ఆంధ్రప్రదేశ్‌

హోదాకు ప్యాకేజీ ఘనత మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని తమ సొంతం చేసుకునేందుకు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రివర్గం ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే నోట్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రెండు పార్టీలు ఆ అంశానికి రాజకీయ ప్రాధాన్యంతోపాటు, తమ వల్లే ప్యాకేజీ, ప్రధానంగా పోలవరం దక్కిందన్న ప్రచారానికి పదునుపెడుతుండటం ప్రస్తావనార్హం.
ప్యాకేజీకి చట్టబద్ధత కోసం, అందులో కీలకమైన పోలవరం నిధులు, విదేశీ రుణాలకు అనుమతి వంటి అంశాల ఆమోదం కోసం తాను చాలా కష్టపడినట్లు బాబు చెబుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు కోసం తాను కొన్ని డజన్ల సార్లు తిరిగాననని, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షతోపాటు, వర్చువల్ విజిట్ కూడా నిర్వహిస్తూ సోమవారాన్ని ‘పోలవారం’గా మార్చానని బాబు తాజా సభలో వెల్లడించారు. అదే సమయంలో ముంపు గ్రామాలను విలీనం చేసిన తర్వాతనే తాను సీఎంగా ప్రమాణం చేశానని, అందుకే పోలవరానికి అడ్డంకులు లేకుండా పోయాయని గుర్తు చేయడం ద్వారా, తన వల్లే పోలవరం పూర్తికాబోతుందని బాబు చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకూ కేంద్రం ఘనత గురించి చెప్పని బాబు, ఈరోజు తొలిసారిగా కేంద్రం గురించి ఎక్కువగా ప్రస్తావించడం విశేషం. బాబు కృషితోనే ముంపుమండలాలు ఏపిలో విలీనమయ్యాయని దేశం సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో పొగడ్తల వర్షం కురిపించడం ద్వారా పార్టీ భవిష్యత్తు వ్యూహమేమిటో స్పష్టమయింది.
కాగా, ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలతోపాటు, పోలవరానికి వందశాతం నిధుల వల్ల వచ్చే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్యాకేజీకి చట్టబద్ధత కోసం కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన ప్రయత్నాలపై మీడియాలో ఇప్పటికే విస్తృత ప్రచారం జరిగినందున, ఈ విజయాన్ని ఆయన ఖాతాలోనూ కలపనుంది. సుజనా చౌదరి కేంద్రంలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని స్వయంగా బాబు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో అటు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించిన బిజెపి కూడా ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్యాకేజీలో కీలక అంశమైన పోలవరానికి వంద శాతం నిధులు సమకూర్చినందున, ఇక పోలవరం తమ సొంతమేనన్న ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్లనుంది. దీనిపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అప్పుడే తన పార్టీ ఆలోచనాధోరణి పరోక్షంగా వెల్లడించడం గమనార్హం. ‘ఇక పోలవరం మాది. దీనిపై ఎవరికీ హక్కు లేదు. అప్పట్లో టిడిపి సభ్యురాలు సుధారాణి పోలవరం వద్దని చెబితే మిగిలిన వాళ్లు వౌనం వహించారు. ఆ ప్రాజెక్టుకు వందశాతం నిధులు బిజెపినే ఇస్తుంది. మోదీ రెండవ ప్రాధాన్యం కూడా పోలవరమే.
ఇక పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధమైన ముంపుమండలాల విలీనం, సీలేరు ప్రాజెక్టు ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను తామే చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి, దానిని కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నందున ముందు ముంపుమండలాలను విలీనం చేయించాలని సూచించిన విషయాన్ని కూడా బిజెపి ప్రచారం చేయనుంది. సభలో వీర్రాజు ప్రసంగం పరిశీలిస్తే, ఏపికి బిజెపి ప్రభుత్వం చేసిన పనులను జనంలోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ సిద్ధమవుతుందన్న విషయం స్పష్టమయింది.