ఆంధ్రప్రదేశ్‌

జంఝావతిపై ఒడిశా పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 1: అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తున్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అగమ్యగోచరంగా మారింది. పొరుగు రాష్ట్రం ఒడిశా పెడుతున్న మడత పేచీల కారణంగా దశాబ్దాల తరబడి ఈ ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఒడిశాతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాత్కాలికంగా రైతులకు సాగునీరందించేందుకు ఆసియాలోనే మొట్ట మొదటిసారి రబ్బరుడ్యామ్‌ను జంఝావతి ప్రాజెక్టుపై నిర్మించారు. 2006లో ఈ రబ్బరుడ్యామ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కానరాలేదు. అప్పట్లో రబ్బరుడ్యామ్ ద్వారా జంఝావతి ప్రాజెక్టు పరిసరాల్లో 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని నిర్ణయించారు.
ముంపు గ్రామాల్లో పక్కా కట్టడాలు
ఇదిలా ఉండగా జంఝావతి ముంపు గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలాగూ జలాశయ గర్భంలో కలసిపోవాల్సిన గ్రామాలేనని తెలిసి ఒడిశా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. జంఝావతి ద్వారా జిల్లాలో 24,600 ఎకరాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన రిజర్వాయరు పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. నాలుగు దశాబ్దాల కిందట పనులు ప్రారంభించే ముందు ఇరు రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాయి. ఈ మేరకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నీటిపారుదల, అటవీశాఖ, రెవెన్యూశాఖలు సంయుక్త సర్వే నిర్వహించి రిజర్వాయరు నిర్మాణంలో ముంపునకు గురయ్యే గ్రామాల భూములను గుర్తించాయి. వీటిలో కొరాపుట్ జిల్లా సరిహద్దులోని బందుగాం బ్లాక్‌కు చెందిన కప్పలాడ, అలమండ పంచాయతీల గ్రామాలు, పంట భూములు, బంజరు ఉంది. అలాగే వేపవలస, ఎగువ బోతరపల్లి, దిగువ బోతరపల్లి, జైకోట, మెల్లికవలస, బంగారివలస, గడబవలస, బంకిడి, టికరపాడుకు గూడేలు ఉన్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల వరకు ఒడిశా భూభాగం ఉంది. సంయుక్త సర్వే అనంతరం ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి పనులు జోరుగా సాగిస్తోంది. పిఎంజిఎస్‌వై నిధులతో పక్కా రహదారులు ఏర్పాటు చేసింది. మరోపక్క గ్రామాలకు విద్యుద్దీకరణ చేపట్టారు. మరోపక్క ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఒడిశా ప్రభుత్వం ఓ వంతెనను కూడా నిర్మించింది. ఈ విధంగా ఒడిశా ప్రభుత్వం అన్ని విధాలుగా దూసుకుపోతున్నా మన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. గతంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల గిరిజనులు మైదాన ప్రాంతాలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయా గూడెంలలో సౌకర్యాలు మెరుగుపడటంతో మన్యం వీడేందుకు విముఖత చూపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిని సీరియస్‌గా పరిగణించకపోతే ఒడిశా ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.