ఆంధ్రప్రదేశ్‌

సమన్వయమే సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 16 : విభేదాల కుంపటితో రగులుతున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయమే పెద్ద సవాల్‌గా మారింది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల తీరు కొనసాగుతోంది. అధినేత, సిఎం నారా చంద్రబాబునాయుడు పలుమార్లు హెచ్చరించినా విభేదాల కుంపట్లు ఆరడం లేదు. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఎన్నికల ఫీవర్ మొదలవుతోందని, తర్వాత పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు, గెలుపు గుర్రాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కసరత్తు ప్రారంభిస్తే 2019 ఎన్నికలకు సమాయత్తమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నెట్టుకు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల నడుమ, నియోజకవర్గాల్లో వివిధ కేడర్లలోని నేతల నడుమ విభేదాలతో తరచూ రచ్చకెక్కుతుండటం అనంతపురం జిల్లాలో రివాజుగా మారింది. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సైతం అణగదొక్కేశారన్న అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రాయలసీమలో చిత్తూరు, కడప జిల్లాల్లో అధినేత ఆదేశాలపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు, నేతలు రోడ్డెక్కుతుండటం, కర్నూలు జిల్లాలో సైతం విభేదాలు లేకపోలేదు. అదే తరహాలో అనంతలోనూ విభేదాల కుంపట్లు ఆరకపోవడం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. ఈ తరుణంలో కొత్తగా సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాలవ శ్రీనివాసులుతో పాటు మంత్రిత్వ శాఖ మారడంతో ప్రస్తుతం స్ర్తి, శిశు సంక్షేమ, సెర్ప్ శాఖల మంత్రిగా ఉన్న పరిటాల సునీత భుజ స్కంధాలపై పార్టీని ఏకతాటిపై నడిపించే బాధ్యత పడిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో సామరస్య పూర్వక, సమన్వయ సహిత వాతావరణంలో పార్టీని జిల్లాలో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అయితే సీనియర్ నేత, అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డితో పాటు పార్టీలో వివిధ కేడర్లలో పని చేసిన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. అంతేకాదు మంత్రులిద్దరికీ వ్యతిరేక వర్గం లేకపోలేదు. మరోవైపు వైకాపా, జనసేన, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టంగా ప్రకటించిన విషయం విదితమే. ఇక నవ భారత్ నేషనల్ పార్టీ పేరుతో జూనియర్ ఎన్‌టి రామారావు కూడా పార్టీ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇక కమ్యూనిస్టులు సైతం ఎన్నికల్లో పోటీకి నిలుస్తారన్నది ప్రస్తుతం అంచనాకు అందనిదే.
జిల్లాలో ప్రస్తుతం టిడిపికి 13 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపి స్థానాలున్నాయి. వీటిలో కదిరి ఎమ్మెల్యే వైకాపా నుంచి గత ఏడాది టిడిపిలో చేరడంతో 12 స్థానాల నుంచి 13కు చేరింది. ఉరవకొండ ఎమ్మెల్యే స్థానం ఒకటే వైకాపాకు మిగిలింది. జిల్లాలో అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, ఎంపి జెసి దివాకర్‌రెడ్డికి, కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు, నియోజకవర్గవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తిలో ఎమ్మెల్యే, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ పిసి గంగన్న, పెనుకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బికె పార్థసారథికి, హిందూపురం ఎంపి నిమ్మల కిష్టప్పకు మధ్య విభేదాలున్నాయి. ఇక మంత్రి కాలవ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలోనూ ఆయనతో విభేదిస్తున్న వర్గం ఉంది. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం పనిచేస్తోంది. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు, మంత్రి పరిటాల సునీతకు మధ్య విభేదాలున్నా, గత శనివారం ధర్మవరంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వారిద్దరూ కలిసి అరగంట పాటు మాట్లాడుకోవడంతో వీరి మధ్య సఖ్యత కుదిరినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాడిపత్రిలో కూడా ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డితో స్థానికంగా విభేదిస్తున్న నాయకులు లేకపోలేదు. హిందూపురంలో ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపైనా స్థానికులకు, పార్టీలోని వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. అభివృద్ధికి, ముఖ్యంగా తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసంతృప్తి వేధిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష వైకాపాని ఎదుర్కోవాల్సి ఉంది. మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్లు, ఉరవకొండ, పెనుకొండ, మడకశిర, తాడిపత్రిలో సైతం వైకాపాను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనంత టిడిపిలో ఇంటా, బయటా కూడా గెలవాల్సిన విషమ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రుల మాట చెల్లుబాటు అవుతుందా.. అందరు నేతలు, ఎమ్మెల్యే ఏకతాటిపై వస్తారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ నేతలే సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపి స్థానాలూ దక్కించుకోవడం మాటెలా ఉన్నా ప్రస్తుతం ఉన్న స్థానాల్లో సగం అసెంబ్లీ స్థానాలు చేజారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న చర్చ సాగుతోంది.