ఆంధ్రప్రదేశ్‌

ఆలయ భూములకు రక్షణేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: భూముల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ సంస్థలకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు రాజకీయ నేతలు, రాజకీయంగా పలుకుబడి కల్గిన పెద్దలు ఆక్రమిస్తున్న తీరుపై బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో రాజకీయాల కతీతంగా వేడైన చర్చ జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో అటు అధికార పక్ష తెలుగుదేశానికి సంపూర్ణ మద్దతు పలుకలేక, ఇటు విపక్షాల వాదనలు పూర్తిగా సమర్థించలేక దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తడబాటుకు గురి కావాల్సి వచ్చింది. ప్రధానంగా అమరావతి ఆలయానికి చెందిన చెన్నైలోని సదావర్తి సత్రం భూములు, అలాగే విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలకు లీజుపై అప్పగించిన భూములను ప్రస్తావించటమే కాకుండా, ఈ భూముల వేలాలు... లీజు పొడిగింపులపై భారీగా కమీషన్లు చేతులు మారాయంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇతర సభ్యులు నిప్పులు చెరిగారు. తొలుత ఆళ్ల రామకృష్ణారెడ్డి సిద్ధార్థ భూముల లీజు వ్యవహారాన్ని ప్రస్తావిస్తుండగా అధికార పక్ష సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, తదితరులు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తిప్పికొడుతూ సిఎం చంద్రబాబు నివాస గృసం వెనుకనున్న దుర్గమ్మను ఆయనతో పాటు అందరూ దర్శించుకుంటున్నారు కానీ.. ఆలయ ఆస్తులను వెనుక నుంచి కబ్జా చేస్తున్నారంటూ చేసిన ఆరోపణ కలకలం రేపింది. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కల్పించుకుంటూ ఆ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.70 కోట్లకు పైగా ఉంది.. మొత్తం 14 ఎకరాల భూమి విలువే రూ.10 వేల కోట్లు పైఉంది. చట్టప్రకారం లీజు మార్కెట్ ధరలో 10 శాతం నిర్ణయించాల్సి ఉంటే టిడిపి ప్రభుత్వం కేవలం లక్షన్నర రూపాయలకు అప్పనంగా పాత లీజును పొడిగించిందంటూ ధ్వజమెత్తారు. ఇక చెన్నైలోని అమరావతి ఆలయానికి చెందిన సదావర్తి సత్రం భూములు 400 ఎకరాలకు గాను ఆక్రమణలు పోగా 81 ఎకరాల భూమి ఫెన్సింగ్ మధ్య ఉన్నట్లు తమ పార్టీ ప్రతినిధి బృందం పర్యటనలో గుర్తించిందన్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరా విలువ ఏడు కోట్లు ఉంటే ఈ ప్రభుత్వం కేవలం రూ.22 లక్షలకే తమ తాబేదారులకు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమైందన్నారు. అయితే దీనిపై తాము చేపట్టిన ఆందోళనతో తెలివిగా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసే వారికి ఆ భూములను అప్పగిస్తాం.. అయితే రిజిస్ట్రేషన్‌లు జరపబోం. సేల్ సర్ట్ఫికెట్ అందజేస్తామంటూ ప్రకటించడంవల్లన ఎవరూ ముందుకు రాలేదన్నారు.
వైకాపా సభ్యుడు ఆళ్ల మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వేద విద్య నభ్యసించే వారికోసం, అలాగే బ్రాహ్మణులకు, ఇతరుల కోసం చెన్నైలో 400 ఎకరాల విలువైన భూమిని అప్పగిస్తే ఆక్రమణలు పోను ఇప్పటికి 83 ఎకరాల విలువైన భూమి ఖాళీగా ఉందన్నారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కబ్జా దారుల ఫొటోలతో అన్ని చోట్ల పోస్టర్లు వేయాలన్నారు. టిడిపి సభ్యులు బొండా, గద్దె జోక్యం చేసుకుంటూ సిద్ధార్థ అకాడమీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దుర్గమ్మ భూములను లీజుకు ఇచ్చారని, నాడుడు ఎకరా లీజు 15 వేలు ఉంటే, నేడు 10 రెట్లు అధికంగా రూ.లక్షా 50 వేలతో పొడిగించారన్నారు. దీనికి ఆళ్ల బదులు ఇస్తూ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం లీజును రద్దు చేయగా అత్యున్నత న్యాయస్థానాలు సైతం సమర్థించాయని అన్నారు. ఈ దశలో రోజా, మరికొందరు జోక్యం చేసుకుంటూ సిద్ధార్థ అకాడమిలో చదివిన వారు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ పేదలకు అక్కడ స్థానం లేదన్నారు.
తిరుపతి సమీపంలో వేలాది కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు పైగా ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురయ్యాయంటూ వైకాపా సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల్లో లే అవుట్లు, అలాగే ఉద్యానవన పంటలు వెలిశాయని అన్నారు. సంబంధిత తహశీల్దార్ 900 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయంటూ తనకు కూడా అధికారికంగా సమాధానమిస్తే రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి మాత్రం కలెక్టర్ తనకు కేవలం 296 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయంటూ నివేదిక ఇచ్చారని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వైకాపా సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులోని సిఎఎమ్ ఉన్నత పాఠశాలకు చెందిన క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయంటూ ఆందోళన చేయగా అన్ని పక్షాల సభ్యులు కూడా స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ, ముస్లిం మైనార్టీ ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మోదుగుల వేణుగోపాల రెడ్డి స్పందిస్తూ గుంటూరులో ఎసి కళాశాల ఆస్తులు సైతం కబ్జాకు గురయ్యాయని అన్నారు. అనంతపురంలోనూ క్రైస్తవ సంస్థ ఆస్తులు దురాక్రమణకు గురయ్యాయని, దీనిపై సిబిసిఐడిచే విచారణ జరిపించాలని ప్రభాకర్ చౌదరి కోరారు. క్రైస్తవ మిషన్ ఆస్తులపై సరిగా నెల రోజుల్లో విచారణ జరిపించి ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపగలమంటూ హామీ ఇచ్చారు.