ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి వైకాపా అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 24: ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనర్హుడని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఆయన మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మార్టూరు, అద్దంకిలలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది. ప్రతిపక్ష నాయకులు నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రాగా ఉన్నారని ధ్వజమెత్తారు. కనీసం ఒక్కరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఇష్టపడని ప్రతిపక్ష నాయకులు తాము చేసే అభివృద్ధికి మాత్రం అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. 67 ఏళ్ల వయసులో రాష్ట్రం కోసం, అందరి పిల్లల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుఅహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని వైకాపా ఎంపిలు కేంద్రానికి లేఖలు రాశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంపై తాము కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పథకం నిధులు తీసుకువచ్చామని ఆయన తెలిపారు. పేదల పొట్టలు కొట్టవద్దని, వారిని కాపాడాలని వైకాపా ఎంపిలకు ఆయన హితవు పలికారు. ప్రజల ఓట్లతో ఆంధ్రాలో గెలిచి తెలంగాణాలో ఉంటూ ప్రవాసాంధ్రులుగా వైకాపా నేతలు ఉంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేశారని, అదేవిధంగా కుల, మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్షం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలంతా అభివృద్ధికి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలావుండగా డ్వాక్రా మహిళలు, రైతులు, ఉద్యానవన పంటల రైతులను ఆకట్టుకునే విధంగా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ 25 వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. అలాగే డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రతి మహిళకు ఆరు వేలు రుణమాఫీ చేశామని, మరో నాలుగు వేల రూపాయలు త్వరలోనే అందిస్తామని చెబుతూ డ్వాక్రా మహిళలను ఆకట్టుకున్నారు. ప్రతి కుటుంబానికి నెలకు పది వేల రూపాయలు ఆదాయం కల్పించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని, అందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో బిలిగేట్స్ ఫౌండేషన్‌తో కలిసి నవంబర్‌లో రెండు రోజుల పాటు వ్యవసాయ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించే టెక్నాలజీ అందుబాటులోకి రానున్నదని అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగాలంటే హార్టీకల్చర్‌ను పెద్దఎత్తున ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టి రికవరీ చేస్తామని లోకేష్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లాకు ఆరు నెలల్లో ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2019 సంవత్సరానికి లక్ష ఐటి ఉద్యోగాలు, రెండు లక్షల ఎలక్ట్రానిక్ తయారీ రంగ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 50 కోట్ల రూపాయలతో 170 కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని, మూడు నెలల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 2014కు ముందు గ్రామాల్లో విద్యుత్ లేదని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వంద రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల పాటు విద్యుత్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

చిత్రం..మార్టూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేశ్