ఆంధ్రప్రదేశ్‌

మీ శాఖ పనిచూసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: సున్నితమైన ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించేముందు ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించిన తర్వాత మాట్లాడితే బాగుండేదేమో అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. శనివారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖకు సంబంధించిన సమాచారానికి పరిమితమై మిగిలిన అంశాల్లో తక్కువగా మాట్లాడితే బాగుంటుందని, ఈ అంశంపై మంత్రికి సమాచారం, అవగాహన లేకే మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి ఉన్నందునే జీవో 25ను విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని సామాజికవర్గాల సమన్వయం కోసం, అభివృద్ధి చెందని సామాజికవర్గాలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇటువంటి ప్రకటనలు చేస్తే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశముందన్నారు. ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణమాదిగలను ఎవరో ఉద్యమ నాయకులుగా మలచలేదని, వారు చేసిన ఉద్యమాలే వారిని నాయకులుగా ఎదిగేలా చేశాయన్నారు. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలవనున్నట్లు డొక్కా తెలిపారు.

నన్ను సంప్రదిస్తే బాగుండేదేమో!
గుంటూరు, ఫిబ్రవరి 13: తన శాఖ పరిధిలోని ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడే ముందు సంబంధిత శాఖామంత్రిని సంప్రదిస్తే బాగుండేదేమోనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం పరిధిలో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ఎవరూ వ్యాఖ్యానించవద్దన్నారు. గతంలో అసెంబ్లీలో వర్గీకరణకు అందరూ ఆమోదం తెలిపారన్నారు. అయితే సుప్రీంకోర్టు వర్గీకరణను కొట్టివేసిందన్నారు. ఈ అంశంపై కేంద్రం గతంలో ఉషామెహ్రా కమిషన్‌ను నియమించిందన్నారు. వర్గీకరణ అంశం రాజ్యాంగపరమైందన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలు కేటాయించి పలు అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు.

అమాత్యుల రహస్య
పర్యటన ఆంతర్యమేంటో?

రాజధాని రైతుల్లో ఆందోళన గ్రామకంఠాల జాబితా విడుదలలో జాప్యం

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 13: మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై అవగాహన సదస్సులు నిర్వహించిన సమయంలో రైతులు, గ్రామస్థుల నుంచి ఎదురైన వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం, మంత్రులు ప్రస్తుతం ముందస్తు సమాచారం లేకుండా గ్రామాల్లో పర్యటించడంపై ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో రాయపూడి, శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో అనంతవరం గ్రామాల్లో కేవలం అరగంట ముందు సమాచారం అందించి ఒకరిద్దరు పార్టీ నాయకులను మాత్రమే కలిసి వెళ్లడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వారి రహస్య పర్యటనల్లో అంతర్యమేమిటో అర్థంకావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామకంఠాల జాబితా సిద్ధంగా ఉందని, రెండు రోజుల్లో విడుదల చేస్తామంటూ నెలల తరబడి అధికారులు, మంత్రులు చెబుతూ జాప్యం చేయడం పట్ల గ్రామస్థులు మండిపడుతున్నారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించాకే ముందుకు వెళ్లాలంటూ ఇప్పటికే ప్రజలు మంత్రులకు స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రులు, సిఆర్‌డిఎ కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఎటువంటి జాబితాను విడుదల చేయకుండా కాలయాపన చేస్తుండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మాస్టర్‌ప్లాన్ ముసాయిదా ప్రకటించిన నేపథ్యంలో గ్రామాల మధ్యగా ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించే అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మున్సిపల్ శాఖమంత్రి, సిఆర్‌డిఎ వైస్ చైర్మన్ పి నారాయణ స్పందిస్తూ స్థలాలు, నిర్మాణాలు కోల్పోయే వారికి సంతృప్తికలిగే విధంగా రెండు రోజుల్లో ప్యాకేటీ ప్రకటిస్తామని చెప్పి పది రోజులు గడుస్తున్నప్పటికీ ఆ ఊసే లేకుండా మంత్రులు రహస్య పర్యటనలు చేయటాన్ని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. మంత్రుల వ్యవహారాన్ని గమనిస్తే తమకు మేలు చేయాలనే ఉద్దేశంతో లేనట్లు అనిపిస్తోందని, ఇకపై వారిని నమ్మేస్థితిలో లేమని, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటామని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంఘంలో మహిళల
ప్రాతినిథ్యం పెరగాలి
ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 13: ఎపి ఎన్జీవో సంఘంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవసరం ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు అన్నారు. శ్రీకాకుళం సమీపంలోని ఎచ్చెర్లలోని శివానీ కళాశాలలో జరుగుతున్న ఎపి ఎన్జీవోల 19వ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ సంఘంలో మహిళల ప్రాతినిథ్యం పెరిగేలా నేతలంతా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్జీవోల రాష్ట్ర సారథ్య బాధ్యతలను మహిళలే నిర్వహిస్తున్నారన్నారు. తాలూకా, జిల్లా కేంద్రాలలో సంఘం మరింత పటిష్టంగా ఉండేందుకు మహిళా భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ దిశగా ఆయా సంఘ బాధ్యులు మహిళా ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి వాటిని పరిష్కరించాలన్నారు. అదే విధంగా పదవులు పొంది బదిలీలు, ఇతర రాయితీలు అందిపుచ్చుకునే సొంత అజెండా కోసం ఎన్జీవో సంఘంలో బాధ్యతలు స్వీకరించవద్దని కోరారు. అటువంటి వారు తక్షణమే సంఘంలో బాధ్యతాయుత పదవుల నుండి తప్పుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో ఎన్జీవో సంఘానికి రెండు స్థలాలు ఉన్నాయని వాటిలో ఒకదానిని విక్రయించి ఎన్జీవో హోమ్‌ను నిర్మించేందుకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్జీవో హోమ్‌లు సమర్థవంతంగా పనిచేసేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి ఎన్జీవో సంఘం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను కార్యవర్గ సభ్యుల ముందు చదివి వినిపించారు. కొత్త విభాగాల ఉద్యోగులకు ఎన్జీవో సంఘంలో సభ్యత్వం కల్పించాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మినిస్ట్రీయల్ సిబ్బందికి ఈ సభ్యత్వం కల్పిస్తామని వివరించారు.

ఏప్రిల్‌లో విజయవాడలో
మాదిగల విశ్వరూప సభ
ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 13:రాష్ట్రంలోని కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుహామీ ఇస్తే ఆ హామీని అమలుచేయాలని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు అండగా నిలిచారే తప్ప మాదిగలకు రిజర్వేషన్లు కల్పించటంలో వారిద్దరు సహకారం అందించకుండా మోసం చేస్తున్నారని ఎంఆర్‌పిఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. శనివారం ఒంగోలులో ఆయన విలేఖరులతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని లేకుంటే ఏప్రిల్ 30న విజయవాడలో పదిలక్షలమంది మాదిగలతో విశ్వరూప మహాసభను నిర్వహిస్తామని మంద కృష్ణమాదిగ అన్నారు. బిజెపి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌సి వర్గీకరణపై పెదవి విప్పడంలేదన్నారు. మాదిగలకు సాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలం చెందారన్నారు. జగన్‌కూడా కేవలం కాపులకు అండగా ఉన్నారనే తప్ప మాదిగలకు మాత్రం భరోసా ఇవ్వలేదన్నారు

ఇద్దరు చిన్నారులు సహా
తల్లి ఆత్మహత్య
పాడేరు, ఫిబ్రవరి 13: కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ జిల్లా పాడేరులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన కర్నూలు నాగేంద్ర, వంతాల నందిని (26) ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సాయి (3), క్రిష్ణ (2) అనే ఇద్దరు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య అభిప్రాయభేదాలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నాగేంద్ర తాగొచ్చి భార్యతో గొడవ పడడమే కాకుండా ఆమెను కొట్టినట్టు చెబుతున్నారు. దీంతో నందిని పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పిల్లలతో కలిసి భార్య అత్తవారింటికి వెళ్లిందని భావించిన నాగేంద్ర ఆమె విషయం పట్టించుకోలేదు. అయితే నందిని తన రెండేళ్ల బాబును నడుం భాగాన, మూడు సంవత్సరాల బాబును వీపు భాగాన కట్టుకుని చాకలిపేట సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి శుక్రవారం రాత్రి అత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన తల్లి పిల్లల మృతదేహాలు శనివారం సాయంత్రం బావిలో వెలుగుచూసాయి. ఈ స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్‌ఐ సూర్యప్రకాశ్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సిబ్బందికి శిరోభారంగా వీడియో కాన్ఫరెన్స్‌లు

ఏపి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 13: ప్రభుత్వం తరచూ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ల కారణంగా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వాపోయారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం ఎపి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు విలేఖరులతో మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది కొరత రాష్ట్రంలో తీవ్రంగా ఉందన్నారు. ప్రధానంగా తహసీల్దారు కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్నదని చెప్పారు. ప్రోటోకాల్‌కు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంతమాత్రం సరిపోవడం లేదన్నారు. తరచూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటంతో రెవెన్యూ సిబ్బందికి విధులకు ఆటంకం ఏర్పడుతోందని ఆయన చెప్పారు. నెలకు రెండుసార్లు మాత్రమే కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో 2,484 పోస్ట్‌లు ఖాళీవున్నాయన్నారు. సిసిఎల్‌ఎ ప్రధాన కార్యాలయంలో 173 పోస్ట్‌లకు గాను సుమారు 150 పోస్ట్‌లు ఖాళీలున్నట్టు చెప్పారు. అనేక మండలాల్లో తహసీల్దార్లకు వాహనాలు లేకపోవడంతో ప్రజలకు సత్వర సేవలు లభించడం లేదని అన్నారు. మీసేవ వంటి కార్యాలయాల్లో నియమించే సిబ్బందికి తగిన సాంకేతిక శిక్షణ ఇవ్వాలని కోరారు. సిబ్బందికి తగిన సాంకేతిక శిక్షణ లేకపోవడంతో సుమారు 64 రకాల ధ్రువీకరణ పత్రాల మంజూరులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రెవెన్యూ సిబ్బంది చేసే చిన్న చిన్న తప్పులకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ముందు పోలీసులు తగిన రీతిలో విచారణ జరిపాకే కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో అనేకచోట్ల తహసీల్దారు కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయని అన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే పదోన్నతులు ఇస్తున్నారని, డిపార్ట్‌మెంటల్ పరీక్షలతో సంబంధం లేకుండా అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఆయన సూచించారు. మహిళా విఆర్‌ఎలకు ప్రసూతి సెలవులు 40 నుండి 60 రోజులకు పెంచాలని, కారుణ్య నియామకాలకు 7వ తరగతి అర్హతతో నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సిబ్బంది కొరత ఏర్పడుతుందన్న నెపంతో అర్హులకు పదోన్నతులు కల్పించడం లేదని వెంకటేశ్వర్లు ఆరోపించారు.