ఆంధ్రప్రదేశ్‌

అక్కరకు రాని చట్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: సాగునీటి పథకాల్లో పునరావాస, పునర్నిర్మాణ పథకం బూటకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం, కొత్త పునరావాస చట్టం అక్కరకు రాకుండా పోయాయి. నిర్వాసితుల్లో పద్దెనిమిదేళ్లు నిండిన ఆదివాసీ యువతీ, యువకులకు తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పరిహారం అందించాలి. అయితే అది జరగలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో దాదాపు ఆరు వేల మంది పద్దెనిమిదేళ్లు నిండిన యువతీ, యువకులకు కొత్త చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ అందించకుండా మొండిచేయి చూపించారు. నిర్వాసితులందరికీ కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సివుంది. పద్దెనిమిదేళ్లు నిండిన యువతీ, యువకులకు జీవో నెంబర్ 76, 88 ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాల్సివుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 7881 మంది నిర్వాసితులవుతున్నారు. 26 పునరావాస కేంద్రాలను గుర్తించారు. ఇప్పటి వరకు తొమ్మిది కేంద్రాల్లో పునరావాసం కల్పించినట్టు అధికారులు స్పష్టంచేశారు. సామాజిక సర్వేలో ఎస్సీలు 449 మంది, ఎస్టీలు 4331 మంది, ఇతరులు 3101 మంది మొత్తం 7881 మంది ఉన్నట్టుగా గుర్తించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఇళ్లు, భూములు కోల్పోయిన ఆదివాసీలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పునరావాసం అరకొరగా అందించారు. ముంపు మండలాల్లో ఎక్కడా పద్దెనిమిదేళ్లు నిండిన వారికి పునరావాసం కల్పించలేదు. భూములు ప్రాజెక్టు పేరుతో లాక్కున్న ప్రభుత్వం భూమికి భూమి ఇవ్వకపోవడంతో ఆదివాసీల దుస్థితి పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టుగా తయారైంది. నిర్వాసితుల్లో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి పనె్నండేళ్లుగా చట్టం వర్తింపజేయలేదు. మొత్తం 126 గ్రామాల్లో పద్దెనిమిదేళ్లు నిండిన ఆదివాసీ యువతీ యువకుల భవిష్యత్తు అయోమయంగా మారింది. దేవీపట్నం మండలంలో ముంపు గ్రామాల్లో కొన్ని చోట్ల భూములు పుష్కర పథకంలో పోతే, మరి కొన్ని గ్రామాల్లో ఇళ్లు పోలవరం ప్రాజెక్టులో పోయాయి. ఎడాపెడా ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఈ మండలంలోని ఆదివాసీలు నిర్వాసితులయ్యారు. దేవీపట్నం మండలంలో పనె్నండు మంది యువతీ, యువకులకు చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ అందలేదు. గండిపేట గ్రామానికి చెందిన హనుమంతుల సుబ్బారావు దొరకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హనుమంతుల సుబ్బారావు దొర మృతి చెందడంతో పిల్లలు ముగ్గురు పద్దెనిమిదేళ్లు నిండినా వారికి పునరావాసం అందలేదు. కనీసం పునరావాస కాలనీలో ఇళ్లు కూడా కేటాయించకపోవడంతో పరాయి పంచన బతుకుతున్నారు. కన్నవాళ్ళు లేకపోయినా ఉన్న ఊరు ఇపుడు పునరావాస కాలనీకి వలస పోతోంది. ఇళ్లున్నవారికి ఇళ్లిచ్చారు. తల్లిదండ్రులు చనిపోయినందుకు వారికి ఇల్లులేదు. సీతానగరం గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. చట్ట ప్రకారం ప్యాకేజీ డబ్బు వస్తే తమ చెల్లెలకు వివాహం చేస్తామని చెబుతున్నారు. అదే గ్రామానికి చెందిన నాగమణి, రామకృష్ణ దొర, కొండపల్లి సీతమ్మ, రాంబాబు దొర, జమ్మి శివరామకృష్ణ దొర, కొండపల్లి సూరిబాబు దొర, వాకపల్లి శ్రీనివాసరావు దొర, జమ్మి అప్పనదొర ఇలా ఎంతో మందికి చట్ట ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ అందలేదు. అదే విధంగా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామంలో దాదాపు 200 మందికి ప్యాకేజీ అందలేదు. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం పునరావాసం కింద రూ.2.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండినవారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. అంగులూరులో 40 మందికి ప్యాకేజీ అందలేదు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే పిల్లల చదువుకైనా ఉపయోగించుకుని ఎక్కడికో పోయి బతుకుతామని ఆదివాసీలు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అరకొర ప్యాకేజీలతో చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేసిన దాఖలాలు మాత్రం ఆదివాసీ ప్రాంతాల్లో కానరావడం లేదు. చట్టం ప్రయోజనాలు దక్కక నిర్వాసితుల పరిస్థితి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా మారింది.

చిత్రం..నేలకోట గ్రామంలో 18 ఏళ్లు నిండినా పరిహారం అందని ఆదివాసీ యువతీ యువకులు