ఆంధ్రప్రదేశ్‌

కంచుకోటలో భగభగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 21: ఎలాంటి సందర్భంలోనైనా ఇంతకుముందే బాగుండేదన్న వ్యాఖ్య పశ్చిమగోదావరి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి అతికినట్టు సరిపోతుంది. అధికారంలో లేని పదేళ్లపాటు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు అధికారంలోకి వచ్చాక ఎవరికి వారుగా తయారయ్యారు. అధికారంలోకివచ్చి, మూడేళ్లు దాటుతున్న తరుణంలో పరిస్థితిని సమీక్షించుకుంటే ఇంతకుముందే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏకపక్షంగా టిడిపి-బిజెపి కూటమికి పశ్చిమగోదావరి జిల్లా మొత్తం జైకొట్టడం తెల్సిందే. బిజెపి తరఫున ఒకరు , టిడిపి నుంచి 14 మంది ఎమ్మెల్యేలు జిల్లాలో కొలువుదీరారు. వారిలో ఇద్దరు అమాత్యులుగా కూడా కొనసాగుతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం పైకి అంతా బాగున్నట్లు కన్పించినా ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా వర్గాలు మొదలై తమ్ముళ్ల మధ్యే దూరం మరింత పెరిగిపోతూ వస్తోంది. ఇక నేతల మధ్య ఎప్పటినుంచో ఉన్న దూరం అలాగే కొనసాగుతోంది. రాష్టస్థ్రాయిలో మిత్రపక్షంగా కొనసాగుతున్న బిజెపితో జిల్లావ్యాప్తంగానే సఖ్యత నేతిబీరకాయే. ఆ పార్టీకి జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండగా ఆయన కూడా మంత్రివర్గంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆ నియోజకవర్గంతోపాటు పరిసరప్రాంతాల్లో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే చెప్పాలి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేంద్రంగా ఈ రెండు పార్టీల మధ్య అంతరం మరింతగా పెరుగుతూనే వస్తోంది. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈ నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో కూడా అధికారకేంద్రాలుగా కొనసాగుతూ ఏ దశలోనూ రెండు పార్టీల క్యాడర్ మధ్య సఖ్యత లేకుండానే చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వివాదాలు తలెత్తటం, వాటిని అధినేత స్థాయిలోనే సరిచేసుకోవటం ఇక్కడ అలవాటుగా మారింది. ఇక ఇటీవలి వరకు మంత్రిగా పనిచేసిన పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలోనూ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. ఒకప్పుడు ఆ నియోజకవర్గం కేంద్రంగా మంత్రిగా పనిచేసిన కోటగిరి విద్యాధరరావు జిల్లా మొత్తాన్ని శాసించారు. అలాంటి నియోజకవర్గం ఇప్పుడు వర్గాలుగా వీడిపోయి ఎవరిదారి వారిది అన్నట్లుగా తయారయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులోనూ ఈ నియోజకవర్గం జాబితా చివరే ఉంటుంది. మాజీ మంత్రి సుజాత అన్నివర్గాలను కలుపుకుని వెళ్లలేకపోతున్నారు. దీంతో మిగిలినవర్గాలు తమ సొంత ఏజెండాతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి పరాకాష్ఠ శుక్రవారం చింతలపూడి మండలం ప్రగడవరంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశం అని చెప్పవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యే పీతల సుజాత లేకుండానే మరోవర్గం భారీఎత్తున జనసమీకరణతో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయటంతో బెంబేలెత్తిన పార్టీ నేత ఒకరు స్వయంగా ఫోన్ చేసి కంగారుపడవద్దని, శనివారం భీమడోలులో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పడంతో తాత్కాలికంగా ఇక్కడ అసంతృప్తికి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఇక గోపాలపురం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కాదని మరికొందరు తమ హవా చెలాయించేందుకు ప్రయత్నాలు చేయటంతో ఆ విషయంలోనూ అక్కడ కొంత దూరం పెరుగుతోందని చెప్పవచ్చు. స్వయంగా ఎమ్మెల్యేనే తనను తక్కువ అంచనా వేయవద్దంటూ హెచ్చరికలు చేయటం గమనార్హం. ఈవిధంగానే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అధికారపార్టీకి ఎదురీత తప్పడంలేదని చెప్పవచ్చు. అధికారంలో లేనంతకాలం కలిసి పోరాడిన తెలుగుతమ్ముళ్లు, నేతలు ఇప్పుడు తమలోతామే పోరాడుకునే పరిస్థితి రావడం బాధకరమంటూ పార్టీ సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు జనంలో ఇంతకుముందున్న మద్దతు ఇప్పుడు కన్పించకుండా పోతున్న తరుణంలో ఇలాంటి లుకలుకలు పార్టీ పుట్టి ముంచుతాయన్న అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలో శనివారం భీమడోలులో జిల్లాపార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అయితే ఎవరికివారు వర్గాలుగా విడిపోతున్న తరుణంలో, ఎవరికివారు సొంత బలం ఎంతో చూపుకునే తరుణంలో సమన్వయం ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తుందన్నది సందేహాస్పదమే.