ఆంధ్రప్రదేశ్‌

కుల ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 22: కులాలతో పెనవేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు ప్రధాన కులాల ఉద్యమాలతో వేడెక్కనున్నాయి. రాష్ట్ర జనాభాలో అతిపెద్ద కాపువర్గం బీసీ రిజర్వేషన్ల డిమాండుతో మహాపాదయాత్రకు సిద్ధమవుతుండగా, తమ చిరకాల వాంఛితమైన వర్గీకరణ డిమాండ్‌తో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగలు భారీ బహిరంగసభకు సమాయాత్తమవుతున్నారు. ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించిన వైనంతో ఆ సామాజికవర్గంలో చీలిక వచ్చింది. ఈ పరిణామాలన్నీ సర్కారుకు శిరోభారంగా పరిణమించాయి. సాంకేతికంగా అందరికంటే ఎక్కువ జనాభా ఉన్న కాపులు బీసీ రిజర్వేషన్ డిమాండుతో కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం వచ్చేనెల 26న తూర్పు గోదావరి కిర్లంపూడి నుంచి అమరావతికి 667 కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కాపు ఉద్యమానికి వైసీపీ బహిరంగమద్దతు ప్రకటించటంతో కులానికి తోడు, రాజకీయ దన్ను కూడా దక్కడంతో అందరి దృష్టి ముద్రగడ పాదయాత్రపైనే కేంద్రీకృతమయింది. అయితే, దీనికి అనుమతి లేదని, అనుమతి లేని యాత్రలను అడ్డుకుంటామని డిజిపి సాంబశివరావు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే స్పష్టం చేశారు. అయినా తాను పాదయాత్ర చేసేది ఖాయమని, ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేయడానికే పాదయాత్రకు సిద్ధమవుతున్నామని ముద్రగడ ఖరాఖండీగా చెబుతున్నారు. దీనితో ఇది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన ప్రభుత్వంలో మొదలయింది. అదీగాక అన్ని పార్టీల్లోని కాపులతో పాటు, టిడిపి నేతలు పరోక్షంగా ముద్రగడను ప్రోత్సహిస్తున్నారు. ముద్రగడ ఎంత బలంగా ఉంటే పార్టీలో తమకు అంత గౌరవం ఉంటుందని, లేకపోతే చంద్రబాబు తమను పట్టించుకోరన్న వ్యూహంతో ముద్రగడకు తెరవెనుక మద్దతునిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనితో పార్టీలోని కాపునేతలతోనే ముద్రగడ పాదయాత్రను ఎదుర్కొనే వ్యూహానికి టిడిపి తెరలేపింది. అయితే, హోంమంత్రి మినహా మిగిలినవారెవరూ ముద్రగడ స్థాయి నేతలు కాకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది. కాపు కార్పొరేషన్ నుంచి వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా, చైర్మన్-ఎండి అధిపత్యపోరు కారణంగా అవి పార్టీకి మైలేజీ తెప్పించేలా చేయడంలో కాపు కార్పొరేషన్ విఫలమవడమే దానికి కారణంగా కనిపిస్తోందంటున్నారు. అటు మాదిగలు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఎబిసిడి వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ, గత కొద్దికాలం నుంచీ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణను కొంతకాలం అమలుచేసి, అసెంబ్లీలో తీర్మానం చేసిన టిడిపి ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఎందుకు ఆ పనిచేయలేకపోతోందని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. గత కొద్దినెలల నుంచి మందకృష్ణ మాదిగ రాష్టవ్య్రాప్తంగా పర్యటిస్తూ, మాదిగలను సమీకరించే పనిలో ఉన్నారు. అటు కృష్ణమాదిగకు బిజెపి మద్దతునివ్వడంతో, ఈ వ్యవహారం అటు రాజకీయంగా సైతం ఆసక్తికరంగా మారింది. ఓ వైపు మిత్రపక్షమైన బిజెపితో సఖ్యతగా ఉంటున్న మందకృష్ణ, టిడిపిపై మాత్రం యుద్ధం ప్రకటిస్తుండటం చర్చనీయాంశమయంది. వచ్చే నెల 7న అమరావతిలో లక్షలమందితో కురక్షేత్ర సభ నిర్వహించేందుకు మందకృష్ణ సిద్ధమవుతున్నారు. అందుకు మాదిగ వర్గాలు ఆయనకు దన్నుగా నిలుస్తున్నాయి. పాదయాత్రలో తాను పెద్దమాదిగనని ప్రకటించి, తమ ఓట్లు పొందిన బాబు, వర్గీకరణపై తీర్మానం చేయకుండా మోసం చేశారన్న ఆగ్రహంతో ఉన్న మాదిగలు సర్కారుపై యుద్ధం ప్రకటించారు. తాజా పరిణామాలు సర్కారుకు శిరోభారంగా పరిణమించాయి. ఓ వైపు కేంద్రం నుంచి తగినంత నిధులు రాక, మరోవైపు వైసీపీ నుంచి ఎదురుదాడి, వరస అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న టిడిపి సర్కారుకు, ఈ కులాల కురుక్షేత్రం రాజకీయంగా ప్రమాదకరంగా పరిణమించింది.