ఆంధ్రప్రదేశ్‌

కరవుపై కేంద్రానికి నివేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 24: జిల్లాలో నెలకొన్నకరవును కళ్లారా చూశామని, ప్రతి రైతు, ప్రతి కూలీకి న్యాయం జరిగేలా కేంద్రానికి నివేదిక ఇస్తామని కేంద్ర కరవు బృందం టీమ్‌లీడర్, సీనియర్ ఐఎఎస్ అధికారి అమితాబ్ గౌతమ్ పేర్కొన్నారు. కేంద్ర కరవుబృందం మంగళవారం కడప జిల్లా రామాపురం, రాయచోటి, సంబేపల్లె మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరవు తీవ్రస్థాయిలో ఉందని, పంటలు పూర్తిగా పండలేదని అభిప్రాయపడ్డారు. ఖరీఫ్, రబీలో కరవు తీవ్రంగా ఉండడం చూసి చలించిపోతున్నానన్నారు. వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. ఇక్కడ పండ్లతోటలకు అనువైన పరిస్థితులున్నా నీళ్లు లేక ఎండిపోయాయన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయమని రైతులు, ఉపాధీ కూలీలు కోరడం సమంజసమేనని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కరవు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమవుతాయని ఆయన తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ కరవు బృందానికి జిల్లా పరిస్థితులు, జిల్లాలో అధిక సంఖ్యలో సాగుచేస్తున్న పంటల వివరాలను వివరించారు.
రైతులు, ఉపాధి కూలీల మొర
కరవు దృష్ట్యా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి తమను ఆదుకోవాలని రైతులు, రైతుకూలీలు కేంద్ర కరవు బృందంతో మొరపెట్టుకున్నారు. కేంద్ర కరవు బృందం మంగళవారం జిల్లాలోని కడప, రామాపురం, రాయచోటి, సంబేపల్లి మండలాల్లో పర్యటించింది. వరుస కరవుల నేపధ్యంలో సాగునీరు అటుంచి తాగేందుకూ నీళ్లు లేవని ప్రజలు ఫిర్యాదు చేశారు. నీళ్లు మళ్లించి గొంతు తడపాలని వారు కోరారు. ప్రతిసారి అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నామని, వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి అప్పుల పాలవుతున్నామన్నారు. ఖరీఫ్, రబీ సీజన్‌లో పంటలు పూర్తిగా చేతికి అందలేదని రైతులు తెలిపారు. కరవు బృందం ఆయా గ్రామాల్లో ఎండిన పంట పొలాలు, నీళ్లులేని కుంటలు, చెరువులు, ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు, చౌకదుకాణాలు, విద్యుత్ సబ్‌స్టేషన్లను పరిశీలించింది. బృందంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ గౌతమ్, డా.పున్నస్వామి, ప్రేమ్‌సింగ్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో ఎండిపోయిన పంటలు, ఎండిపోయిన చెరువులు, ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను కరవు బృందానికి వివరించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను కరవు బృందం పరిశీలించింది. వైసిపి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు నజీర్ అహ్మద్ కరవు బృందానికి వినతిపత్రాలు అందజేశారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి తీవ్రం
ఆదోని: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు తీవ్రంగా ఉందని, కరవు పరిస్థితులను పరిశీలించామని, నివేదికను కేంద్రానికి అందజేస్తామని కేంద్ర కరవు బృందం సభ్యులు జెకె రాథోడ్, రామకృష్ణ, జెఆర్ జర్గర్ స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో కరవుబృందం సభ్యులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో పొలాలను పరిశీలించామన్నారు. వేరుశెనగ, కంది, మల్బరీ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడామన్నారు. అక్కడ ఎండిపోయిన పంటలు, కరవుపరిస్థితులు గురించి తెలుసుకున్నామన్నారు. కరవు వల్ల గొర్రెల పెంపెకందారులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు చాలా చోట్ల తమ కష్టాలను వివరించారని చెప్పారు. అనేక చోట్ల తాగునీటి సమస్యను కళ్లారా చూశామన్నారు. ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంచాలని రైతులు కోరారన్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో కరవు పరిస్థితులను పరిశీలించామని, కోడుమూరు నియోజకవర్గం ప్యాలకుర్తి గ్రామంలో కరవు పరిస్థితులను అధ్యయనం చేసి రైతులతో మాట్లాడుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసి కరవుపై చర్చిస్తామన్నారు. కరవు పరిస్థితులు, రైతుల కష్టాలు, నష్టాలపై నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కరవు బృందం తెలిపింది.
రైతులు పూర్తిగా నష్టపోయారు
మార్కాపురం : జిల్లాలో కరవు పరిస్థితి అధికంగా ఉందని, రైతులు పూర్తిగా నష్టపోయారన్న విషయాన్ని గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిస్థాయి నివేదికను కేంద్రప్రభుత్వానికి అందచేస్తామని కేంద్ర కరవుబృందం సభ్యులు రాంబాబు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆదేశాలతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించి కరవు పరిస్థితులను అంచనా వేశామని, అధికారులు పంపిన లెక్కల కన్నా అధికశాతం పంటలు నష్టపోయారని అన్నారు. అధికారులు కేవలం 32 శాతం పంట నష్టపోయినట్లు అంచనాలు అందచేయగా తమ క్షేత్రస్థాయి పరిశీలనలో 70 శాతానికి పైగా పంటలు నష్టపోయినట్లు గుర్తించామని తెలిపారు. ఈ నెల 25న ప్రభుత్వం తయారుచేసిన నివేదికను తాము క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవికతను కలిపి కేంద్రప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ బృందంలో రాంబాబుతోపాటు హెచ్‌ఆర్ కన్నా, ఎస్‌ఎల్ మీనా ఉన్నారు. ఈ సందర్భంగా వారు వివిధశాఖల అధికారులు తయారుచేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లాలో కరవు పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా మార్కాపురం డివిజన్‌లోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో జనవరిలోనే తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని, ఈ పరిస్థితులను గమనిస్తే ఏప్రిల్, మే, జూన్‌లలో తాగునీటి ఎద్దడి తీవ్రతరమయ్యే పరిస్థితి ఉందని, భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటాయని ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ మర్ధఅలీ తెలిపారు. పంటల్లో ప్రధానంగా పత్తి, కంది, వరి పంటలు తీవ్రంగా ఎండిపోయి నష్టాన్ని రైతులు చవిచూశారని వ్యవసాయశాఖ జెడిఎ మురళీకృష్ణ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యానవనశాఖ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా మిర్చి పంటలపై రూ.202 కోట్లు రైతులు నష్టపోయారని, బత్తాయి, నిమ్మ, బొప్పాయి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.