ఆంధ్రప్రదేశ్‌

మూడు తరాల ముచ్చట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 4: ఒకే పార్టీలో మూడు తరాల ప్రతినిధులతో అనుబంధమంటే అదొక తీపి అనుభూతి. అలాంటి అపురూప అనుభూతి తెలుగుదేశం పార్టీలో కొందరికే దక్కింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబునాయుడు, ఇప్పుడు క్యాబినెట్‌లో చేరిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ఆ మధ్యలో కొద్దిరోజులు మంత్రిగా చేసిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ.. ఇలా మూడు తరాల ప్రతినిధులతోకలసి పనిచేయడాన్ని సీనియర్లు గర్వంగా భావిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా క్యాబినెట్‌లో చేరిన లోకేష్‌ను చాలామంది మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఎత్తుకుని తిప్పినవారే. ఇప్పుడు ఆయనే తమ మధ్య మంత్రి హోదాలో పక్కన కూర్చోవడాన్ని గర్వంగా భావిస్తున్నారు. అంతకుముందు లోకేష్ తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబుతో కలసి క్యాబినెట్‌లో పనిచేసిన వారిలో కొందరు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతుండగా, మరికొందరు పార్టీలో, ఇంకొందరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండటం విశేషం. అలాంటి అరుదైన అద్భుత అవకాశం తమకు దక్కడం అదృష్టమని పలువురు సీనియర్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘నేను మూడు తరాల వారితో కలసి పనిచేశా. ఆ కుటుంబంతో పనిచేసిన నేను ఇప్పుడు మూడూతరంతోనూ కలసి పనిచేయడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’నని సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా ముందు ఉద్విగ్నంగా చెప్పారు. ఇక ప్రస్తుతం స్పీకర్‌గా పనిచేస్తున్న కోడెల శివప్రసాదరావు ఒకప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో పనిచేసిన వారే. యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, కెఇ కృష్ణమూర్తి, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ప్రతిభాభారతి, పుష్పరాజ్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సతివాడ నారాయణస్వామి, బండారు సత్యనారాయణమూర్తి, ఆలపాటి రాజా, నందమూరి హరికృష్ణ తదితరులు కొందరు ఎన్టీఆర్‌తో, మరికొందరు చంద్రబాబుతో, ఇంకొందరు ఇద్దరి క్యాబినెట్లలో పనిచేసిన వారే. గౌతు శ్యాంసుందర్ శివాజీ వంటి ఎమ్మెల్యేలు మూడు తరాల ప్రతినిధులతో కలసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఎంపి దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నర్శింహులు, ఎల్.రమణ, తదితరులు లోకేష్‌తో కలసి పార్టీ బాధ్యతలు పంచుకోవడం విశేషం.