషిన్‌ను ఇక్కడకు తరలించి సిబ్బంది మొత్తానికి పని చూపించవచ్చు. తొలుత ప్రభుత్వాసుపత్రుల కార్యాలయాలకు సంబంధించి మొత్తం ప్రింటింగ్ పనులు ఇక్కడ జరిగేవి. రేషన్‌కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ కూడా జరిగేది. అయితే కమీషన్లకు అలవాటుపడ్డ అధికారులు ఈ ముద్రణాలయాన్ని పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థలకు పనులు అప్పగిస్తుండటంతో ప్రస్తుతం పట్టుమని పదిమందికి కూడా రోజులో గంటా, రెండు గంటలకు మించి పనిలేదంటున్నారు. ఆఫ్‌సెట్ ప్రెస్ లేదనే కారణంతో కోట్లాది రూపాయల విలువైన ప్రచార సామగ్రి ముద్రణ పనులు ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ఈ ముద్రణాలయం విషయమై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోని పక్షంలో విలువైన భూమిని సైతం భవిష్యత్‌లో చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురుకానుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం..విజయవాడలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం