ఆంధ్రప్రదేశ్‌

మేయర్ ఎంపిక కత్తిమీద సామే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 3: కాకినాడ కార్పొరేషన్ మేయర్ ఎంపిక వ్యవహారం తెలుగుదేశం అధిష్ఠానానికి కత్తిమీద సాముగా మారింది. మేయర్ పదవిని కాపు సామాజికవర్గ మహిళకే కేటాయిస్తామని అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందుగా ప్రకటించిన విషయం విదితమే. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ల సంఖ్య అధికంగా ఉండటం, ఇతర అర్హతల్లోనూ ఎవరికి వారు తీసిపోని రీతిలో ఉండటంతో ప్రతిష్ఠాత్మకమైన మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై అధినేత సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మేయర్ పదవిని ఆశిస్తున్న మహిళా నేతలకు చెందిన గ్రూపులు ఎవరికి వారు రాజధాని స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ముఖ్యమంత్రి ఆశీస్సుల కోసం జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్య నేతల ద్వారా విజయవాడలో మకాం వేసినట్టు తెలుస్తోంది. కాకినాడ నగర పాలక సంస్థలో ఎన్నికలు జరిగిన 48 కార్పొరేటర్ స్థానాలకు గాను 39 స్థానాల నుండి తెలుగుదేశం, 9 డివిజన్ల నుండి బిజెపి అభ్యర్ధులు పోటీ చేశారు. 32 చోట్ల తెలుగుదేశం అభ్యర్ధులు, 3చోట్ల బిజెపి అభ్యర్ధులు విజయం సాధించారు. మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న నలుగురు మహిళా నేతలు విజయం సాధించిన వారిలో ఉన్నారు. అయితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరో అడుగు ముందుకువేసి మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో ఆరుగురు మహిళా కార్పొరేటర్లున్నారని చెప్పారు. 8వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా గెలుపొందిన అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్, 28వ డివిజన్ నుండి గెలుపొందిన సుంకర పావని, 38వ డివిజన్ నుండి గెలిచిన మాకినీడి శేషుకుమారి, 40వ డివిజన్ నుండి గెలిచిన సుంకర శివప్రసన్నలు మేయర్ పీఠాన్ని తొలి నుండి ఆశిస్తున్నవారిలో ఉన్నారు.
వీరుకాక ఇదే సామాజికర్గానికి చెందిన 44వ డివిజన్ కార్పొరేటర్ ఇ వెంకటరమణమ్మ, 45వ డివిజన్ నుండి విజయం సాధించిన కర్రి శైలజ పేర్లు కూడా కొత్తగా తెరపైకి వచ్చాయి. దీంతో మేయర్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కొండవీటి చాంతాడు చందాన తయారవుతోందని, మేయర్ ఎంపిక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తేనే మంచిదని పార్టీ స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఆశావహుల విషయానికొస్తే మేయర్ రేసులో ఉన్న అడ్డూరి లక్ష్మీశ్రీనివాస్ న్యాయవాది కావడంతో పాటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన ఘనత సాధించారు. మాకినీడి శేషుకుమారి భర్త వృత్తిరీత్యా వైద్యుడు కాగా పార్టీలో పైస్థాయిలో ఉన్న పలుకుబడి తనకు కలసివస్తుందన్న ధీమాతో ఉన్నారు. సుంకర శివప్రసన్న విషయానికి వస్తే విద్యాధికురాలు కావడంతో పాటు ఈమె భర్త విద్యాసాగర్‌కు తెలుగుదేశం పార్టీ నగర రాజకీయాల్లో పట్టుంది. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు తదితరుల ఆశీస్సులు తమకే ఉన్నట్టు నమ్ముతున్నారు. మరో పోటీదారు సుంకర పావని భర్త తిరుమలకుమార్ ప్రస్తుతం కాకినాడ నగర టిడిపి అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీలో సీనియర్ అయిన సుంకర కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యేలు సహా జిల్లా మంత్రులు కూడా తమకే మద్దతిస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.