ఆంధ్రప్రదేశ్‌

అన్ని మున్సిపాలిటీల్లో ఇక వ్యర్థాల నివారణ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: పర్యావరణ సుస్థిర అభివృద్ధికి వ్యర్థ నివారణ వ్యవస్థ అనేది అత్యంత ముఖ్యమైనదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, పట్టణాల్లో వ్యర్థ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోనే ప్రథమంగా విజయవాడ నగరంలో వ్యర్థాల సేకరణకు విద్యుచ్ఛక్తితో నడిచే 10 విద్యుత్ చోదిత హైడ్రాలిక్ ఆటో రిక్షాలను మంగళవారం వెలగపూడి సచివాలయం వద్ద సిఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ విద్యుత్ చోదిత వాహనాలను పంపిణీ చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. చెత్త సేకరణ, తరలింపునకు డీజిల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల ఇంధనం పొదుపుతోపాటు కాలుష్య నివారణకు అవకాశం ఉంటుందని చెప్పారు. జనాభాతో కిటకిటలాడే నగరాల నుండి చిన్న గ్రామాల వరకూ మన ఇళ్లను, పరిసరాలను అనవసర వ్యర్థాల నుండి విముక్తి చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో రానున్న ఐదేళ్లలో ప్రతి డీజిల్ ఆటోను ఈ విధంగా మార్చగలిగితే 35 టన్నుల కార్బన్ వాయువులను పర్యావరణంలో లేకుండా చేయవచ్చని సిఎం తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లోని సుమారు 5వేల వ్యర్థ సేకరణ డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చగలిగితే 2 లక్షల టన్నుల కార్బన్ వ్యర్థాలను నివారించవచ్చని చెప్పారు. కాబట్టి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి వాహనాలను ప్రవేశపెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో వ్యర్థ నిర్వహణ వ్యవస్థను ఒకే చోట నుండి గమనించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. మొబైల్, క్లౌడ్ టెక్నాలజీల అనుసంధానంతో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ఈ వాహనాల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు అందించడం వల్ల సత్వర చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇలాంటి అత్యాధునిక వ్యర్థ నివారణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల మనం కాలుష్యాన్ని నివారించి పరిశుభ్ర పరిసరాలను పొందడంలో సఫలీకృతం కాగలమని వివరించారు. అత్యాధునిక ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ టెక్నాలజీ అనుసంధానంతో వ్యర్థాలను సేకరించే పిక్ అప్ పాయింట్లు, ఆ వాహనాలు వెళ్లే దారులు, వ్యర్థాలను తొలగించే ప్రక్రియ, తదితర వివరాలను మున్సిపల్ సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు ఒకేచోట చూడగలిగే డ్యాష్‌బోర్డులను రూపొందించామని అన్నారు. ఈ విధానంతో నగరంలో వ్యర్థ నివారణ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. గతంలో విశాఖపట్నం నగరంలో 10 విద్యుత్ చోదిత బైక్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కమిషనర్ నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, విజయవాడ నగర డిప్యూటీ మేయర్ జి.రమణ, తదితరులు పాల్గొన్నారు.