ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో భూ మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ మాఫియా చెలరేగిపోతోంది... వాగులు.. వంకలు.. చెట్లు.. పుట్టలను సైతం తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.. చివరకు కొండలను సైతం తొలిచి లే-అవుట్‌లు వేస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఊహించుకోవచ్చు. తన నియోజకవర్గంలోనే సుమారు 700 ఎకరాలకు పైగా వాగు, కొండ పోరంబోకు భూములు అన్యాక్రాంతం చేశారని ఆరోపిస్తూ మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు మండలం రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో వాగులు, చెరువులు, కొండ ప్రాంత భూములు సుమారు పదివేల ఎకరాల వరకు ఉన్నాయి. వీటిలో కొంత భూమిని అధికార పార్టీ అండదండలతో పలువురు స్వాధీనం చేసుకుని అక్రమంగా వెంచర్లు వేశారు. మంగళగిరి నియోజకవర్గం నీరుకొండలో 450 ఎకరాల వాగు పోరంబోకు భూమితో పాటు పెనుమాక గ్రామంలోని 200 ఎకరాల కొండ పోరంబోకు భూములలో అనధికార లేఅవుట్లకు ఎలా అనుమతిచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో సైతం గతం నుంచి అనుభవ.. హక్కుదార్లుగా పత్రాలు సృష్టిస్తున్నట్లు తేలింది. రాజధాని ప్రాంతంలో అక్రమ లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఆర్డీయే అధికారులు ప్రకటించినా ఇప్పటి వరకు ఈ భూముల వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గుంటూరు విజిలెన్స్ అధికారులను కోరినట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో విచ్చలవిడిగా పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేస్తున్నట్లు కూడా విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. ఓ మహిళా అధికారి అసైన్డ్ భూములకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలంటే తన అల్లుడి పేరిట ఓ ఎకరం కేటాయించాలని భూ మాఫియాను డిమాండ్ చేసినట్లు చెప్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల తతంగం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితేకానీ వాస్తవాలు వెలుగులోకి రావనేది స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మూడున్నర ఎకరాల నిషేధిత వాగు పోరంబోకు భూమిని కేటాయించటం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాగులు, చెరువులు, కాల్వలు ధ్వంసం చేస్తే గ్రామానికి నీటివనరులెలా సమకూరతాయని మంగళగిరి రూరల్ మండలం ఆత్మకూరు గ్రామస్థులు వాదిస్తున్నారు. గ్రామంలో సర్వే నెంబరు 392లో 3.78 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైన వైనంపై ఇటీవల ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ప్రధాన సంచికలో వార్తాకథనం వెలువడిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతరుల నుంచి విజిలెన్స్ అధికారులకు వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించిన అనంతరం తగిన ఆదేశాలిస్తే విచారణ జరుపుతామని అధికారులు చెప్తున్నారు. అయితే భూముల వ్యవహారం తెరవెనుక అధికార పార్టీ ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఎంత వరకు న్యాయం జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.