ఆంధ్రప్రదేశ్‌

వైకాపా సభలో రచ్చరచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 16: అనంతపురం జిల్లా వైకాపాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సోమవారం నగరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత బి.గుర్నాథరెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. దీంతో గుర్నాథరెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఎదురు దాడికి దిగింది. ఫలితంగా ఇరువర్గాలు ఆవేశకావేశాలతో కుర్చీలతో బాహాబాహీకి దిగారు. కుర్చీలను విరగ్గొట్టారు. సోమవారం మధ్యాహ్నం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే గుర్నాథరెడ్డి వర్గీయులు లోపలకు చొచ్చుకువచ్చారు. తమ నాయకుడికి పార్టీలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదని, ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులపాలు చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. గుర్నాథరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సమావేశాన్ని అడ్డుకున్నారు. మిథున్‌రెడ్డి తేరుకునే లోపే గొడవ పెద్దదైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో మిథున్‌రెడ్డితోపాటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, నగర సమన్వయకర్త నదీమ్, మాజీ మేయర్ రాగే పరశురాం తదితర నేతలు సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. సమావేశం నుంచి బయటకు వస్తున్న మిథున్‌రెడ్డిని గుర్నాథరెడ్డి వర్గీయులు అడ్డుకుని తమకు సమాధానం చెప్పాలని, సమావేశానికి హాజరు కావాలంటూ ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. కాగా గత కొన్ని నెలలుగా గుర్నాథరెడ్డి, ఆయన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి, మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి హాజరైన ఈ సమావేశానికి గుర్నాథరెడ్డికి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయనకు వైకాపాలో ప్రాధాన్యత తగ్గించారని, పార్టీలో విభేదాలు ఉన్నాయని ఈ సమావేశంతో స్పష్టమైందని పార్టీ వర్గీయులే చెబుతుండటం విశేషం. అయితే అనంతలో అంతంత మాత్రంగానే ఉన్న వైకాపాలో ఈ రచ్చతో పార్టీ బలహీనతను బయట పెట్టిందని పలువురు వ్యాఖ్యానించారు. దీనిపై మిథున్‌రెడ్డి స్పందిస్తూ జిల్లా టిడిపి నేతలు పన్నిన కుట్రలో భాగంగానే ఈ రచ్చ జరిగిందని ఆరోపించారు.