ఆంధ్రప్రదేశ్‌

అనాథాశ్రమంలో వృద్ధులకు నరకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 22: కన్నబిడ్డలు ఆదరించకపోవడంతో దిక్కులేక అనాథాశ్రమంలో చేరిన ఆ అభాగ్యులకు అక్కడా నిరాదరణే ఎదురైంది. సమయానికి భోజనం పెట్టక, తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వక, రోగాలతో మంచాన పడితే పట్టించుకోకపోవడమేగాక చావచితగొట్టిన నిర్వాహకుల తీరుతో ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. చివరకు దేవుడి రూపంలో వచ్చిన జిల్లా జడ్జి వారిని ఆ నరకం నుంచి బయటపడేశాడు. కడప నగరంలోని గుడ్‌హార్ట్ ఫౌండేషన్ అనాథాశ్రమం అభాగ్యుల దీనగాథ ఇది. ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్‌తో స్పందించిన జిల్లా జడ్జి శ్రీనివాస్ పోలీసుల సాయంతో శనివారం రాత్రి అనాథాశ్రమానికి చేరుకుని అక్కడి వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరంలో గుడ్‌హార్ట్ ఫౌండేషన్ పేరిట అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు 50 మంది వృద్ధులు ఉంటున్నారు. ఓ వ్యక్తి జిల్లా జడ్జికి ఫోన్ చేసి అనాథాశ్రమంలో వృద్ధులకు భోజనం పెట్టడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన జిల్లా జడ్జి శ్రీనివాస్ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆర్డీవో చిన్నరాముడు, నగర డిఎస్పీ ఈజి అశోక్‌కుమార్, ఐసిడిఎస్ పిడి రాఘవరావును వెంటబెట్టుకుని అనాథాశ్రమానికి చేరుకున్నారు. అక్కడి వృద్ధులను విచారించగా వారు ఆర్తనాదాలు చేస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. కన్నబిడ్డలు తమను వదిలివేశారని, అనాథాశ్రమంలో చేరితే నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. సక్రమంగా భోజనం పెట్టడం లేదని , చివరకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఫిర్యాదుచేశారు. కొంతమంది జబ్బులతో మంచానపడినా వైద్యం అందించలేదని భోరుమన్నారు.
పైగా తమపై చేయిచేసుకుని చావచితగ్గొట్టారని నిర్వాహకులు కొట్టిన దెబ్బలను చూపించారు. వృద్ధుల ఆర్తనాదాలతో చలించిన జడ్జి వారిని ఓదార్చారు. వెంటనే అందరికీ భోజనాలు తెప్పించారు. గాయపడిన వారు, అనారోగ్యం పాలైన వారిని రిమ్స్‌కు తరలించి వైద్యం అందించారు. మంచాలపై నుంచి లేవలేక నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను జడ్జి స్వయంగా మోసుకెళ్లి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు. అండగా నిలుస్తానని అందరికీ ఆశ్రయం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అనాథాశ్రమం నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో సంస్థ నిర్వాహకులు గంగాదేవి, హరిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనాథాశ్రమం ప్రభుత్వ భవనంలోనే నిర్వహిస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.

చిత్రం.. అనారోగ్యానికి గురైన వృద్ధులను స్వయంగా
మోసుకెళ్తున్న జిల్లా జడ్జి శ్రీనివాస్