ఆంధ్రప్రదేశ్‌

పార్టీ మార్పిడి కేంద్రాలుగా పోలీస్‌స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 14: రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లన్నీ పార్టీ మార్పిడి కేంద్రాలుగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరిచి, భయంతో వారిని అధికార పార్టీ సభ్యులుగా మార్చే కేంద్రాలుగా రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు పనిచేస్తున్నాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం వారు విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై రౌడీషీట్లు తెరిచి, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే వద్దకు వెళితే కేసులన్నీ ఎత్తేస్తామని ఆయా స్టేషన్ల ఎస్సైలు వారికి సలహాలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఒకవిధంగా పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం శహపురంలో రాయుడు సత్యనారాయణ, గుంటూరు జిల్లా నరసారావుపేటలో నీల చంద్రశేఖర్ పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. శహపురం ఘటనపై జిల్లాకు చెందిన హోంమంత్రి ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఐపిఎస్ అధికారులు వ్యవస్థను నాశనం చేయవద్దని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా తమ పార్టీ అధినేత జగన్ స్పదిస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తోందన్నారు. గత మూడేళ్లుగా ఎక్కడా ఒక్క ఎన్నిక కూడా జరిపించలేని స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. నీటి సంఘాలు, సొసైటీల ఎన్నికలు నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించారని ఎద్దేవాచేశారు. కాపులను బిసిల్లో చేరుస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటే ఆయనను నిర్బంధించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని ఎవరైనా ఉద్యమాలుచేస్తే వైసిపి తరపున తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు.

చిత్రం.. కాకినాడలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతున్న ధర్మాన, అంబటి రాంబాబు. ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్, కె కన్నబాబు ఉన్నారు