ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్య శాఖకు అనారోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: వైద్య, ఆరోగ్య శాఖలో డెప్యుటేషన్ల వ్యవహారం విమర్శలకు గురవుతోంది. సిబ్బంది బదిలీల్లో పారదర్శకత పాటించాలనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటన మాటలకే పరిమితమైంది. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత డెప్యుటేషన్ పేరుతో పనిచేస్తున్న చోటికే పోస్టింగ్‌లు ఇవ్వడం వెనుక భారీగా ముడుపుల వ్యవహారం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఒకచోటే తిష్ఠవేసుకున్న సిబ్బంది తిరిగి అక్కడే కొనసాగే వీలు కలిగింది. వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలను ఈ ఏడాది మేలో విడుదల చేశారు. జూన్ మొదటి వారంలో బదిలీల ప్రక్రియ ముగిసింది. చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల బోధనాసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని అక్కడే కొనసాగించేలా చూడాలంటూ ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు వైద్య విద్య సంచాలకునికి సిఫారసు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీ చేసినప్పటికీ కొందరికి డెప్యుటేషన్‌పై అక్కడే కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే ఈ వెసులుబాటును పలువురు సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై వివిధ రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి సిఫారసు చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. దీంతో చాలాకాలంగా పనిచేస్తున్నచోటే డెప్యుటేషన్ కారణంగా మరలా కొనసాగే అవకాశం కొందరికి లభించింది. ఇప్పటికే ఎపి ప్రభుత్వ వైద్యు ల సంఘం ఈ వ్యవహారాలను నిరసిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఆయా డెప్యుటేషన్లను రద్దుచేయాలని డిమాండ్ చేసిం ది. అయినప్పటికీ ఈ నిరసనలను పట్టించుకోకుండా వైద్య, ఆరోగ్య శాఖ బదిలీల ప్రక్రియను కొనసాగించింది. నిజంగా అక్కడే వ్యక్తిగత కారణాలతో కొనసాగాల్సిన వారికి డెప్యుటేషన్ ఇవ్వకపోవడం గమనార్హం. అనారోగ్యం, గర్భం దాల్చడం వంటి కారణాలతో డెప్యుటేషన్ కోరిన వారి వినతులను అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. బదిలీల్లో పారదర్శకత ఒక పెద్ద జోక్ అని, నిబంధనలకు విరుద్ధంగా వైద్య విద్య సంచాలకుని కార్యాలయంలోని కొందరు అధికారులు కొందరు మంత్రుల పేషీల నుంచి వచ్చిన సిఫారసుల మేరకు డెప్యుటేషన్ పేరుతో పోస్టింగ్ ఇచ్చారని శ్రీకాకుళం రిమ్స్‌కు చెందిన ఒక ఉద్యోగి ఆరోపించారు. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో చాలామంది ప్రొఫెసర్లు 20ఏళ్ల కు పైగా బదిలీలు జరగకుండా వ్యవహారాలు నడుపుతున్నారని ఒక ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన కారణాలతో తమ స్వస్థలాలకు బదిలీ చేయాలన్న అభ్యర్థనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. బదిలీల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలను ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చామని, త్వరలో మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి పి శ్యామ్ తెలిపారు.