ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్ తవ్వకాల జిఓ బేషరతుగా రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 13: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఉద్దేశించిన జిఓ 97ను ప్రభుత్వం బేషరతుగా రద్దుచేయాలని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎపి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి బాక్సైట్ తవ్వకాలను చేపట్టకుండా తీర్మానం చేయాలన్నారు. ఇప్పటికే కేంద్రం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి రెండోదశ అనుమతులు మంజూరు చేసిందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వవైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. గ్రామసభలు ఏర్పాటుచేసి వారి ఆమోదం లేకుండా తవ్వకాలు చేపట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒడిశాలోని నియమగిరి కనుమల్లో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి వేదాంతకేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మన్యంలో గనుల తవ్వకాల అనుమతులకు సంబంధించి గ్రామసభలకే పూర్తి అధికారాలున్నాయన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 26న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే అప్పటి సిఎస్ అక్టోబర్ 13న జిఓ విడుదల చేశారని అన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకించగా, తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఇంకా అమల్లో ఉన్న జిఓ-97ను బేషరతుగా రద్దు చేయాలని, మన్యంలో తవ్వకాలను ఉపసంహరించుకోవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

రూ. రెండు కోట్ల గంజాయి పట్టివేత
మాడుగుల, మే 13: విశాఖ జిల్లా మాడుగుల మండలం కస్పాజగన్నాథపురం గ్రామ సమీపాన ఎక్సైజ్ అధికారులు శుక్రవారం భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువచేసే వెయ్యి కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. జి. మాడుగుల అటవీ ప్రాంతం నుంచి గంజాయిని దశలవారీగా మాడుగుల మండలం ఎరుకువాడకొండ సమీపాన నిల్వ చేశారు. గంజాయిని ట్రాక్టర్‌పై ఉండే మంచినీటి ట్యాంక్‌లో నింపి రాజమండ్రి తరలించేందుకు ప్రయత్నించగా వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉల్లి కొండబాబు, సాలాపు వరహాలబాబు, సుంకర నానాజీ, ఎ సత్తిబాబులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎక్సైజ్ సిఐ పాపునాయుడు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
నాదెండ్ల, మే 13: ఆగివున్న కంటైనర్‌ను కారు వేగంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గతనెల 9న మంగులూరులో నివాసం ఉంటున్న ముక్తిబేర (50) తన కుటుంబ సభ్యులతో కారులో కోల్‌కత్తా వెళ్ళారు. నెల రోజుల తర్వాత కోల్‌కత్తా నుండి ముక్తిబేర తన వ్యాపార పనుల నిమిత్తం మరో ఆరుగురు వ్యక్తులతో తన కారులో మంగులూరి వస్తుండగా శుక్రవారం తెల్లవారుఝామున నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారి వద్దకు రాగానే ఎదురుగా ఉన్న పోలీస్ హెచ్చరిక బోర్డులను అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ సంఘటనలో కారు ముందుటైరు పంచర్ అవడంతో వేగంగా వెళ్తూ పక్కనే ఆగివున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముక్తిబేర, సువర్చత గ్రేస్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో పయాణిస్తున్న హర్ధన్ సింగరాయ్ (40), సుమన (25), చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవర్‌తో ఆలీతో పాటు సీతారామ్ సంతోష్, ఉత్వల్‌కు తీవ్రగాయాలయ్యాయి.

అమరావతికి ఆరు లేన్ల రోడ్డు
కళ్యాణదుర్గం, మే 13 : ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కేంద్రాల నుంచి రాజధాని అమరావతికి చేరే అన్ని రోడ్లను ఆరు వరుసల రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రమైన అనంతపురం నుంచి అమరావతికి ఆరు వరుసల రోడ్ల నిర్మాణం కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో రోడ్లను నాలుగు వరుసల రోడ్లుగా మార్చడానికి రూ. 17.50 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను శుక్రవారం మంత్రులు శిద్దా రాఘవరావు, పల్లె రఘనాథరెడ్డి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి శిద్దా మాట్లాడుతూ రాజధాని అమరావతికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా రవాణా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజధానికి తక్కువ సమయంలో ప్రజలు చేరే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని, ఆయా పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రం కరవులో ఉంటే
విహారయాత్రలా!
బాబు వైఖరిని తప్పుబట్టిన రఘువీరా
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మే 13: రాష్ట్రంలోని పలు జిల్లాలో కరవు విలయతాండవం చేస్తోందని, మంచినీళ్లు లభించక ప్రజలు అల్లాడిపోతుంటే ఇవేమి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లడం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఉపాధి కరువై గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస పోతుంటే పట్టించుకోకుండా విలాసాలు, విహారాలతో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కరవు ప్రాంతాల సందర్శనలో భాగంగా రఘువీరారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకుల బృందం శుక్రవారం సాయంత్రం విజయనగరం మండలం గుంకలాం గ్రామాన్ని సందర్శించింది. కరవు పరిస్థితులు, చేపట్టిన సహాయక చర్యలు, ఉపాధిహామీ పనులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిరాజు అధ్యక్షతన జరిగిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు హామీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో కొత్తరుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డ్వాక్రా సంఘాలకు పూర్తి రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు మొక్కుబడిగా మాఫీ చేస్తున్నారన్నారు. అది కూడా సభ్యులందరికీ ప్రయోజనం చేకూరడం లేదన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా గడచిన రెండేళ్లలో 1.50 లక్షల మంది వివిధ స్థాయి ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆరోపించారు.

ప్రైవేట్ పెట్టుబడులతో
పర్యాటకానికి మహర్దశ

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 13: అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా నిలవాలనే లక్ష్యంతో ఇప్పటికే 1800 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టులను ఒక సంవత్సరంలో అందుకుంది. ఇప్పటికే వీటికి సంబంధించిన నిర్మాణ రంగ పనులు జరుగుతున్నాయి. అన్నీ కూడా ప్రైవేట్ రంగం పెట్టుబడుల ద్వారానే వచ్చాయి. ప్రస్తుతం 160కు పైగా ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో వౌలిక వసతులు అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడానికి ప్రభుత్వం కూడా పలు కార్యక్రమాలను ప్రారంభించింది. అందుకోసం 90కు పైగా ప్రాజెక్టులను ఈ సంవత్సర కాలంలోనే రూ.190 కోట్ల రూపాయలతో ప్రారంభించింది. సుప్రసిద్ధ హాస్పిటాలిటీ బ్రాండ్లు రాష్ట్రంలో 5స్టార్ ప్రాపర్టీలతో వస్తున్నాయి. విశాఖపట్నంలో 150 రూమ్‌ల సామర్థ్యంతో ఐటిసి, విజయవాడలో 200 రూముల సామర్థ్యంతో ఎకార్ గ్రూప్, చిత్తూరు జిల్లాలో 133 రూమ్‌ల సామర్థ్యంతో తాజ్ వంటివి నిర్మాణాలను ప్రారంభించాయి. రాష్ట్రంలో ఎంఐసీయు పర్యాటకాన్ని వృద్ధి చేయడానికి విశాఖపట్నం, చిత్తూరు, విజయవాడలలో కనె్వన్షన్ సదుపాయాలతో 3 స్టార్ ప్రాపర్టీలను ప్రారంభించాయి. మొత్తంమీద రాష్ట్రంలో 3 మరియు 5 స్టార్ విభాగాలలో 29 హోటల్స్‌కు సంబంధించిన పెట్టుబడులు వచ్చాయి. ఇవి 5 టూరిస్ట్ హబ్‌లు విశాఖపట్నం, కోనసీమ - రాజమండ్రి - కాకినాడ, అమరావతి - విజయవాడ, తిరుపతి - నెల్లూరు మరియు అనంతపురం - కర్నూలు - కడపలలో విస్తరించి ఉన్నాయి. పూర్తిస్థాయిలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా ముందుకువెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ మరియు ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించి కూడా భారీస్థాయిలో పెట్టుబడులను అందుకుంది. వీటిలో జీప్ పారాసెయిలింగ్, జెట్-స్కిలింగ్, స్పీడ్ బోట్స్ మరియు ఇతర వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాలను విశాఖపట్నంలో మరియు యాంపిబియస్ వెహికల్‌ను రాజమండ్రి మరియు విజయవాడలలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలలో సీ ప్లేన్, చిత్తూరులో రాక్ క్లైంబింగ్ వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో 30 పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయా జిల్లాల్లో జరుగుతున్నాయి. ఇవి పర్యాటక రంగ అభివృద్దికి తగిన వాతావరణం కల్పిస్తాయి. స్థానిక ప్రయాణావసరాలనుకూడా తీర్చేందుకు ఓలా క్యాబ్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మరియు తిరుపతిలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మెరు క్యాబ్స్ మరియు ఓలా ఆటో తమ సేవలను విశాఖపట్నంలో ప్రారంభించాయి.

తాత్కాలిక సచివాలయంలోనే
డిజిపి ఆఫీసు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 13: అమరావతి రాజధాని నగర ప్రాంతంలో పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం విజయవాడ ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో సిఆర్‌డిఎ అధికారులతో సమావేశమయ్యారు. తాత్కాలిక పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మాణం చేపట్టడానికి సుమారు 2 లక్షల 80 వేల చదరపు అడుగుల స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెలగపూడి ప్రభుత్వ భవనాల కాంప్లెక్సు సమీపంలో తగిన భూమిని కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. అడిషనల్ డిజిపి ఎన్‌వి సురేంద్రబాబు, ఎపిఎస్‌పి ఐజిపి ఆర్‌పి మీనా, విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు, సిఐడి అడిషనల్ డిజిపి సిహెచ్ డి తిరుమలరావు, లా అండ్ ఆర్డర్ ఐజిపి హరీష్ గుప్తా, అడ్మినిస్ట్రేషన్ ఐజిపి ఎన్ మధుసూధన్ రెడ్డి, విజయవాడ అడిషనల్ సిపి మహేచంద్ర లడ్హా, కృష్ణాజిల్లా ఎస్పీ జి.విజయకుమార్, గుంటూరు జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.