ఆంధ్రప్రదేశ్‌

విదేశాల్లోనూ రాజకీయ విద్వేషమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 12: ఆగర్భ రాజకీయ శత్రువుల్లా వ్యవహరిస్తున్న తెలుగుదేశం-వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరం ఇప్పుడు విదేశాలకూ పాకింది. ఇది పరాకాష్ఠకు చేరి డలాస్‌లో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఎర్రచందనం స్మగ్లర్లను చంపించినందుకు అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై రాజకీయాలకు అతీతంగా ఆక్షేపణ వ్యక్తమవుతోంది. విదేశాల్లో కూడా విద్వేష రాజకీయాలను కొనసాగించడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఎంతన్నది పక్కకుపెడితే, అంతర్జాతీయంగా తెలువారి పరువు దిగజారిపోయిందన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అమెరికాలో పర్యటిస్తోన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటూ మానవహక్కుల కార్యకర్త పేరిట ఇర్వింగ్ మేయర్, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు డొల్ల అని తేలిన విషయం తెలిసిందే. కష్టాల్లో ఉన్న కొత్త రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వెళ్లిన ముఖ్యమంత్రిని, విదేశాల్లో అరెస్టు చేయించాలన్న దుర్బుద్ధి బయటపడిన అనంతర పరిణామాలు రాష్ట్రాన్ని అభాసుపాలు చేయాలన్న వారికి, చెంప దెబ్బవంటిదేనన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వారన్నది పక్కకుపెడితే, రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా విదేశాలకు వెళ్లిన నేతను అరెస్టు చేయిస్తే, పోయేది రాష్ట్రం పరువే తప్ప, వ్యక్తుల పరువు కాదన్నది గుర్తు పెట్టుకోలవాలన్న సూచన వ్యక్తమవుతోంది.
‘ఇప్పుడు బాబు సీఎం ఉండవచ్చు. రేపు జగన్ కావచ్చు. వాళ్లిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం పరాకాష్ట స్థాయి దాటిపోయిన విషయం అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో వారి సానుభూతిపరుల మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతోంది. బాబును అరెస్టు చేయాలన్న కోరిక మనకు తెలిసి వైసీపీకి తప్ప మరెవరికీ ఉండదు. అదే జరిగితే రాజకీయంగా ఆ పార్టీకే లాభమని అందరికీ తెలుసు. కానీ టిడిపిని ప్రజాక్షేత్రంలో దెబ్బతీసి, ఎన్నికల్లో వైసీపీ అధికారం సాధించవచ్చు. ఇలాంటి విష రాజకీయాల వల్ల తాము ప్రజల్లో పలచన అవుతామన్న విషయాన్ని గ్రహించాల’ని నాగార్జున వర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు.
డలాస్ ఘటనపై సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే తటస్థవర్గాలు కూడా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ బాబును పార్టీ అధ్యక్షుడిగా కాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుర్తించాలని, ఆ స్థానంలో జగన్ ఉన్నా, మరొకరున్నా వారు వెళ్లేది తెలుగువారి ప్రతినిధిగా అన్న విషయాన్ని మరచిపోయి, తెలుగుజాతి పరువుతీసే చర్యలకు పాల్పడటం క్షంతవ్యం కాదంటున్నారు. రేపు జగన్ సీఎం అయి విదేశాలకు వెళితే, ఇదే పని అక్కడి టిడిపి వర్గాలు చేస్తే స్వాగతిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం. ఈసారి పర్యటనలో ప్రపంచంలో లబ్ధప్రతిష్ఠులైన కంపెనీ సీఈఓ, సీఓఓలను కలసి వారిని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం ప్రయత్నాలను అడ్డుకుంటే నష్టపోయేది రాష్ట్రం-ప్రజలే తప్ప, చంద్రబాబునాయుడు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కక్కుతున్న విషం సరిపోక, విదేశీ వేదికలపైనా విద్వేష రాజకీయాల వల్ల రాష్ట్రం పరువుపోతోందన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. రెండు పార్టీలు తమిళనాడు, కర్నాటక రాజకీయ నాయకులను చూసి సిగ్గుతెచ్చుకోవాలన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కావేరి జలాల వంటి సున్నిత అంశంలో కర్నాటక- తమిళనాడులో జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ తమ పార్టీవిధానాలను పక్కకుపెట్టి, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ఎంపీలు తమ తమ రాష్ట్రాల సమస్యల ప్రస్తావన, వాటి సాధన కోసం కలసిపనిచేస్తున్న విషయాన్ని తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నాయో అర్ధం కావడం లేదంటున్నారు. ఒక సీఎంను అకారణంగా పరాయి దేశంలో అరెస్టు చేయం అసాధ్యమని, అందుకు విదేశీ సంబంధాలు అడ్డునిలుస్తాయన్న విషయం తెలిసి కూడా, ఆయనను అరెస్టు చేయాలన్న మెయిల్ పంపడాన్ని ఏ ఒక్క తెలుగువాడు సమర్ధించరని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర లేదని, కావాలంటే న్యాయ విచారణ చేయించుకోవాలంటున్న వైసీపీ నేతలు, జరిగిన ఘటనను రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనయినా ఖండించకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
‘దీనిపై సోమిరెడ్డి, కాలువ శ్రీనివాసులు, వర్ల రామయ్య లాంటివాళ్లు ఖండిస్తున్నారు. వాళ్ల పార్టీ కాబట్టి, బాబుపై ఫిర్యాదు వచ్చింది కాబట్టి ఖండించారు. కానీ ఇది యావత్ తెలుగు ప్రజల, రాష్ట్ర పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రతి తెలుగువాడు ఖండించతగ్గ విషయం. ఇక్కడ సీఎం ఎవరున్నారని కాదు. విదేశాల్లో ఆయనపై వేసే బురద మన ప్రతిష్ఠపై చల్లడమే. దీన్నిబట్టి మన పార్టీల రాజకీయాలు ఎంత నికృష్ఠంగా కొనసాగుతున్నాయో అర్ధమవుతోంది. దీనిని ప్రతి ఒక్క తెలుగువాడు ఖండించాల’ని అఖిల భారత తెలుగు ఆత్మగౌరవ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిబాబా వ్యాఖ్యానించారు.