ఆంధ్రప్రదేశ్‌

భూమా కుటుంబానికి కలిసొచ్చిన ఉప ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 29: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత కలిగిన భూమా కుటుంబానికి ఉప ఎన్నికలు అచ్చొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా వీరిలో భూమా వీరశేఖరరెడ్డి మినహా అందరూ ఉప ఎన్నిక ద్వారానే చట్టసభలకు ఎన్నిక కావడం గమనార్హం. 1989 సాధారణ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎన్నికైన భూమా వీరశేఖరరెడ్డి 1992లో గుండెపోటుతో మరణించారు. దీంతో అదే ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి పోటీచేసి విజయం సాధించారు. 1996లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన నాగిరెడ్డి అదే ఏడాది నంద్యాల పార్లమెంటు సభ్యత్వానికి మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. ఆళ్లగడ్డ శాసన సభ్యత్వానికి భూమా రాజీనామా చేయడంతో ఆయన భార్య భూమా శోభానాగిరెడ్డి 1996లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అదే ఏడాది ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలో భూమా దంపతుల కుమార్తె భూమా అఖిలప్రియ ఎన్నికై శాసన సభలో అడుగుపెట్టారు. ఈ ఏడాది మార్చి 12న భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందటంతో ఆ కుటుంబం నుంచి ఐదవ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా ఒకే కుటుంబంలో నలుగురు ఉప ఎన్నిక ద్వారా శాసనసభకు వెళ్లడం గమనార్హం.
శిల్పా సోదరుల కలచెదిరింది!
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం శిల్పా సోదరుల భవిష్యత్తునే అతలాకుతలం చేసిందని చెప్పాలి. శాసనమండలి పదవిని వదులుకుని శిల్పా చక్రపాణిరెడ్డి, ఉప ఎన్నికలో ఓటమితో శిల్పా మోహన్‌రెడ్డి దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. దీనికి తోడు పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి కేసులు చక్రపాణిరెడ్డిని వెంటాడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న శిల్పా మోహనరెడ్డి, అప్పటికే టిడిపిలో కొనసాగుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి ఎన్నికల తరువాత అధికార హోదా అనుభవించారు. నంద్యాలలో వైకాపా తరఫున భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో టిడిపి ఇన్‌చార్జిగా శిల్పా మోహనరెడ్డి పని చేశారు. అధికారికంగా ఎలాంటి హోదా లేకపోయినా ఆయన నంద్యాలలో అనధికార ఎమ్మెల్యేగా కొనసాగారు. వైకాపా నుంచి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడంతో ఆయనకు గడ్డుకాలం ఎదురైంది. భూమా నాగిరెడ్డితో ఉన్న విభేదాల కారణంగా పార్టీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ అధినేత పలుమార్లు ప్రయత్నించినా వారిద్దరు రాజీ కాలేకపోయారు. ఇప్పుడు నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని శిల్పా మోహనరెడ్డి ప్రయత్నించి ఓడిపోయారు.