ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: రాష్ట్ర పునర్విభజన చట్టం 9,10వ షెడ్యూలు ప్రకారం ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని స్థిరాస్తులపై రావాల్సిన వాటా ధనం దాదాపు 35వేల కోట్ల రూపాయలు పైగా రాబట్టుకోటానికి తుది గడువు మరో 40 రోజుల్లో ముగుస్తుంటే దీనిపై ఏ మాత్రం పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఊడిగం చేస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నిప్పులు చెరిగారు. కోర్ కేపిటల్ పేరిట ఎనె్నన్నో వివాదాల్లోనున్న 1690 ఎకరాల విలువైన భూమిని సింగపూర్ కన్సార్టియం సంస్థకు ధారాదత్తం చేసేందుకు ఈనెల 15తేదీ ఎంవోయు కుదుర్చుకుని ఎంచక్కా ఐదోసారి శంకుస్థాపన చేసేందుకు భారీఎత్తున జనసమీకరణకు తలపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మున్ముందు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే సింగపూర్ సంస్థకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోటం దారుణాతి దారుణమన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం సమితి కన్వీనర్ అనుమోలు గాంధీ, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాధ్‌లతో కలిసి వడ్డే విలేఖరులతో మాట్లాడుతూ రైతులు ఇచ్చిన భూముల్లో శాశ్వత ప్రాతిపదికన సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్, హైకోర్టు భవనాల నిర్మాణం జరుగబోతుందనే భ్రమలు కల్పించేలా సిఎం చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా వాటి కోసం కేటాయించిన 900 ఎకరాల భూమికి ఆనుకున్న ఉన్న ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాల మధ్యనున్న మరో 1690 ఎకరాల భూమిని కేవలం రూ.306 కోట్లకు.. అదీ దశలవారీగా పెట్టుబడి పెట్టే సింగపూర్ సంస్థకు తమ సొంత సొమ్ములా ధారాదత్తం చేయబోతున్నారంటూ వడ్డే మండిపడ్డారు. స్విస్ చాలెంజ్‌లోని మార్గదర్శక సూత్రాలను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టినప్పటికీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తిరిగి సింగపూర్ సంస్థకే లబ్ధి చేకూరేలా సవరణలు చేసి టెండర్లను పిలవటం దారుణాతి దారుణమన్నారు.
ఇప్పటికే తొలుత భూమిపూజ, 2015లో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన, తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన, శాశ్వత సచివాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపనకు రాళ్లు వేయగా తిరిగి ఐదోసారి ఈనెల 15తేదీ మరో రాయి వేయబోతున్నారని అన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే కోర్ కేపిటల్‌కు మూడో దశలో అంటే 15 ఏళ్ల తర్వాత అభివృద్ధి చేయాల్సిన ప్రాంతంలో ఇప్పుడు శంకుస్థాపన చేయటం ఏమిటని వడ్డే ప్రశ్నించారు. అసలు కోర్ కేపిటల్ డిజైన్లు, మాస్టర్ ప్లాన్ ఖరారు కాలేదన్నారు. ఇదిలా ఉంటే ఈ 1690 ఎకరాల్లో తన భూమితో పాటు 130 ఎకరాల భూమి వివాదం కోర్టులో ఉందని అనుమోలు గాంధీ అన్నారు. 400 ఎకరాల ఎస్‌సి అసైన్డ్ భూములు కూడా వివాదాల్లో ఉన్నాయని అన్నారు. పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో జరుగుతున్న వివాదంలో ప్రభుత్వ న్యాయవాది గంగూలి అందచేసిన అఫిడవిట్‌లో ప్రభుత్వ కోర్ 900 ఎకరాలు, ఈ 1690 ఎకరాల్లోనూ 70 శాతం భూములు వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని వాటిల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టటం లేదని తన అఫిడవిట్‌లోని 111వ పేజీలో పేర్కొన్నారన్నారు.
పైగా కరకట్టను ధ్వంసం చేసి నదిలోకి తిరిగి కట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చట్టపరంగా సాధ్యం కాదన్నారు. ఇక ఈ 1690 ఎకరాల్లో వౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల 560 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని వడ్డే అన్నారు. కేవలం రూ.306 కోట్లు ఖర్చు చేసే సింగపూర్ సంస్థకు ఈ ప్రాజెక్టు కోసం ఆవిర్భవించిన అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్ (ఎడిపి) పేరిట 58 శాతం వాటా కల్పించడం దారుణమన్నారు. పైగా ఇందులో నిర్మితమయ్యే భారీ వాణిజ్య, గృహ సముదాయాల వల్ల లభించే లాభాల్లో ప్రభుత్వ ప్రస్తుత లెక్కల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం రూ.2,235 కోట్లు వస్తే సింగపూర్ సంస్థకు రూ.3,086 కోట్లు వస్తాయని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. వాస్తవానికి ఇంతకు మూడురెట్లు అదనపు ఆదాయం రాగలదన్నారు. ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అంతుబట్టటం లేదన్నారు.