ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలలో గెలుపుపై టిడిపి నేతల హర్షాతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
- మంత్రి భూమా అఖిల ప్రియ
కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల నియోజకవర్గంలో తన సోదరుడు, టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తాము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. నంద్యాలలో సోమవారం ఓట్ల లెక్కింపు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తండ్రి భూమా నాగిరెడ్డికి ఇచ్చిన హామీ ప్రకారం నంద్యాల నియోజకవర్గం అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం విజయానికి కారణమైందని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి రాజకీయాల్లో కొనసాగుతున్న తాను ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ్చిన ప్రతి హామీని నిర్ణయించిన సమయంలోగా నెరవేరుస్తానని తెలిపారు. తమకు ఓటు వేస్తే ఇబ్బందులు తప్పవని వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఇతర బంధుగణంతో కలసి ప్రజలను బెదిరించినా వారు తమకే మద్దతు ఇవ్వడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.
ఓటర్ల రుణం తీర్చుకుంటా
- విజేత భూమా బ్రహ్మానందరెడ్డి

తనను భారీ మెజారిటీతో గెలిపించిన నంద్యాల ఓటర్ల రుణం తీర్చుకుంటానని ఉప ఎన్నికలో గెలుపొందిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తాను ఇప్పటికే నంద్యాలలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నానన్నారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా ఏ సమయంలోనైనా తనను కలవడానికి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల అనంతరం తాను ప్రజలకు కనిపించనని శిల్పా సోదరులు దుష్ప్రచారం చేసినా వారు నమ్మలేదన్నారు. తనను గెలిపించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
- మంత్రి దేవినేని డిమాండ్

విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్కడి ప్రజలు టిడిపి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించిన తీరు చూసైనా ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ జలవనరులశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ, నంద్యాల ఎన్నికలను సత్యానికి.. అసత్యానికి, ధర్మానికి.. అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా, 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా, ప్రభుత్వ పాలనకు రిఫరెండంగా జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారంటూ ఆయన అన్నట్లుగానే న్యాయం, ధర్మం వైపు నంద్యాల ఓటర్లు నిలబడ్డారన్నారు.
బాబు మూడేళ్ల పాలనకు రిఫరెండం
- ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి

నంద్యాలలో టిడిపి విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్ల పరిపాలనకు రిఫరెండం అని ఉమ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ప్రజలు సమర్థతకు, అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పైన నమ్మకం ఉంచినందుకు నంద్యాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూడా ఇంతే ఘనంగా ఉంటుందని చెప్పారు. నీతికి, అవినీతికి జరిగిన పోరులో అంతిమంగా నీతే విజయం సాధించిందన్నారు. కాల్చాలి, ఉరి తీయాలి అనే వారికి నంద్యాల ఓటర్లు తమ ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.
జగన్‌లాంటి నేతలు రాష్ట్రానికి నష్టమే
- మంత్రి అచ్చెన్నాయుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి నేతలు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. స్వయంగా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు రంగంలోకి దిగి ఓట్లు వేయమని ప్రాథేయపడినా నంద్యాల ప్రజలు వేయలేదన్నారు. నంద్యాలలో జగన్‌పైనా, అతని నాయకత్వంపైనా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని మంత్రి అన్నారు. సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి నంద్యాలలో 15 రోజులు మకాం వేసి గల్లీ గల్లీలో ఇంటింటికీ వెళ్లి కాళ్లు పట్టుకుని ఓట్లు అడిగినా ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారంటే అందరూ అర్థం చేసుకోవాలని, ఒకసారి ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారని, వారు కోరుకున్నది అభివృద్ధి, సంక్షేమమని అన్నారు. ఇటువంటి నాయకులు సమాజానికి చీడపురుగులాంటి వారని, ఇటువంటి నాయకుడు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయి మూడేళ్లైనా జగన్ హైదరాబాద్‌లోనే ఉన్నారని, ఈ ఫలితాలతో జగన్‌ను శాశ్వతంగా హైదరాబాద్‌కే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తెలుగు దేశానికి తిరుగులేదు
- నందమూరి బాలకృష్ణ
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన నంద్యాల ప్రజలకు సినీనటుడు, హిందుపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. భూమా బ్రహ్మానందరెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. టిడిపి గెలుపు చరిత్రాత్మకమన్నారు. అహర్నిశలు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న విషయం ఈ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొనసాగించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.