ఆంధ్రప్రదేశ్‌

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వ వాహనాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారు విహరించనున్న అన్ని వాహనాలను సిద్ధం చేశామని తిరుపతి జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. భక్తులకు అవసరమైన అన్ని వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగనున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి టిటిడి, పోలీస్, ఇతర శాఖల అధికారులు విస్తృతస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు. వాహనాల తనిఖీలను కూడా అన్ని విభాగాల అధికారులతో కలసి పూర్తిచేశామన్నారు. స్వర్ణరథానికి జ్యుయలరీ విభాగం అధికారులు చేయాల్సిన శుద్ధిని ఆ వాహనానికి రెండు రోజులు ముందు పూర్తిచేస్తారన్నారు. ఇక 9 రోజులపాటు ఉత్సవమూర్తులకు అలంకరించే ఆభరణాలను ఖజానా నుంచి తీసుకువచ్చి వాటిని వేరు చేసి ఉంచడం జరిగిందన్నారు. ఇక పుష్కరణి మరమ్మతులు పూర్తిచేసి కొత్త నీటిని కూడా నింపామన్నారు. ఇక అన్నప్రసాదం వద్ద ప్రసాదం స్వీకరించేందుకు అన్నప్రసాద భవనంలోకి వెళ్ళేవారు, వెలుపలికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామన్నారు. గరుడ సేవ రోజున బఫే విధానంతో అన్నప్రసాద వితరణ చేస్తామని, గ్యాలరీల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అవసరమైన అన్నపానీయాలను అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రతిరోజూ స్వామివారు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు వాహనాలపై విహరిస్తు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఈనెల 27వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవ రోజున స్వామివారు సాయంత్రం 7.30 గంటలకు మొదలై 5.30 గంటలపాటు నాలుగు మాడావీధుల్లో విహరిస్తారన్నారు. గ్యాలరీలో ఉన్న ప్రతి భక్తుడు స్వామిని తనివితీరా వాహనసేవను తిలకించేందుకు వీలుగా గరుడవాహన సేవను ప్రతి గ్యాలరీల వద్ద ఆపి దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. 19 ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమలలోని రద్దీ కూడళ్లలో 11 ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జెఇఓ చెప్పారు. తద్వారా గ్యాలరీల్లోకి ప్రవేశించ లేనివారు కూడా ఎల్‌ఇడి స్క్రీన్‌ల ద్వారా స్వామివారి వాహన సేవను దర్శించుకోవచ్చని అన్నారు. తిరుమల క్షేత్రంలో భక్తులు ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదనే దానిపై భక్తుల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాల రూపంలో భక్తులకు అందిస్తామన్నారు. ఇక గరుడ వాహనం రోజున భక్తులు టిటిడి, పోలీస్‌లు చర్చించి నిర్ణయించిన నిబంధనలు పాటించి సహకరించాలన్నారు. గరుడ వాహనం రోజున ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. తిరుమలలో ఏడువేల వాహనాలు మాత్రమే పార్క్ చేయడానికి సౌకర్యం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి మార్గంలోని భారతీయ విద్యాభవన్ వద్ద, దేవతా కాంప్లెక్స్ వద్ద టూ వీలర్స్, ఫోర్ వీలర్స్‌కు పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఈక్రమంలో వాహనాల్లో వచ్చిన భక్తులకు అక్కడ అలిపిరి బస్టాండ్ వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.