ఆంధ్రప్రదేశ్‌

కింకర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 31: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌ను జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇరుకున పెట్టారు. ప్రత్యేక హోదా అంశంపై భిన్నమార్గంలో పోరాడుతున్న ఇద్దరు నేతలు కలసి పోరాడటం భ్రమ అనే అంచనాల నేపథ్యంలో, హోదాపై తాను వైసీపీతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ చేసిన బహిరంగ ప్రకటన వైసీపీని రాజకీయంగా ఆత్మరక్షణలోకి నెట్టింది. స్వయంగా పవన్ ముందుకొచ్చి హోదా కోసం వైసీపీతో కలసి పోరాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనను అంగీకరించాలా? వ్యతిరేకించాలా? లేక వ్యూహాత్మక వౌనం పాటించాలా? అనే సందిగ్ధంలో వైసీపీ నాయకత్వం పడిపోయింది. హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమతో కలసి పోరాడాలని ఇప్పటివరకూ సవాల్ విసురుతున్న జగన్.. ఇప్పుడు అదే ప్రతిపాదన పవన్ నుంచి రావడంతో ఎలా స్పందించాలో తెలియని సంకటంలో పడ్డారు. ఒకవేళ పవన్ సూచనలకు స్పందించి ఆయనతో కలసి పోరాడితే హోదాపై చేసే ఉద్యమంలో పొలిటికల్ మైలేజీ అంతా సహజంగా పవన్‌కే వెళుతుంది తప్ప, తమకేమీ రాజకీయ ప్రయోజనం ఉండదని వైసీపీ నేతలు విశే్లషిస్తున్నారు. మీడియా, ప్రజలు కూడా పవన్‌కే ప్రాధాన్యమిస్తారు తప్ప తమను పట్టించుకోరని వైసీపీ నేతలు అసలు విషయం చెబుతున్నారు. ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, పైగా ఆ స్థాయిలో జనసమీకరణ చేయాలంటే భారీగా చేతిచమురు వదులుతుందని చెబుతున్నారు. పోనీ ఆర్థిక సమస్యను లెక్కచేయకుండా జనసమీకరణ చేసినా అందులో జనసేన భాగస్వామ్యం ఉండదంటున్నారు. అప్పుడు కూడా అంతా సినీనటుడైన పవన్ ఏమిచెబుతారో చూస్తారే తప్ప, నిరంతరం అదే అంశంపై మాట్లాడే తమ నేతను పట్టించుకోరని వివరిస్తున్నారు. అదీగాక జనసేనకు క్యాడర్ లేనందున జనసమీకరణ తాము చేస్తే జెండాలు మాత్రం జనసేనవి ఉంటాయంటున్నారు. అప్పుడు జనసమీకరణ పైనా విశే్లషణ జరిగితే రెండు పార్టీలకూ సమంగా మార్కులొస్తాయని వైసీపీ నేతలు విశే్లషిస్తున్నారు. ఇప్పుడు పవన్ ప్రతిపాదనపై ఏవిధంగా స్పందించాలనే దానిపై వైసీపీలో తర్జనభర్జన మొదలైంది. ‘అసలు పవన్ ఇలాంటి ప్రతిపాదన తెస్తారని మేం ఎప్పుడూ ఊహించలేదు. ఆయనకు అంత రాజకీయ వ్యూహం, పరిణతి ఉంటుందని అంచనా వేయలేదు. నిజంగా పవన్ మొన్న వైజాగ్ వస్తే మాకంటే ఆయనకే ఎక్కవ పొలిటికల్ మైలేజీ వచ్చేది. రేపు జగన్ సార్, పవన్ కలసి కార్యక్రమాలకు హాజరైతే వాటికి మీడియాలో మంచి స్థానమే లభిస్తుందనేది నిస్సందేహం. కానీ, అందులో పవన్‌కు అంతా తొలి ప్రాధాన్యం ఇస్తారు. అది మాకు రాజకీయంగా నష్టం. కానీ పవన్ ప్రతిపాదనపై మేం వౌనంగా ఉంటే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. మరి దీనిపై జగన్ ఇంకా మాతో చర్చించలేద’ని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పవన్ ప్రతిపాదనపై వౌనంగా ఉంటే హోదా అంశంపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని, నిజంగా హోదా సాధించాలని ఉంటే పవన్ ప్రతిపాదనకు అంగీకరించేవాళ్లన్న భావన ప్రజల్లోకి వెళితే ప్రమాదమని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఒకవైపు బాబు సహా అందరినీ హోదా పోరుకు కలసిరమ్మని తామే పిలుపునిస్తూ, మరోవైపు పవన్ ప్రతిపాదనపై జవాబు చెప్పకపోతే అది జనంలోకి మరోరకంగా వెళ్లే ప్రమాదం ఉందని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ప్రతిపాదనపై జగన్ ఏవిధంగా స్పందిస్తారోననే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.