ఆంధ్రప్రదేశ్‌

పిల్లల హక్కుల రక్షణ బాధ్యత న్యాయవ్యవస్థదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 28: బాలల హక్కుల రక్షణ బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జువెనైల్ జస్టిస్ యాక్టు 18ఏళ్లలోపు పిల్లలకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యాన విజయవాడలో శనివారం ‘బాలల రక్షణ, స్నేహపూర్వక న్యాయసేవల పథకం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సదస్సులో మాట్లాడుతూ సమాజంలో పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణంలో ఏవిధంగా ప్రవర్తించాలి, బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం చట్టాలు ఏవిధంగా ఉపయోగపడతాయో చూడాల్సిన గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై వుందని గుర్తుచేశారు. బాలలకు అందుబాటులో ఉన్న చట్టాలు, న్యాయసేవలు అట్టడుగు వర్గాలకు సైతం అందేలా, సరైనవిధంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ వై లక్ష్మణరావు మాట్లాడుతూ బాలల రక్షణ, స్నేహపూర్వక న్యాయసేవల పథకం ఉద్దేశ్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. న్యాయవ్యవస్థ ప్రధానంగా ఈ బాధ్యతను భుజాన వేసుకోవాలన్నారు. అప్పుడే చట్టాలు ప్రజలకు చేరువ కావడంతో పాటు న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఏ సుబ్రహ్మణ్యం పిల్లల చట్టాలు, హక్కుల గురించి వివరిస్తూ బాలల హక్కులు అనే దృక్పథంలో ఉన్నవారికి ఉన్న చట్టాలను చూసినప్పుడు అవి సరిగా అమలు జరుగుతున్న సందర్భాలు తక్కువగా ఉంటున్నాయన్నారు. పిల్లల హక్కులకు సంబంధించి ఉన్న చట్టాలు రక్షించేవిగానే ఉన్నాయని, అవి శిక్షించే చట్టాలుగా లేవన్నారు. బాలల హక్కుల కోసం ఉన్న చట్టాలు మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్లలోపు శిక్షించేలా చట్టాలున్నాయన్నారు. జువెనైల్ యాక్టు ముఖ్యంగా పిల్లల్లో అసమానతలు తగ్గించడం, తదితర విషయాలపై పిల్లల హక్కులకు రక్షణగా ఉపయోగపడుతుందన్నారు. యూనిసెఫ్ అధికారి సోనీ జార్జి మాట్లాడుతూ చైల్డ్ ఫ్రెండ్లీ జస్టిస్ వల్ల సమాజానికి మేలు జరుగుతుందన్నారు. జ్యుడీషియల్ అధికారులకు చాలా తీర్పుల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని చెప్పారు. భారతీయ జ్యుడిషియరీ సిస్టం పిల్లలను కాపాడటం కోసం అర్థవంతంగా పనిచేస్తోందని వివరించారు. దివ్యదిశా ఎన్‌జివో డైరెక్టర్ ఫిలిప్ మాట్లాడుతూ ఇంట్లో పిల్లలు తప్పుచేస్తే ఏవిధంగా లాలనగా చూస్తామో అదేవిధంగా జువెనైల్ హోంకు వచ్చిన పిల్లలతో కూడా అదే మాదిరిగా ప్రవర్తించాలన్నారు. హెల్ప్ సంస్థ డైరెక్టర్ నిమ్మరాజు రామ్మోహనరావు మాట్లాడుతూ బాలుర పరిశీలనా గృహాలకు వచ్చిన పిల్లలను వృత్తి నైపుణ్యత కలిగిన సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించడం, విద్య, నైపుణ్య శిక్షణ వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పివి రాంబాబు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పిల్లల హక్కులపై పనిచేస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు, చీఫ్ మెట్రోపాలిటన్, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌లు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిలు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, పలువురు ఎన్‌జివో నేతలు, జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..సదస్సులో ప్రసంగిస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథన్