ఆంధ్రప్రదేశ్‌

పోలవరంలో భూమాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 19: పోలవరం నిర్వాసితులకు పునరావాస పునర్నిర్మాణ చట్టం (ఆర్ అండ్ ఆర్) ప్రకారం ఇవ్వాల్సిన భూమికి భూమి వ్యవహారంలో మాయ జరుగుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్రకారం నిర్వాసితుల నుండి తీసుకున్న వ్యవసాయ భూమికి బదులుగా వేరే ప్రాంతంలో భూమిని ఇవ్వాల్సివుంది. అయితే నిర్వాసితులకు ఎటువంటి భూమి ఇప్పటివరకు ఇవ్వకపోయినా రికార్డుల్లో మాత్రం వారికి భూమి ఇచ్చినట్టు నమోదుచేస్తునట్టు వెలుగులోకి వచ్చింది. తమకు భూమికి భూమి వద్దని తీసుకున్న భూమి మొత్తానికి పరిహారం ఇవ్వాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన నిర్వాసిత ఆదివాసీలు సోమవారం రాజమహేంద్రవరంలోని పోలవరం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈసందర్భంగా నిర్వాసితులకు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు పరిశీలిస్తే.. భూమికి భూమి ఇచ్చేసినట్టు నమోదుచేసినట్టు బహిర్గతమయ్యింది. పోలవరం రిజర్వాయర్ కింద ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో 276 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మొత్తం లక్షా 17వేల 14 మంది నిర్వాసితులవుతున్నారు. లక్ష ఎకరాల వ్యవసాయ భూమి, 500 చదరపు కిలోమీటర్ల అటవీ భూములు నీట మునుగుతుంది. ఈ భూమిలో ఆదివాసీలకు చెందిన వ్యవసాయ భూములున్నాయి. వారి నుండి ప్రభుత్వం ఈ భూములను సేకరిస్తోంది. ఇలా సేకరించిన వారి భూములకు సంబంధించిన పాస్‌బుక్‌లపై అధికార యంత్రాంగం భూమికిభూమి ఇచ్చేసినట్టు రెడ్‌ఇంక్‌తో రాసేశారు. తమకు ఎక్కడ భూమి ఇచ్చారో, అసలు ఇచ్చారో లేదో కూడా తెలియని స్థితి ఆదివాసీల్లో కనిపిస్తోంది. దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే పవర్ హౌస్ కోసం ఖాళీ చేయించి ఏడాది అవుతోంది. ఇప్పటికీ నిర్వాసితులు చెట్లనీడనే కాలం గడుపుతున్నారు. ఇదే మండలంలో కొంతమందికి భూమికి భూమి రూపేణా కేటాయించిన భూమి ఎందుకూ పనికి రాలేదు. పునరావాస చట్టం ప్రకారం ప్రాజెక్టు పరిధిలోనే భూమికి భూమి కేటాయించాల్సివుంది. కానీ కొంతమందికి ఎక్కడో దూరంగా రాళ్ళు, రప్పలు కలిగిన భూమి ఇవ్వడంతో దానిని సాగులోకి తీసుకురావడం మా వల్లకాదని నిర్వాసితులు ఆ భూమి జోలికివెళ్లలేదు. అలాగే డి.రావిలంక, లోతుపాలెం, దండంగి తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులకు కూడా భూమికి భూమి ఇచ్చేసినట్టు అధికారులు పట్టాదారు పాస్‌పుస్తకాల్లో చూపించారు. కానీ తమకు ఎక్కడాభూమి ఇవ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. కానీ పట్టాదార్ పాస్ పుస్తకాల్లో మాత్రం భూమి ఇచ్చేసినట్టు రాసేశారని వాపోతున్నారు. దేవీపట్నం మండలం డి రావిలంక గ్రామానికి చెందిన చోడి బాపన్నదొరకు నాలుగు ఎకరాల 12 సెంట్ల భూమి వుంది. ఇతనికి ఇందుకూరులో 2 ఎకరాల 66 సెంట్లు భూమి ఇచ్చినట్టు పాస్‌బుక్‌లో రాసారు. అదే విధంగా దండంగి గ్రామానికి చెందిన మడకం కృష్ణ దొర నుంచి 4 ఎకరాల 81 సెంట్ల భూమి తీసుకుని భూమికి భూమి ఇందుకూరు గ్రామం వద్ద ఇచ్చినట్టుగా పాస్‌బుక్‌లో చూపించారు. తుర్రం రామన్నదొర, మడి సుబ్బాయమ్మ, చోడి వెంకటరామన్నదొర, పందిరి గంగన్న దొర, తుర్రం చంటియమ్మకు చెందిన భూమి తీసుకుని లోతుపాలెం వద్ద భూమి కేటాయించినట్టు రికార్డుచేశారు. వాస్తవానికి వీరెవ్వరికీ భూమికి భూమి అప్పగించనే లేదు. కానీ అధికారులు మాత్రం రికార్డుల్లో నమోదుచేసేశారు. తమకు భూమికి భూమి వద్దని తీసుకున్న మొత్తం భూమికి నష్టపరిహారం చెల్లిస్తే, నచ్చిన చోట ఎంత వస్తే అంత భూమి కొనుక్కుని బతుకుతామని నిర్వాసితులు పేర్కొంటున్నారు. స్థానిక అధికారులెవరూ వీరి గోడు పట్టించుకోకపోవడంతో వీరంతా ముందు రోజు బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకుని భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కోసం పడిగాపులుపడ్డారు.

చిత్రం..రాజమహేంద్రవరంలో భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కోసం పడిగాపులుపడ్డా పోలవరం నిర్వాసితులు