ఆంధ్రప్రదేశ్‌

రామానుజాచార్యుల వెబ్ పేజ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 10: శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రామానుజాచార్యులకు సంబంధించిన అధికారిక వెబ్ పేజ్‌ను ప్రారంభించాలని టిటిడి ఇ ఒ డి.సాంబశివరావు నిర్ణయించారు. మంగళవారం మహతి ఆడిటోరియంలో జరిగిన రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సదస్సులో పలు పుస్తకాలు, సీడీలను గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇందులో పలువురు లబ్ధప్రతిష్టులు ఆలపించిన ‘ అన్నమయ్య రామానుజ కీర్తనం’సిడిని, దివంగత గోపాలాచార్య స్వామి పారాయణం చేసిన నాలుగువేల పాశురాలుగల ‘నాలాయిర దివ్యప్రబంధం’ డివిడిని ఆవిష్కరించారు.

‘హోదా’ కోసం సిపిఐ ఆందోళన
అనంతపురం సిటీ, మే 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలో భాగంగా అనంతపురంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంపై మంగళవారం సిపిఐ, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులు, కార్యకర్తలు దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించి అధికారులను బయటకు పంపించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాణిజ్య శాఖ కార్యాలయానికి చేరుకుని సిపిఐ, ఆమ్ ఆద్మీ నాయకులను అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.

అవసరమైతే దుకాణాలు, ఇళ్లు ఖాళీ చేయిస్తాం
హైదరాబాద్, మే 10: వచ్చే కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడలో కృష్ణా నదీ తీరంలో భవానీపురం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న షాపులు, ఇండ్లను ఖాళీ చేయించేందుకు అవసరమైతే చర్యలు తీసుకుంటామని ఆంధ్ర రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తమకు తెలియచేయకుండా తమ ఇండ్లను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వ అదికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ కడియాల సీతారామయ్య, మరో ఎనిమిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది పిఎస్‌పి సురేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఇబ్రహీంపట్నం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 14 కి.మీ పొడువున పుష్కర ఘాట్‌లను నిర్మిస్తున్నారని, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నదీ తీరంలో ఉన్న ఇండ్లను దుకాణాలను ఖాళీ చేయించే చర్యలు తీసుకోవడం తగదని తెలిపారు. భూసేకరణ నిబంధనలు అమలు చేయకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సర్వే చేస్తోందని, దీని వల్ల అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించునట్లు కాదని తెలిపారు.

నేరాల అదుపునకు కమెండో కంట్రోల్
పలమనేరు, మే 10 : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో అత్యాధునిక పరిజ్ఞానం ద్వారా నేరాలు అదుపు చేయడానికి కమెండో కంట్రోల్ భవనం ఏర్పాటు చేసినట్లు డిజిపి రాముడు తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో కమెండో కంట్రోల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో నేరాల అదుపు కోసం ప్రత్యేక నిఘా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ద్వారా ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే పది వేల రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.

బీచ్‌లో మునిగిన
ముగ్గురూ టెన్త్ పాస్!
కొత్తవలస, మే 10: విశాఖ బీచ్‌లో మునిగిన ముగ్గురు విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో గట్టెక్కారు. మంగళవారం ఓ పక్క పది పరీక్ష ఫలితాలు వెలువడగా, మరోపక్క సముద్రంలో గల్లంతైన వారి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. దీంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన బి. వరప్రసాద్, కె.శేషు, ఎస్.శ్రావణ్ ఆదివారం సా యంత్రం విశాఖ బీచ్ వద్ద సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలను మంగళవారం స్వగ్రామానికి తరలించారు. వరప్రసాద్‌కు 8 జిపిఎ రాగా శ్రావణ్ 7.7, శేషు 6.3 జిపిఎ సాధించారు. ‘పది పాసయ్యారు లేవండంటూ’ వారి తల్లిదండ్రులు విలపించారు.

సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి
నంబులపూలకుంట, మే 10: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఏర్పాటైన అల్ట్రామెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లో మెగా కంపెనీలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఎన్‌టిపిసి డైరెక్టర్ ఎకె ఝా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఉత్పత్తిని ప్రారంభించారు. తరువాత సోలార్ ప్లేట్లను, ఇన్వర్టర్ గదులను ఎన్‌టిపిసి డైరెక్టర్ ప్రారంభించారు. సోలార్ హబ్ బాధ్యతలు తీసుకున్న మెగా, అమరరాజా, ల్యాంకో, స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీలు చేపట్టిన పనులను పరిశీలించారు. అమరరాజా కంపెని ఆధ్వర్యంలో నిర్మించిన 220 మెగావాట్ల సబ్‌స్టేషన్ సందర్శించారు. ప్రతి కంపెనీలో కంట్రోల్ రూంలను పరిశీలించారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లోని అన్ని కంపెనీలు వేగంగా పనులు చేయడం వల్లనే ఇంత త్వరగా ఉత్పాదన చేయగలుగుతున్నామన్నారు.

ప్రధానికి మరో లేఖ
విజయవాడ, మే 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చి చెప్పినా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఏదో విధంగా దాన్ని రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్ళయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు.
దాన్ని ఐదు సంవత్సరాలు ఇస్తామంటే, కాదు, పది సంవత్సరాలని అప్పటి ప్రతిపక్ష బిజెపిలోని వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీయే కోరారు. ప్రధాని మోదీ కూడా రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికీ హోదా రాకపోవడంతో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబునాయుడు, బిజెపి నాయకులు పడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు, మోదీకి మరో లేఖ రాయడానికి ఉపక్రమిస్తున్నారు. ఈ లేఖ డ్రాఫ్ట్ తయారవుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి? ప్రధాని తిరుపతి వచ్చినప్పుడు ప్రత్యేక హోదాపై ఆయన ఇచ్చిన హామీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ లేఖ తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 15న రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. 15న లేఖను పరిశీలిస్తారు. 16న జరిగే క్యాబినెట్‌లో ఈ లేఖ గురించి చర్చించి, అదే రోజున, లేక మర్నాడు దాన్ని ప్రధాని మోదీకి పంపించాలన్న ఆలోచనలో ఉన్నారు. త్వరలో ప్రధాని ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు, మోదీని కలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కూడా ఇదే అంశాన్ని మోదీ వద్ద తేల్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

స్థలాల కోసం
దరఖాస్తు గడువు
20 వరకు పొడిగింపు
విజయవాడ, మే 10: రాజధాని ప్రాంతంలో భూమి ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించేందుకు దరఖాస్తులు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసిందిగా గతంలో అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆ గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.

విద్యాసంస్థల్లో లింగమార్పిడి
విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు
హైదరాబాద్, ఏప్రిల్ 10: లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులకు విద్యాసంస్థల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధానంగా వారు ఇటు స్ర్తిలతోనూ, అటు పురుషులతో కలిసి సఖ్యంగా ఉండి చదువుకునే పరిస్థితి లేకపోవడంతో వారికి ప్రత్యేకించి ప్రతి విద్యాసంస్థలో సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. లింగమార్పిడి విద్యార్థులకు అవసరమైతే ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు, తరగతి గదులు కూడా నిర్వహించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లింగమార్పిడి విద్యార్థుల సంఖ్యను ప్రతి విద్యాసంస్థ నుండి ఇప్పటికే కేంద్రం సేకరించింది. అలాగే చాలా విద్యాసంస్థలు వారికి అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయని, మున్ముందు అలా జరగకుండా వారి లింగనిర్ధారణకు సంబంధించి ప్రత్యేక కాలమ్స్ రికార్డుల్లో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ అంశంపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ పలు సంస్థలు, ఏజన్సీలు, వ్యక్తులతో చర్చించి ఒక నివేదికను రూపొందించి అధ్యయనం కోసం ఇప్పటికే మంత్రిత్వశాఖకు అప్పగించింది. దీనిపై మరింత లోతైన పరిశీలన అనంతరం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

అధికార లాంఛనాలతో
చెన్నమనేని అంత్యక్రియలు
హైదరాబాద్, మే 10:తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి తరం కమ్యూనిస్టు నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో మంగళవారం జరిగాయి. చెన్నమనేని కుమారుడు, శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ తండ్రి చితికి నిప్పు అంటించారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అనారోగ్యంతో 93 ఏళ్ల వయసులో చెన్నమనేని రాజేశ్వరరావు సోమవారం అస్పత్రిలో మృతి చెందారు. అంత్యక్రియలకు మంత్రులు కె తారక రామారావు, నాయిని నర్సింహ్మారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో రాణించినపుడే
అధ్యాపక వృత్తికి సార్థకత
గీతం వైస్ ఛాన్సలర్ కె శివరామకృష్ణ
హైదరాబాద్, మే 10: బోధనారంగం తనదైన విశిష్టత కలిగి ఉందని, దానికి వనె్న తెచ్చేలా గీతం అధ్యాపకులు కృషి చేయాలని గీతం విశ్వవిద్యాలయం ప్రో వైస్ చాన్సలర్ కె శివరామకృష్ణ పిలుపునిచ్చారు. గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలోని అధ్యాపకులతో మంగళవారం నాడు ఆయన ముఖాముఖి నిర్వహించారు.
బోధన, పరిశోధన, కన్సల్టెన్సీ నిర్వహణ రంగంలో సామర్ధ్యాలను చాటినపుడే అధ్యాపకులు వృత్తిపరంగా రాణించగలరని అన్నారు. అధ్యాపకులు అంతా నిబద్ధతతో పనిచేయాలని, ఆనందంగా విధులు నిర్వహించాలని, కొత్త ఆలోచనలతో విద్యార్ధులను ఆకట్టుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయ పురోగతికి తన వంతు సహకారాన్ని ప్రతి ఒక్కరూ అందించాలని, బొట్టుబొట్టు సింధువుగా మారినట్టు, అందరి కృషి ఫలితంగానే ఏ విద్యాసంస్థ అయినా ఎదుగుతుందని ఆయన చెప్పారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనంలో 1980లో ప్రారంభమైన గీతం ప్రస్థానం కోటి చదరపు అడుగుల విశాల భవనాలకు చేరిందని, 160 మంది అధ్యాపకుల సంఖ్య 1200కు చేరిందని చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యాపకులు వంటబట్టించుకోవాలని, సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్ధి సమస్యలను అర్థ చేసుకుని బోధించగలిగితే , వారికి స్పష్టత వచ్చి రాణిస్తారని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఉద్బోధించారు. కొత్త అంశాలను తెలుసుకోవడానికి సవాళ్లు తోడ్పడతాయని, వాటిని స్వీకరించడానికి సదా సిద్ధంగా ఉండాలని అన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్ల
క్రమబద్ధీకరణపై సవాలు
హైదరాబాద్, మే 10: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు లెక్చెరర్ల సర్వీసుల క్రమబద్దీకరణపై కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు లెక్చెరర్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన సుచరిత మరి కొంత మంది ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

మంచి ర్యాంకు కోసం ఆగితే
ఉన్న ర్యాంకు పోయింది
దిక్కుతోచని స్థితిలో లాంగ్‌టెర్మ్ విద్యార్ధులు

హైదరాబాద్, మే 10: మెడికల్, డెంటల్ కాలేజీల్లో చేరాలంటే నీట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేలాది మంది లాంగ్‌టెర్మ్ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది ఇంటర్ పూర్తయి, ఎమ్సెట్‌లో మంచి ర్యాంకులు సాధించుకోలేకపోయిన విద్యార్థులు లాంగ్‌టెర్మ్‌లో చేరడం, మరోమారు ఏడాది పొడవునా శిక్షణ పొంది ఎమ్సెట్ రాయడం గత కొద్ది సంవత్సరాలుగా అలవాటుగా ఉంది. మెడికల్ స్ట్రీంలో అయితే విద్యార్థులు రెండు, మూడు సార్లు, చివరికి ఐదుసార్లు కూడా రాసిన వారున్నారు. అదే పనిగా నిరంతరం ప్రిపేర్ కావడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించడం, ఒక సారి అనుకున్న ర్యాంకు సాధించకలేకపోయినా, మరో సారి మంచి ర్యాంకు సాధించి సీట్లు సాధించడం జరుగుతోంది, ఈ క్రమంలోనే కార్పొరేట్ కాలేజీలు సైతం తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకులు వచ్చిన వారిని సైతం మరోమారు లాంగ్‌టెర్మ్‌లో చేరి ఇంకా మంచి ర్యాంకులు, టాపర్లుగా నిలిచేందుకు ప్రోత్సహిస్తున్నాయి. నీట్ సంగతి తెలియక గత ఏడాది ఎమ్సెట్‌లో ర్యాంకులు వచ్చినా, తమకు నచ్చిన కాలేజీల్లోసీట్లు రాలేదని భావించి, వదిలిపెట్టి లాంగ్‌టెర్మ్‌లో చేరిన విద్యార్థుల పరిస్థితి నేడు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. లాంగ్ టెర్మ్‌లో ఎలాగైనా ర్యాంకులు సాధిస్తామని నమ్మకంతో పరీక్షకు సిద్ధమైన వారందరికీ నీట్ పై తీర్పు పిడుగుపాటుగా మారింది. తాము ఎంతో కష్టపడి ఎమ్సెట్‌కు చదువుకున్నామని, సుప్రీం తీర్పుతో నేడు మళ్లీ తాము నీట్ రాయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కడుపు నిండా తిండి కూడా సరిగా తినకుండా ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అదే ధ్యాసతో తాము కష్టపడి చదివామని, ఇపుడు నీట్ రాయాలని చెప్పడం ఎంత వరకూ భావ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.