ఆంధ్రప్రదేశ్‌

ఫీజులు చెల్లించలేదని స్కూలు నుంచి గెంటేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 19: పాఠశాల ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన పాఠశాల నిర్వాహకుల వైనమిది. తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేసి విషయాన్ని ఆర్డీవో జి గణేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆర్డీవో పాఠశాల నిర్వాకంపై విచారణకు ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో గల పరంజ్యోతి పబ్లిక్ స్కూలును సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభించారు. విద్యార్థులంతా పాఠశాలలకు యథావిధిగా వెళ్లారు. అయితే ఫీజులు చెల్లించిన వారిని మాత్రమే లోపల ఉంచి మిగిలిన విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా సెక్యూరిటీ గార్డులతో బయటకు గెంటించివేశారు. దీంతో విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ యాజమాన్యం ఫీజులు చెల్లించనిదే అనుమతించేది లేదని ఖరాఖండీగా చెప్పడంతో తల్లిదండ్రులు విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆర్డీవో గణేష్‌కుమార్ తహసీల్దార్ బి బేబీ జ్ఞానాంబ, ఎంఇవో విమలకుమారిలను పరంజ్యోతి పాఠశాలకు పంపించారు. వారు పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు, యాజమాన్యంతో మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి బేబీ జ్ఞానాంబ, పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించనంత మాత్రాన పిల్లలను బయటకు పంపించే అధికారం మీకు ఎవరిచ్చారని పాఠశాల ఎఒపై మండిపడ్డారు. ప్రస్తుతం పాఠశాల యాజమాన్యం మారిందని, వారి సూచనల మేరకే తాము ఈ విధంగా వ్యవహరించామని ఎఒ వివరణ ఇవ్వబోయారు. దానిపై తహసీల్దార్ జ్ఞానాంబ, ఎంఇఒ విమల కుమారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే విద్యార్థులను అనుమతించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో వసూలుచేసే ఫీజులకు సంబంధించి తక్షణమే బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ సంఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఎంఇఒ విమల కుమారి తెలిపారు.

చిత్రం.. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను రోడ్డుపై నిలబెట్టిన దృశ్యం