ఆంధ్రప్రదేశ్‌

దర్గాలకు పట్టిన దెయ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు అధీనంలో ఉన్న దర్గాలను మానవ దెయ్యాలు పట్టిపీడిస్తున్నాయి. వేల కోట్ల విలువ చేసే ఆస్తులు పరాధీనం అవుతున్నాయి. మత విశ్వాసాలతో దర్గాలకు వచ్చే భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ముత్తవల్లీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా సౌకర్యాల కల్పన మృగ్యమవుతోంది. అంతేకాదు కోట్లాది రూపాయల హుండీల సొమ్ము స్వాహా అవుతోంది. అన్నింటికీ మించి గుంటూరు జిల్లా పెదకాకానిలో సుప్రసిద్ధ బాజీబాబా దర్గా వద్ద ఓ వ్యక్తి దొంగబాబా అవతారమెత్తి భక్తుల నెత్తిన టోపీ పెడుతున్నట్టు స్వయంగా గుర్తించిన వక్ఫ్‌బోర్డు అధికారులు మందలించే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా భక్తులను మోసగిస్తున్నారనేది అవగతమవుతుంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి పెదకాకాని దర్గాకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఏటా ఆంచనలు, నిమ్మ కాయలపైనే రూ. 10 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. హుండీ ద్వారా కోటి వరకు కానుకలను భక్తులు సమర్పిస్తుంటారు. దర్గా ఆధీనంలో ప్రస్తుతం 6.25 ఎకరాల భూమితో పాటు 2 కోట్ల రూపాయల నిధులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. అయితే దర్గాకు వచ్చే భక్తులకు సరైన సదుపాయాలు లేక మహిళలు, వృద్ధులు, పసి పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన రోడ్డు సదుపాయం కూడా లేకపోవటం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దర్గావద్ద రౌడీషీటర్లు దందాతో పాటు కొందరు దొంగ బాబాలు వెలవటంతో వక్ఫ్‌బోర్డు అధికారులు సిసి కెమేరాలు ఏర్పాటు చేశారు. ఈ దందాను ప్రత్యక్షంగా ప్రతిఘటించిన ఓ భక్తుడ్ని అంతమొంది స్తామని రౌడీషీటర్లు హెచ్చరించినట్లు సమాచారం. సిసి కెమెరాలకు చిక్కకుండా దొంగబాబా లీలలు సాగించడంతో వక్ఫ్‌బోర్డు అధికారులు కూడా మందలించారు. దర్గా సొమ్మును స్వాహా చేసి, అవకతవకలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై ప్రభుత్వం గతంలో పదిమంది వరకు ముత్తవల్లీలను విధుల నుంచి తొలగించింది. అయితే వీరిని నమ్ముకున్న వంద కుటుంబాల ముజావర్లు వీధినపడే దైన్య స్థితి నెలకొంది. దర్గా కమిటీ ఏర్పాటులో రాజకీయాలు చోటు చేసుకోవటంతో వక్ఫ్‌బోర్డు నేరుగా అధీనంలోకి తీసుకుని ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇక నెల్లూరులోని బారా షహీద్ దర్గా గత రెండేళ్ల క్రితమే వక్ఫ్‌బోర్డు అధీనంలోకి వచ్చింది. ఆదాయం కోటికి పైగానే ఉంటుంది. భక్తులకు ఇక్కడ మెరుగైన సదుపాయాలు ఉన్నప్పటికీ 1913లో మద్రాసు హైకోర్టు తీర్పు మేరకు తామే వారసులమంటూ ముత్తవలీలుగా తమకే అధికారం ఉండాలని కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో వక్ఫ్‌బోర్డు 11 నెలల లీజుకు 64.51 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అయితే దీని ఆదాయం అంతకు రెండింతల వరకు ఉంటుందని చెప్తున్నారు. వచ్చేనెల ఒకటో తేదీన నిర్వహించే రొట్టెల పండుగకు దర్గాను సిద్ధం చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు అందించే రూ.10 లక్షల నిధులతో పాటు అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. ప్రభుత్వం రొట్టెల పండుగను 2015 నుంచి రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది. ఈ ఏడాది 25 లక్షలమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఆదాయం తక్కువ కావడంతో సౌకర్యాల కల్పన జరగటంలేదు. కమిటీలలో కూడా రాజకీయ జోక్యం కారణంగా సదుపాయాలు కల్పించలేక పోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనే మరో సుప్రసిద్ధ కసుమూరులోని హజరత్ కరీముల్లా షా ఖాదిరీ దర్గా పరిధిలో భూములు ఉన్నప్పటికీ వసతులులేక భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఏడాది కోటీ 42లక్షల మేర ఈ దర్గా నిర్వహణకు ‘టెండర్’ వేశారు. కృష్ణాజిల్లా కొండపల్లి దర్గా కింద వేలకోట్ల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పటి వరకు వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరగలేదు. దర్గాల వద్ద జరుగుతున్న అరాచకాలకు అడ్డు కట్ట వేసేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టామని, అవకతవకలు జరిగే ప్రాంతాల్లో నేరుగా నిర్వహణ పర్యవేక్షిస్తున్నామని వక్ఫ్ అధికారి హుస్సేన్ స్పష్టం చేశారు.

చిత్రం..నెల్లూరు జిల్లాలోని కసుమూరు దర్గా