ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు: డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 13: రాష్ట్రంలో కాపునేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదని రాష్ట్ర డిజిపి ఎన్ సాంబశివరావు స్పష్టం చేశారు. ఈపరిస్థితుల్లో యువతరం అప్రమత్తంగా ఉండి కేసుల్లో ఇరుక్కోకుండా భవిష్యత్‌ను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతలు, ఇతర అంశాలపై గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మూడు జిల్లాల పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ముద్రగడ పాదయాత్ర అంశంపై కూడా విస్తృతంగా చర్చించారు. అనంతరం డిజిపి సాంబశివరావు విలేఖరులతో మాట్లాడుతూ ముద్రగడ ఇంతకుముందు చేసిన ఆందోళనల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తటం తెల్సిందేనని, ఆ నేపధ్యంలో ఇప్పుడు ఆయన పాదయాత్రకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ పిల్లలు ఇలాంటి పాదయాత్రలో పాల్గొని భవిష్యత్‌ను పాడుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు పోలీసులు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటారన్నారు. కాగా విజయవాడ బంగారువస్తువుల తయారీ కేంద్రంలో జరిగిన భారీ దోపిడిపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించాయని, ఒకటి, రెండురోజుల్లో ఈకేసును ఛేదించుతామని తెలిపారు. పశ్చిమలో పలుమార్లు గంజాయి రవాణా అవుతూ పట్టుపడటంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ అసలు ఈ రవాణా నెట్‌వర్కును ఛేదించేందుకు భారీ కసరత్తు చేస్తున్నామన్నారు. సరిహద్దుప్రాంతాల్లో కొద్దిప్రాంతంలోనే గంజాయి పండించి రవాణా చేస్తున్నారని, అయితే ఈనెట్‌వర్కును పూర్తిస్ధాయిలో ఏవిధంగా ఛేదించాలన్న అంశంపై ప్రస్తుతం పూర్తిస్థాయి కసరత్తు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఒకటి, రెండు అంశాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తినా మొత్తంగా చూస్తే సంక్షేమ చర్యలు అనేకం అమలవుతున్నాయని చెప్పారు. పశ్చిమగోదావరిలో గరగపర్రు ఘటనలో పోలీసు చర్యలు తీసుకున్నామని, అయితే ఇప్పుడు అక్కడ శాంతిభద్రతల పరిస్ధితిని ప్రశాంతంగా ఉంచటంపైనే దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే ఆప్రాంతాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కూడా సందర్శించి ఇరువర్గాలతో చర్చించారన్నారు. అలాగే పోలీసుపరంగా అక్కడ తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకున్నామన్నారు.