ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో నివురుగప్పిన అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 14: తెలుగుదేశం పార్టీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా రగులుకుంటోంది.. కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ పదవుల్లో కాపు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంలేదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.. త్వరలో ఖాళీ కానున్న రెండు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులలో టిడిపి తరుపున ఇప్పటికే ఒకటి రెడ్డి వర్గానికి కేటాయించారనే ప్రచారం జరుగుతుండటంతో మరో సీటు కాపులకు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. గుంటూరు జిల్లాలో పార్టీలోకి వలస వచ్చిన మాజీమంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్‌కు ప్రాతినిధ్యం కల్పించారని అప్పట్లో 23 సీట్లకు గాను కేవలం ఒక్కటి మాత్రమే అదీ తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రయ్యను ఎంపిక చేశారని ఆ వర్గం నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది.. ఎమ్మెల్సీ టిక్కెట్ల విషయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో అనేక సందర్భాలలో జిల్లాకు చెందిన ఒకరిద్దరు కాపు నేతలకు హామీ కూడా ఇచ్చారు. అంతేకాదు ఒకవిడత ఎంపికచేసిన అభ్యర్ధిని చివరి నిముషంలో పక్కనపెట్టి పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో చిగురుపాటి వరప్రసాద్‌కు మొగ్గుచూపటంతో అదే ఎన్నికల్లో ఆయన పరాజయం పొందిన విషయాన్ని జిల్లా నేతలు గుర్తుచేస్తున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయటంతో పార్టీ అధినేత గోదావరి జిల్లాల నేతల్ని మాత్రమే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. గతంలో 23 సీట్లు ఖాళీ అయితే కమ్మ వర్గానికి నాలుగు, రెడ్డి కులస్థులకు 6, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున, బిసిలలో నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారని కాపులకు ఒకే ఒక్క సీటుతో సరిపెట్టారని అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమను పరిగణనలోకి తీసుకోవటంలేదని కొందరు కాపు నేతలు వాదిస్తున్నారు. అదేమని అధిష్టానం వద్ద ప్రశ్నిస్తే తమను పక్కనపెడుతున్నారనే భావన అసమ్మతి నేతల్లో వ్యక్తమవుతోంది. గత మూడు దశాబ్దాలుగా కందుకూరులో టిడిపి శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి రాజామాస్టారుకు గతంలో అనేకసార్లు పార్టీ అధినేత అభయహస్తం ఇచ్చి ఎన్నికల సమయంలో మరొకరికి అవకాశం ఇచ్చారు. విద్యావేత్తగా తనకున్న అనుభవంతో పార్టీ క్యాడర్‌కు శిక్షణ ఇస్తున్న ఆయనకు అధినేత అండదండలు ఉన్నా ఇప్పటి వరకు ఏ పదవికి నోచుకోలేదని కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి కందుకూరుకు నిత్యం వెళ్లి శిక్షణ ఇస్తున్న ఆయన ఈ సారి గవర్నర్ కోటాలో అయినా అవకాశం ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో కాపు నేత చందు సాంబశివరావు గతంలో దుగ్గిరాల నియోజకవర్గం నుంచి పోటీచేశారు. కాపుల్ని కాదని వలస నేతలను అందలం ఎక్కించటాన్ని కాపు సామాజిక వర్గ నేతలు తప్పుపడుతున్నారు. టిడిపిలో అసమ్మతి వాదులతో ముద్రగడ లోపాయకారీ మంతనాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులను టిడిపికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గవర్నర్ కోటాలో కాపులకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకోవాలని కాపు నేతలు నిరీక్షిస్తున్నారు.