ఆంధ్రప్రదేశ్‌

నల్లమలలో మళ్లీ మావోల కదలిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 24: సుదీర్ఘ విరామానంతరం నల్లమలలో మరోసారి మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి. ఈ అంశం పోలీసువర్గాలకు కునుకు పట్టకుండా చేస్తోంది. గతంలో ఇదే అటవీ ప్రాంతం నుంచి పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసిరిన సందర్భాలనేకం ఉన్నాయి. అంతేకాదు మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా నల్లమల అటవీ సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో గతంలో వ్యూహ, ప్రతివ్యూహాలతో గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొని ఉండేది. గత కాంగ్రెస్ ప్రభుత్వంతో 2005లో చర్చల నేపథ్యంలో గుంటూరు- ప్రకాశం జిల్లా చినకోరుట్ల వద్ద నుంచే మావోయిస్టులు బాహ్య ప్రపంచంలోకి అడుగిడారు. అయితే చర్చలు విఫలం కావటం.. ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో నల్లమల అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రనేతలంతా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఒబి)తో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు వలస వెళ్లారు. రాష్ట్ర విభజన అనంతరం ఏఒబి ప్రాంతంలో గత కొద్దినెలల క్రితం మల్కాన్‌గిరి వద్ద ఏపి పోలీసుల మూకుమ్మడి ఎదురుదాడిలో అక్కిరాజు హరగోపాల్ తనయుడితో పాటు 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. దీంతో ఏపిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని భావించారు. మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు ప్రతిగా ఒడిశా ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి జవాన్లను మట్టుపెట్టారు. దీంతో ఏఒబిపైనే పోలీసులు దృష్టి సారించారు. ఇలాఉంటే ఈ ఏడాది జూలై- ఆగస్టు నెలలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో పార్టీ క్యాడర్‌ను పునరుద్ధరించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. గ్రామాల్లో రిక్రూట్‌మెంట్లు జరిపితే పూర్తిస్థాయిలో పోలీసులకు సమాచారం అందుతోందనే ఉద్దేశంతో ఇకపై వ్యూహాత్మక అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర కమిటీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాన నగరాలు, పట్టణాలను టార్గెట్‌చేసి క్యాడర్ రిక్రూట్ మెంట్లు జరపాల్సిందిగా యాక్షన్ టీములకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇందులో భాగంగా నల్లమల అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉన్న సానుభూతిపరులు, మాజీల సహకారంతో ఏపిలో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడ, ఒంగోలు పట్టణాల్లో గత కొద్దిరోజులుగా రిక్రూట్‌మెంట్లకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో రాజధాని భద్రతకు సంబంధించి ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. గతంలో నల్లమల కేంద్రంగా రాకెట్ లాంఛర్లను సైతం మావోయిస్టులు ప్రయోగించి విఫలమయ్యారు. అయితే చత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మఢ్‌లో రాకెట్ లాంఛర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారని, ఇటీవల ఆ రాష్ట్రంలో రెండువిడతలు పోలీసులు, సైన్యంపై ప్రయోగించి సఫలీకృతులు కావటంతో రాజధాని ప్రాంతంలో లాంఛర్లను గుర్తించి..ప్రతిఘటించగల సామర్థ్యం ఉండేలా పోలీసు సిబ్బందికి తర్ఫీదు ఇస్తున్నారు. మైదాన ప్రాంతమైనందున ఇప్పటికే పోలీసులు డెమో నిర్వహిస్తున్నారు. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో యాక్షన్ టీంల కదలికలపై గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా ఎస్‌పి సిహెచ్ వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు ఓఎస్‌డి సిహెచ్ సుధాకర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు మంగళవారం నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబునగర్ జిల్లా అమ్రాబాద్, నాగర్‌కర్నూల్, మద్దిమడుగు తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న పది మంది వరకు మావోయిస్టులు ఇటీవల గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంతో పాటు జూలకల్లు రిజర్వు ఫారెస్టు ఏరియాలోని గుత్తికొండ, గుత్తికొండ బిలం ఏరియా, మేకలదినె్న, వీరప్పకుంట తండా, అయ్యనపాలెం, పాపాయపాలెం, కాకిరాల రిజర్వు ఫారెస్టు, వెల్దుర్తి రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోగల మర్సపెంట, బంగారుపెంట, జెండపెంట, అచ్చంపేట పులిచింతల అటవీ ప్రాంతాల్లో తిరిగినట్టు సమాచారం అందటంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలు, పోలీసుల కూంబింగ్ నేపథ్యంలో మరోసారి నల్లమల అటవీ సరిహద్దు గ్రామాల్లో అలజడి చెలరేగుతోంది.

చిత్రం..గుంటూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు